Switzerland: భారత్‌లో పెట్టుబడులకు స్విస్‌ కంపెనీల ఆసక్తి

Switzerland: భారత్‌-ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం (EFTA) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరిన నేపథ్యంలో భారత్‌లో పెట్టుబడులకు స్విట్జర్లాండ్‌ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని ఆ దేశ ఆర్థిక శాఖ సెక్రటరీ వెల్లడించారు.

Published : 17 Mar 2024 15:19 IST

దిల్లీ: చాక్లెట్‌ తయారీ సంస్థ బారీ క్యాలిబాట్‌, టెక్‌ సంస్థ బుహ్లర్‌ సహా స్విట్జర్లాండ్‌కు (Switzerland) చెందిన అనేక కంపెనీలు భారత్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని ఆ దేశ ఆర్థిక వ్యవహారాల సెక్రటరీ హెలెన్ బడ్లిగర్‌ తెలిపారు. హెస్‌ గ్రీన్‌ మొబిలిటీ 2025 నాటికి భారత్‌లో 3,000 విద్యుత్తు బస్సులను తయారు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. అందుకోసం వచ్చే 6-8 ఏళ్లలో 110 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.

బారీ క్యాలిబాట్‌ తన మూడో తయారీ కేంద్రాన్ని భారత్‌లో 2024లోనే ప్రారంభించే యోచనలో ఉందని బడ్లిగర్‌ తెలిపారు. గత ఐదేళ్లలో కంపెనీ ఇక్కడ 50 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. మరోవైపు భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించి 30 ఏళ్లు నిండిన సందర్భంగా వచ్చే 2-3 ఏళ్లలో బుహ్లర్‌ 23 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు ఆసక్తిగా ఉందని వెల్లడించారు. వీటితో పాటు అనేక చిన్న కంపెనీలు భారత్‌ వైపు చూస్తున్నాయని చెప్పారు.

స్విస్‌ వాచీలు,చాక్లెట్లు తక్కువ ధరలకే

రవాణ/రైల్వే, ప్రెసిషన్‌ ఇండస్ట్రీస్‌, ఆటోమేషన్‌ వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య వ్యాపారానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయని బడ్లిగర్‌ తెలిపారు. ఈ పరిశ్రమల్లో నాణ్యమైన ఉత్పత్తులు అందించడానికి స్విస్‌ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయన్నారు. అత్యంత వేగవంతమైన వృద్ధి నమోదు చేస్తున్న భారత్‌ వంటి దేశాలకు అది చాలా అవసరమని వివరించారు.

భారత్‌-ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం (EFTA) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరిన విషయం తెలిసిందే. దీంతోపాటు రాబోయే 15 ఏళ్లలో మన దేశంలోకి రూ.8.3 లక్షల కోట్ల కచ్చిత పెట్టుబడులకు హామీ లభించింది. ఇందువల్ల 10 లక్షలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయి. ఈఎఫ్‌టీఏలో స్విట్జర్లాండ్‌, ఐస్‌లాండ్‌, లిక్టన్‌స్టైన్‌, నార్వే సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ ఒప్పందంతో స్విట్జర్లాండ్‌ వాచీలు, కట్‌ అండ్‌ పాలిష్డ్‌ వజ్రాలు, చాక్లెట్లు, బిస్కెట్లు, గోడ గడియారాల వంటివి తక్కువ ధరలకే లభించే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని