Reliance Retail: రిలయన్స్‌ చేతికి అర్వింద్‌ ఫ్యాషన్స్‌ సౌందర్య ఉత్పత్తుల వ్యాపారం

Reliance: దేశీయ దిగ్గజ రిటైల్‌ సంస్థగా కొనసాగుతున్న రిలయన్స్‌ రిటైల్‌.. అర్వింద్‌ ఫ్యాషన్స్‌ బ్యూటీ బిజినెస్‌ను సొంతం చేసుకుంది. ఈ కొనుగోలు ఒప్పందం విలువ రూ.216 కోట్లు.

Published : 03 Nov 2023 16:32 IST

దిల్లీ: రిటైల్‌ వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తున్న వ్యాపార దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) మరో ముందడుగు వేసింది. అర్వింద్‌ ఫ్యాషన్స్‌ (Arvind Fashions)కు చెందిన సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విభాగాన్ని రిలయన్స్‌ రిటైల్‌ (Reliance Retail) అనుబంధ సంస్థ ‘రిలయన్స్‌ బ్యూటీ అండ్‌ పర్సనల్‌ కేర్‌ లిమిటెడ్‌’ సొంతం చేసుకుంది. ఇది పూర్తిగా ‘షేర్ల కొనుగోలు ఒప్పంద’మని అర్విద్‌ ఫ్యాషన్స్‌ శుక్రవారం వెల్లడించింది. కొనుగోలు ప్రక్రియ పూర్తయితే తమ వాటాలన్నీ రిలయన్స్‌ రిటైల్‌ చేతుల్లోకి వెళ్లిపోతాయని తెలిపింది. ఫలితంగా రిలయన్స్‌ రిటైల్‌కు ‘అర్వింద్‌ బ్యూటీ బ్రాండ్స్‌ రిటైల్’ అనుబంధ సంస్థగా మారుతుందని వెల్లడించింది. 

ఈ కొనుగోలు ఒప్పందం విలువ రూ.216 కోట్లని అర్వింద్‌ ఫ్యాషన్స్‌ (Arvind Fashions) తెలిపింది. అయితే, దీంట్లో రుణ చెల్లింపులు కూడా భాగమని పేర్కొంది. కొనుగోలు ప్రక్రియ పూర్తయితే.. తమకు రూ.99.02 కోట్లు అందుతాయని వెల్లడించింది. 2022- 2023 ఆర్థిక సంవత్సరంలో ‘అర్వింద్‌ బ్యూటీ బ్రాండ్స్‌ రిటైల్’ టర్నోవర్‌ రూ.336.70 కోట్లుగా నమోదైంది. అర్వింద్‌ ఫ్యాషన్స్‌ ఏకీకృత లాభాల్లో దీని వాటా 7.60%. టిరా బ్రాండ్‌ పేరిట రిలయన్స్‌ సౌందర్య ఉత్పత్తుల వ్యాపారంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.

రిలయన్స్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలోని రిటైల్‌ వ్యాపారాలన్నింటికీ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (RRVL) హోల్డింగ్‌ కంపెనీ. దేశీయ దిగ్గజ రిటైల్‌ సంస్థగా కొనసాగుతున్న రిలయన్స్‌ రిటైల్‌ భారత్‌లో వృద్ధి చెందుతున్న సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ విభాగంలో హెచ్‌యూఎల్‌ లాక్మే, నైకా, టాటా, ఎల్‌వీఎంహెచ్‌ సెఫోరాలతో పోటీ పడబోతోంది. రెడ్‌సీర్‌, పీక్ ఎక్స్‌వీ నివేదిక ప్రకారం.. 2027 నాటికి భారత సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల మార్కెట్‌ 30 బిలియన్‌ డాలర్లకు చేరుతుంది. ఇది ప్రపంచ మార్కెట్‌లో ఐదు శాతానికి సమానం. శుక్రవారం మధ్యాహ్నం 3:11 గంటల సమయానికి అర్వింద్‌ ఫ్యాషన్స్‌ షేరు విలువ 5.78 శాతం పెరిగి రూ.343.50 వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్‌ షేరు రూ.2319 దగ్గర ఫ్లాట్‌గా ట్రేడవుతోంది.

2023 సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్‌ (RRVL) నికర లాభం 21.04% వృద్ధితో రూ.2,790 కోట్లకు చేరుకుంది. ఆదాయాలు 19.48% పెరిగి రూ.68,937 కోట్లుగా నమోదయ్యాయి. అన్ని వినియోగదారు విభాగాల్లో వృద్ధి ఇందుకు కారణంగా నిలిచిందని కంపెనీ పేర్కొంది. మొత్తం స్టోర్ల సంఖ్య 18,446 నుంచి 18,650కు చేరింది. 71.5 మిలియన్‌ చదరపు అడుగుల్లో ఈ సంస్థల కార్యకలాపాలు నడుస్తున్నాయి. సంస్థ విలువను 100 బిలియన్‌ డాలర్లకు పైగా నిర్ధారించి, అంతర్జాతీయ పెట్టుబడుదార్ల నుంచి రూ.15,134 కోట్ల వరకు నిధులను కంపెనీ సమీకరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని