Stock Market: నష్టాల్లో సూచీలు.. 82 దాటిన రూపాయి!

Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు  శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి.

Updated : 07 Oct 2022 09:45 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. అక్కడ శుక్రవారం సెప్టెంబరు నెల ఉద్యోగ నియామక గణాంకాలు వెలువడనున్నాయి. వడ్డీ రేట్లు పెంచడానికి ఫెడరల్‌ రిజర్వు ఈ డేటాను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో అక్కడి మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా-పసిఫిక్‌ సూచీలు నేడు నష్టాలతో ట్రేడవుతున్నాయి. మరోవైపు గత రెండు సెషన్ల వరుస లాభాల నేపథ్యంలో మదుపర్లు కీలక స్టాక్స్‌లో లాభాలను స్వీకరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:29 గంటల సమయానికి సెన్సెక్స్‌ 124 పాయింట్ల నష్టంతో 58,098 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 36 పాయింట్లు నష్టపోయి 17,295 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టైటన్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, మారుతీ, టెక్ మహీంద్రా, విప్రో, రిలయన్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌, ఎంఅండ్‌ఎం, సన్‌ఫార్మా, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూ.82 ఎగువకు రూపాయి..

డాలరుతో పోలిస్తే రూపాయి విలువ మరింత పతనమైంది. ఈరోజు ఉదయం సెషన్‌లో ఓ దశలో 82.33 వద్ద జీవితకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే 0.25 శాతం కుంగింది. ఉదయం 9:25 గంటల సమయంలో రూ.82.25 వద్ద ట్రేడవుతోంది. అమెరికాలో ఉద్యోగ గణాంకాలు నిరాశపరిస్తే.. రేట్ల పెంపును ఫెడ్‌ మరింత వేగవంతం చేసే అవకాశం ఉందన్న అంచనాలతో డాలర్‌ బలపడింది.

నేడు గమనించాల్సిన స్టాక్స్‌...

టైటన్‌ కంపెనీ: ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో టైటన్‌ కంపెనీ విక్రయాలు 18 శాతం పెరిగాయి. కొత్తగా 105 స్టోర్లను తెరిచింది. అన్ని విభాగాల్లో రెండంకెల వృద్ధి నమోదైనట్లు తెలిపింది.

హెచ్‌సీఎల్‌ టెక్‌: వివిధ కంపెనీలకు డిజిటల్‌ సేవల్ని అందించే విషయంలో గూగుల్‌ క్లౌడ్‌తో కుదిరిన వ్యూహాత్మక ఒప్పందాన్ని హెచ్‌సీఎల్‌ టెక్‌ మరింత విస్తరించింది. అందులో భాగంగా హెచ్‌సీఎల్‌ టెక్‌ దాదాపు 18 వేల మందికి గూగుల్‌ క్లౌడ్‌పై శిక్షణనివ్వనుంది.

యెస్‌ బ్యాంక్‌: ప్రశాంత్‌ కుమార్‌ను మూడేళ్ల పాటు ఎండీ, సీఈఓగా నియమించేందుకు ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది.

ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఇ-కామర్స్‌ వెంచర్స్‌: పశ్చిమాసియా దేశాల్లో దుస్తులు, సౌందర్య ఉత్పత్తులు విక్రయిస్తున్న ‘అప్పారెల్‌ గ్రూప్‌’తో నైకా వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకొంది.

ఇండియన్‌ హ్యూమ్‌ పైప్‌ కంపెనీ: మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన జల్‌ జీవన్‌ మిషన్‌ ప్రాజెక్టు నుంచి ఇండియన్‌ హ్యూమ్‌ పైప్‌ కంపెనీకి రూ.194 కోట్ల ఆర్డర్‌ లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని