IPOs: వచ్చేవారం 7 ఐపీఓలు.. 8 లిస్టింగ్‌లు

IPOs: కొన్ని వారాలుగా ఐపీఓలు వరుస కట్టాయి. ఈ వారం కూడా అదే ట్రెంగ్‌ కొనసాగనుంది. రెండు మెయిన్‌బోర్డు, ఐదు ఎస్‌ఎంఈ ఐపీఓలు ప్రారంభం కానున్నాయి.

Updated : 10 Mar 2024 16:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వచ్చేవారం మెయిన్‌ బోర్డు విభాగంలో రెండు కంపెనీలు ఐపీఓకి (IPO) రానున్నాయి. ఐదు సంస్థలు ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో పబ్లిక్‌ ఇష్యూ ప్రారంభించనున్నాయి. మరోవైపు మెయిన్‌బోర్డులో మూడు, ఎస్‌ఎంఈలో ఐదు కంపెనీల షేర్లు లిస్ట్‌ కానున్నాయి. మొత్తంగా ఏడు ఐపీఓలు, ఎనిమిది లిస్టింగ్‌లు ఈవారం దలాల్‌ స్ట్రీట్‌ను బిజీగా మార్చనున్నాయి.

మెయిన్‌బోర్డు పబ్లిక్‌ ఇష్యూలు..

క్రిస్టల్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్వీసెస్‌ ఐపీఓ..

ఫెసిలిటీస్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ కంపెనీ క్రిస్టల్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్వీసెస్‌ ఐపీఓ మార్చి 14న ప్రారంభమై 18న ముగియనుంది. రూ.175 కోట్లు విలువ చేసే కొత్త షేర్లతో పాటు 17.5 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయించనుంది. రిటైల్‌ మదుపర్లకు 35 శాతం షేర్లను కేటాయించారు. షేరు ధరల శ్రేణిని ఇంకా ప్రకటించాల్సి ఉంది.

పాపులర్‌ వెహికల్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ఐపీఓ..

వాహన డీలర్‌షిప్‌ కార్యకలాపాల్లో నిమగ్నమైన పాపులర్‌ వెహికల్స్‌ అండ్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లేందుకు సెబీకి దరఖాస్తు చేసుకుంది. రూ.250 కోట్ల విలువైన తాజా షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో 1.42 కోట్ల షేర్లను కంపెనీ జారీ చేయనుంది. ధరల శ్రేణిని రూ.280-295గా నిర్ణయించింది. రిటైల్‌ మదుపర్లు రూ.14,750తో కనీసం 50 షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ ఐపీఓ మార్చి 12 నుంచి 14 వరకు జరగనుంది.

ఎస్‌ఎంఈ పబ్లిక్‌ ఇష్యూలు..

కేపీ గ్రీన్‌ ఇంజినీరింగ్‌ ఐపీఓ..

ఈ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూ మార్చి 15 నుంచి 19 వరకు కొనసాగనుంది. ధరల శ్రేణిని రూ.137-144గా నిర్ణయించింది. మదుపర్లు కనీసం 1,000 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రూ.189 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఏవీపీ ఇన్‌ఫ్రాకాన్‌ ఐపీఓ..

ఇన్‌ఫ్రా కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఏవీపీ ఇన్‌ఫ్రాకాన్‌ ఐపీఓ మార్చి 13న ప్రారంభమై 16 వరకు జరగనుంది. షేరు ధరల శ్రేణిని రూ.71-75గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.52.34 కోట్లు సమీకరించనుంది. పూర్తిగా కొత్త షేర్లను మాత్రమే జారీ చేయనుంది.

ప్రథమ్‌ ఈపీసీ ప్రాజెక్ట్స్‌ ఐపీఓ..

ఇంటిగ్రేటెడ్‌ ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌, కమిషనింగ్‌ సర్వీసెస్‌ ప్రొవైడర్‌గా ఉన్న ప్రథమ్‌ ఈపీసీ ప్రాజెక్ట్స్‌ ఐపీఓ మార్చి 11న ప్రారంభం కానుంది. 13 వరకు బిడ్లు దాఖలు చేయొచ్చు. పూర్తిగా కొత్త షేర్లను మాత్రమే జారీ చేస్తోంది. రూ.36 కోట్లు సమీకరించనుంది. షేరు ధరల శ్రేణిని రూ.71-75గా నిర్ణయించింది.

సిగ్నోరియా క్రియేషన్‌ ఐపీఓ..

రూ.9.28 కోట్ల సమీకరణ లక్ష్యంతో సిగ్నోరియా క్రియేషన్‌ ఐపీఓకి వస్తోంది. ఈ పబ్లిక్‌ ఇష్యూ మార్చి 12న ప్రారంభమై 14న ముగియనుంది. పూర్తిగా కొత్త షేర్లను మాత్రమే జారీ చేస్తోంది. షేరు ధరల శ్రేణిని రూ.61-65గా నిర్ణయించింది.

రాయల్‌ సెన్స్‌ ఐపీఓ..

రాయల్‌ సెన్స్‌ ఐపీఓ మార్చి 12న ప్రారంభమై 14న ముగియనుంది. రూ.9.86 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. షేరు ధరను రూ.68గా నిర్ణయించింది. మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌, సర్జికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, సర్జికల్‌ కన్జ్యూమబుల్స్‌, లేబొరేటరీ ఎక్విప్‌మెంట్‌, లేబొరేటరీ రీజెంట్స్‌, మెడికల్‌ డిస్పోజబుల్స్‌, డయాగ్నోస్టిక్‌ కిట్స్‌ను ఈ కంపెనీ తయారు చేస్తుంటుంది.

లిస్టింగ్స్‌ ఇవే..

మెయిన్‌బోర్డు సెగ్మెంట్‌లో జింక్‌ ఆక్సైడ్‌ తయారీ కంపెనీ జేజీ కెమికల్స్‌, రాజ్‌కోట్‌ కేంద్రంగా పనిచేస్తున్న వెస్టర్న్‌ స్నాక్స్‌ తయారీ సంస్థ గోపాల్‌ స్నాక్స్‌, ఆర్‌కే స్వామి షేర్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ కానున్నాయి. ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో పుణె ఈ-స్టాక్‌ బ్రోకింగ్‌, శ్రీ కర్ణి ఫ్యాబ్‌కామ్‌, కౌరా ఫైన్‌ డైమండ్‌ జువెలరీ, సోనా మెషినరీ, వీఆర్‌ ఇన్‌ఫ్రాస్పేస్‌ కంపెనీ షేర్లు ట్రేడింగ్‌ మొదలుపెట్టనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు