Stock Market Opening bell: భారీ లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market Opening bell: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి... 

Updated : 11 Aug 2022 09:41 IST

ముంబయి: అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లన్నీ కళకళలాడుతున్నాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా-పసిఫిక్‌ సూచీలు నేడు లాభాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సైతం గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. యూఎస్‌లో జూన్‌లో 9.1 శాతంగా నమోదైన ద్రవ్యోల్బణం జులై నాటికి 8.5 శాతానికి తగ్గింది. నిపుణులు ఇది 8.7 శాతంగా ఉండొచ్చని ముందు అంచనా వేశారు. కానీ, అంతకంటే తక్కువే నమోదుకావడంతో అమెరికా సూచీలు బుధవారం ర్యాలీ అయ్యాయి. మరోవైపు ఎఫ్‌ఐఐలు గత కొన్నిరోజులుగా నికర కొనుగోలుదారులుగా నిలుస్తుండడం మార్కెట్ల సెంటిమెంటును పెంచింది. కార్పొరేట్‌ ఫలితాలు బలంగా ఉండడం కూడా సూచీలకు కలిసొచ్చే అంశం.

ఉదయం 9:21 గంటల సమయానికి సెన్సెక్స్‌ 605 పాయింట్ల భారీ లాభంతో 59,422 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 159 పాయింట్లు లాభపడి 17,693 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.79.26 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో అన్ని స్టాక్స్‌ లాభాల్లో ఉండడం విశేషం. టెక్‌ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టైటన్‌ అత్యధికంగా లాభపడుతున్న వాటిలో ఉన్నాయి.

నేడు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌, అరబిందో ఫార్మా, బాటా ఇండియా, భారత్‌ ఫోర్జ్‌, గుజరాత్‌ అంబుజా ఎక్స్‌పోర్ట్స్‌, గ్రీవ్స్‌ కాటన్‌, గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌, హిమాద్రి స్పెషాలిటీ కెమికల్‌, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌, ది ఫీనిక్స్‌ మిల్స్‌, విపుల్‌ ఆర్గానిక్స్‌  

నేడు గమనించాల్సిన స్టాక్స్‌...

* హిందాల్కో జూన్‌ త్రైమాసికపు లాభం 48 శాతం పెరిగి రూ.4,119 కోట్లుగా నమోదైంది. కంపెనీ చరిత్రలో ఇది అతిపెద్ద త్రైమాపికపు లాభం కావడం విశేషం.

* ఎంఅండ్‌ఎంలో ఎల్‌ఐసీ తన వాటాను 8.43 శాతం నుంచి 6.42 శాతానికి తగ్గించుకొని రూ.2,222 కోట్లు ఆర్జించింది.

* జూన్‌ త్రైమాసికంలో టాటా కన్జ్యూమర్‌ ప్రోడక్ట్స్‌ లాభాలు 38 శాతం పెరిగి రూ.277 కోట్లకు చేరాయి. ఆదాయం 11 శాతం పెరిగింది.

* పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌ తొలి త్రైమాసికపు లాభాలు 64 శాతం పెరిగి రూ.358 కోట్లకు పెరిగింది. ఆదాయం 60 శాతం ఎగబాకడం విశేషం.

* ఐషర్‌ మోటార్స్‌ జూన్‌ త్రైమాసికంలో రూ.611 కోట్ల లాభాల్ని నివేదించింది. దాదాపు రెండింతల వృద్ధి నమోదైంది. అదే సమయంలో ఆదాయం 72 శాతం పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని