Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @16,985

Stock Market: సెన్సెక్స్‌ (Sensex) 126.76 పాయింట్ల లాభంతో 57,653.86 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 40.65 పాయింట్లు లాభపడి 16,985.70 దగ్గర ముగిసింది.

Published : 27 Mar 2023 16:09 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. దీంతో రెండు సెషన్ల వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది. ఉదయం ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ప్రారంభించిన మార్కెట్లు కాసేపటికే కొనుగోళ్ల అండతో లాభాల్లోకి ఎగబాకాయి. చివరి అరగంట వరకు ఆ జోరు కొనసాగింది. ఆఖర్లో మాత్రం అమ్మకాలు వెల్లువెత్తాయి. అయినా.. సూచీలు లాభాలను మాత్రం నిలబెట్టుకోగలిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు సూచీలపై ప్రభావం చూపాయి. ఐరోపా మార్కెట్లు మధ్యాహ్నం లాభాలతో ప్రారంభమయ్యాయి. దిగ్గజ షేర్లు రాణించడం సూచీలకు కలిసొచ్చింది. మరోవైపు సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ను ఫస్ట్‌ సిటిజన్‌ బ్యాంక్‌ కొనుగోలు చేయనుందన్న వార్తలు కూడా మార్కెట్‌లో పాజిటివ్‌ సెంటిమెంట్‌ను నింపాయి.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 57,566.90 దగ్గర ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 58,019.55- 57,415.02 మధ్య కదలాడింది. చివరకు 126.76 పాయింట్ల లాభంతో 57,653.86 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 16,984.30 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 17,091- 16,918.55 మధ్య ట్రేడైంది. చివరకు 40.65 పాయింట్లు లాభపడి 16,985.70 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రెండు పైసలు పుంజుకొని 82.37 దగ్గర నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో రిలయన్స్‌, సన్‌ఫార్మా, మారుతీ, ఎస్‌బీఐ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌యూఎల్‌, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్అండ్‌టీ, నెస్లే ఇండియా షేర్లు అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.

మార్కెట్‌లోని ఇతర విషయాలు..

మార్పిడి రహిత డిబెంచర్ల జారీ ద్వారా రూ.57,000 కోట్లు సమీకరించాలనే ప్రతిపాదనకు హెచ్‌డీఎఫ్‌సీ బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో కంపెనీ షేరు ఈరోజు స్వల్పంగా పెరిగి రూ.2,561 దగ్గర ముగిసింది.

విద్యుత్‌ సరఫరా, పంపిణీకి సంబంధించి ఎల్‌అండ్‌టీకి రూ.2,500 కోట్లు విలువ చేసే ప్రాజెక్టులు లభించాయి. దీంతో ఆరంభంలో షేరు భారీగా లాభపడింది. చివరకు లాభాల స్వీకరణతో షేరు విలువ రూ.15.25 నష్టపోయి రూ.2,150 వద్ధ స్థిరపడింది.

కీలక జనరిక్‌ ఔషధానికి అమెరికా ఎఫ్‌డీఏ నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో లుపిన్‌ షేర్లు ఈరోజు రాణించాయి. చివరకు 3.05 శాతం లాభంతో రూ.659.55 వద్ద స్థిరపడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని