Stock Market: లాభాల్లో ముగిసిన మార్కెట్‌ సూచీలు.. 18,300 పైకి నిఫ్టీ

Stock Market: సెన్సెక్స్‌ (Sensex) 234 పాయింట్ల లాభంతో 61,963.68 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 111 పాయింట్లు లాభపడి 18,314.40 దగ్గర ముగిసింది.

Published : 22 May 2023 16:01 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. ఉదయం మార్కెట్లు నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కానీ, కొద్దిసేపట్లోనే కొనుగోళ్ల అండతో లాభాల్లోకి ఎగబాకాయి. రోజంతా అదే తీరును కొనసాగించాయి. ఐటీ రంగ షేర్లతో పాటు రిలయన్స్‌, ఐటీసీ వంటి దిగ్గజ షేర్లు రాణించాయి. దీనికి అదానీ గ్రూప్‌ కంపెనీల స్టాక్స్ ర్యాలీ కూడా జతైంది.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 61,579.78 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో  62,044.46 దగ్గర గరిష్ఠాన్ని తాకింది. చివరకు 234 పాయింట్ల లాభంతో 61,963.68 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 18,201.10 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,335.25 దగ్గర గరిష్ఠానికి చేరింది. చివరకు 111 పాయింట్లు లాభపడి 18,314.40 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 13 పైసలు పతనమై 82.38 దగ్గర నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో టెక్‌ మహీంద్రా, విప్రో, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎల్‌అండ్‌టీ, సన్‌ఫార్మా, ఐటీసీ, టైటన్‌, మారుతీ షేర్లు లాభపడ్డాయి. నెస్లే ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు నష్టపోయాయి.

మార్కెట్‌లోని ఇతర విషయాలు..

గ్లాండ్‌ఫార్మా షేరు విలువ గత రెండు సెషన్‌లలో 33 శాతానికి పైగా పతనమైంది. ఇంట్రాడేలో రూ.861 దగ్గర 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. చివరకు 16.12 శాతం నష్టంతో రూ.893.85 దగ్గర నిలిచింది.

సుప్రీం కోర్టు నిపుణుల కమిటీ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్‌ షేర్లు ఈరోజు రాణించాయి. 10 నమోదిత కంపెనీల షేర్లు 5 శాతానికి పైగా పెరిగాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు విలువ 19.55 శాతం లాభపడి రూ.2,338.55 దగ్గర స్థిరపడింది. దీంతో అదానీ గ్రూప్‌ కంపెనీ మార్కెట్‌ విలువ రూ.10 లక్షల కోట్ల మైలురాయిని దాటింది.

 మార్చి త్రైమాసికంలో సానుకూల ఫలితాల నేపథ్యంలో జొమాటో షేరు ఉదయం లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించింది. మధ్యాహ్నం రూ.66.85 దగ్గర ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. లాభాల స్వీకరణ నేపథ్యంలో చివరకు 3.41 శాతం నష్టపోయి రూ.62.30 దగ్గర స్థిరపడింది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ అమలు కాంట్రాక్టును టీసీఎస్‌ నేతృత్వంలోని కన్షార్షియం సొంతం చేసుకుంది. టీసీఎస్‌ షేరు ఈరోజు 2.15 శాతం పుంజుకొని రూ.3,292 వద్ద ముగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని