Tata group: టాటా గ్రూప్‌ ఘనత.. మార్కెట్‌ విలువ ₹30 లక్షల కోట్లు

Tata group: టాటా గ్రూప్‌ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. గ్రూప్‌ మార్కెట్‌ విలువ రూ.30 లక్షల కోట్లు దాటింది. ఈ మైలురాయిని అందుకున్న తొలి గ్రూప్‌గా రికార్డుకెక్కింది.

Updated : 06 Feb 2024 20:13 IST

Tata group | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ వ్యాపార సంస్థ టాటా గ్రూప్‌ (Tata group) అరుదైన ఘనత సాధించింది. దేశీయ కంపెనీల్లో ఏ కంపెనీ ఇప్పటివరకు అందుకోని రికార్డ్‌ను సొంతం చేసుకుంది. తొలిసారి గ్రూప్‌ మార్కెట్‌ విలువ (market cap) రూ.30 లక్షల కోట్లు దాటింది. ఇటీవల కాలంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, టాటా మోటార్స్‌, టాటా పవర్‌, ఇండియన్‌ హోటల్స్‌ షేర్లు రాణించడంతో.. టాటా గ్రూప్‌ ఈ రికార్డు అందుకుంది.

టాటా గ్రూప్‌ కంపెనీల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) షేరు ఈ ఏడాది (2024) ఇప్పటివరకు 9 శాతం మేర రాణించింది. టాటా మోటార్స్‌ సైతం 20 శాతం మేర లాభపడింది. టాటా పవర్‌ 18 శాతం, ఇదే గ్రూప్‌నకు చెందిన ఇండియన్‌ హోటల్స్‌ షేర్లు 16 శాతం చొప్పున లాభపడ్డాయి. టాటా గ్రూప్‌నకు చెందిన 24 కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయి ఉన్నాయి. అయితే, ఇదే గ్రూప్‌నకు చెందిన తేజస్‌ నెట్‌వర్క్‌, టాటా ఎలెక్సీ, టాటా కెమికల్‌ షేర్లు 10 శాతం మేర ఈ ఏడాది నష్టపోయాయి. మిగిలిన స్టాక్స్‌ 1-5 శాతం మేర లాభపడ్డాయి.

త్వరలో పసిడి బాండ్ల సబ్‌స్క్రిప్షన్‌.. ఆన్‌లైన్‌లో ఎలా కొనాలి?

టీసీఎస్‌ ఒక్కటే..

టాటా గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ విలువ పెరుగుదలలో టీసీఎస్‌ది కీలక భూమిక. ఇటీవల ఆ కంపెనీ మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. మూడో త్రైమాసికంలో 8.1 బిలియన్‌ డాలర్ల విలువైన ఆర్డర్లను అందుకున్నట్లు పేర్కొంది. దీంతో గత కొన్ని రోజులుగా రాణిస్తున్న ఈ కంపెనీ షేరు.. మంగళవారం మరో 3 శాతానికి పైగా లాభపడి కంపెనీ మార్కెట్‌ విలువ రూ.15 లక్షల కోట్లు దాటింది. అంటే టాటా గ్రూప్‌ మొత్తం కంపెనీల విలువలో టీసీఎస్‌ వాటా సగం కంటే ఎక్కువ.

మరోవైపు చిప్‌ కొరత, ముడిసరకు ధరలు తగ్గడం, వాహనాలకు డిమాండ్‌ పెరగడం వంటి కారణాలతో టాటా మోటార్స్‌ మెరుగైన అమ్మకాలు నమోదు చేసింది. పునరుత్పాదక ఇంధనంపై ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో టాటా పవర్‌ రాణించింది. పర్యటక రంగానికి పెరుగుతున్న డిమాండ్‌ ఇండియన్‌ హోటల్స్‌కు కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో ఆయా షేర్లు రాణించాయి. టాటా గ్రూప్‌ సరికొత్త మైలురాయిని చేరుకోవడంలో కీలక భూమిక పోషించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని