Upper Bhadra Project: అప్పర్‌ భద్ర ప్రాజెక్టు అంటే?

ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకకు కేంద్ర బడ్జెట్‌ (Budget 2023)లో ప్రత్యేక నిధులు కేటాయించారు. ముఖ్యంగా అప్పర్‌ భద్ర ప్రాజెక్టు (Upper Bhadra Project) కోసం భారీ కేటాయింపులు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసలు ఈ ప్రాజెక్టు నేపథ్యాన్ని ఓసారి చూద్దాం..

Published : 01 Feb 2023 19:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్ణాటకలోని పశ్చిమకనుమల్లో ఆవిర్భవించే తుంగ, భద్ర వేర్వేరు నదులు. శివమొగ్గ జిల్లాలో రెండు కలవడంతో తుంగభద్ర (Tungabhadra)గా పిలుస్తారు. ఇది కృష్ణానదికి ఉపనది. రాష్ట్రంలో పలు నదులు ప్రవహిస్తున్నా కొన్ని ప్రాంతాల్లో తీవ్ర దుర్భిక్షం ఉంటుంది. ప్రత్యేకించి చిక్‌మగళూరు, చిత్రదుర్గ, దావణగిరె, తుమకూరు... తదితర జిల్లాలకు సాగు, తాగు నీరు అందించేందుకు ‘అప్పర్‌ భద్ర ప్రాజెక్టు’కు (Upper Bhadra Project) రూపకల్పన చేశారు. ఇది ఎత్తిపోతల పథకం. తుంగ నది నుంచి భద్రకు 17.40 టీఎంసీల నీటిని ఎత్తిపోతల ద్వారా తరలిస్తారు. అనంతరం భద్ర నుంచి 29.90 టీఎంసీల జలాలను అజ్జంపుర సమీపంలోని సొరంగం ద్వారా తరలిస్తారు.

మైక్రో ఇరిగేషన్‌కు ప్రాధాన్యం..

ఈ ప్రాజెక్టుతో దాదాపు రెండు లక్షల హెక్టార్ల భూమికి మైక్రో ఇరిగేషన్‌ ద్వారా నీటివసతి కల్పిస్తారు. కెనాల్‌ ద్వారా అనేక ప్రాంతాల్లో భూగర్భజలాలు కూడా పెరుగుతాయి.  ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను గతంలోనే కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై నేతృత్వంలోని మంత్రివర్గం ఆమోదించింది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ 12,340 కోట్లు. నిర్మాణానికి పూర్తికావడానికి నాలుగేళ్లు పట్టవచ్చు.

జాతీయస్థాయి హోదా

దాదాపు రెండు దశాబ్దాలుగాకు పైగా ఈ ప్రాజెక్టును నిర్మించాలని కర్ణాటకలోని మధ్య ప్రాంతాల వారు డిమాండ్‌ చేస్తున్నారు. దీనికి సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ జాతీయ హోదా స్థాయిని ఇచ్చింది.

ప్రత్యేకతలివే..

* కర్ణాటకలో భారీ ఎత్తిపోతల పథకం

* జాతీయ స్థాయి హోదా రావడంతో కేంద్రం నుంచి నిధులు రానున్నాయి

* రాష్ట్రంలో త్వరలో విధానసభ ఎన్నికలు ఉండటంతో కేంద్రం తాజా బడ్జెట్‌లో నిధులను కేటాయించింది

* ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయానికి ఆసరాగా నిలుస్తుంది

* చిత్రదుర్గ, తుమకూరు భూగర్భజలాల్లో ఫ్లొరైడ్‌ శాతం అధికంగా ఉంది. ఈ ప్రాజెక్టుతో స్వచ్ఛమైన తాగు నీరు లభిస్తుంది.

తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2023లో ఈ ప్రాజెక్టు కోసం రూ.5300 కోట్లను కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మైతో పాటు అధికార పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని