Rented House: ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

ఇల్లు షిఫ్ట్‌ కావడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి, అన్ని వసతులూ ముందుగానే చూసుకుని ఇల్లు మారడం వల్ల తరచూ మారాల్సిన పరిస్థితులు రావు. 

Published : 11 Jan 2023 10:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగం లేదా ఇతర కారణాల రీత్యా వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి రావచ్చు. అలాంటప్పుడు కొత్త ప్రాంతంలో ముందుగా వసతి ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకోసం ఇల్లు అద్దెకు తీసుకుంటుంటాం. చాలా మంది అద్దెకు తీసుకునేటప్పుడు వాస్తు చూస్తుంటారు. ఇతర విషయాలను అంతగా పట్టించుకోరు. కానీ ఇల్లు ఉన్న ప్రాంతం, ఇంటి వసతులు తదితర విషయాలు పట్ల కూడా శ్రద్ధ పెట్టాలి. ఇల్లు షిఫ్ట్‌ కావాలంటే ట్రాన్స్‌పోర్ట్‌ ఛార్జీలు, ఏసీ, ఫ్యాన్లు వంటి ఎలక్ట్రిక్‌ వస్తువులు అమర్చడం వంటి అనేక ఖర్చులు ఉంటాయి. వీటితో ఒకసారి ఇల్లు షిఫ్ట్‌ చేసేందుకు రూ.30 వేల నుంచి రూ.1 లక్ష వరకు కూడా ఖర్చు కావచ్చు. కాబట్టి, ఇల్లు తరచూ మారడం అంటే ఇంత డబ్బు ఖర్చు చేయాల్సిందే. అందువల్ల ముందే మన అవసరాలకు సరిపోయే ఇల్లు చూసుకోవడం వల్ల తరచూ మారాల్సిన పని ఉండదు. అలాగే డబ్బు వృథాగా ఖర్చుకాదు. 

ఇల్లు అద్దెకు తీసుకునే ముందు ఏం చూడాలి? 

అద్దె: స్థలం, భవనం వయసు, నిర్మాణ నాణ్యత, వసతులు వంటి వసతుల ఆధారంగా ఇంటి అద్దె ఉంటుంది. సాధారణంగా వార్షిక అద్దె ఆస్తి విలువలో 2-4% వరకు ఉంటుంది. ఆస్తి ప్రైమ్‌ ఏరియాలో ఉంటే డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అద్దె కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇంటి యజమాని అద్దెను నిర్ణయిస్తారు. కాబట్టి ఇంటిని అద్దెకు తీసుకునే సమయంలోనే దాని గురించి చర్చించాలి. ఎక్కువ అనిపిస్తే తగ్గించమని కోరవచ్చు.

వార్షిక పెంపు: చాలా వరకు ఇంటి యజమానులు.. ప్రతి సంవత్సరం ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం నిర్ణీత మొత్తం/శాతం ఇంటి అద్దె పెంచుతారు. ఇది 5 నుంచి 10% వరకు ఉండవచ్చు. అందువల్ల ఇల్లు అద్దెకు తీసుకునే సమయంలోనే దీని గురించి ఇంటి యజమానితో చర్చించాలి.

నిర్వహణ ఖర్చులు: సాధారణంగా అపార్టుమెంట్‌లో ఫ్లాట్‌ అద్దెకు తీసుకున్నప్పుడు మెయింటెనెన్స్‌ ఛార్జీలను వసూలు చేస్తారు. కామన్‌ ఏరియా క్లీనింగ్‌, లిఫ్ట్‌, ఎలక్ట్రిక్‌ ఖర్చులు, పార్కింగ్‌ ఖర్చులు, కామన్‌ రిపేర్లు, భద్రత ఇలాంటి వాటి కోసం నెల నెలా నిర్వహణ ఖర్చులు తీసుకుంటారు. ఇండివిడ్యువల్‌ ఇళ్లకు అయితే యజమానిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇల్లు అద్దెకు తీసుకునే ముందు నిర్వహణ ఖర్చుల గురించి కూడా తెలుసుకోవాలి.

డిపాజిట్‌: సాధారణంగా ఇల్లు అద్దెకు తీసుకున్నప్పుడు యజమానులు సెక్యూరిటీ డిపాజిట్‌ అడుగుతారు. రెండు నెలల నుంచి సంవత్సరం వరకు అద్దెకు సమానమైన మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్‌గా అడగవచ్చు. ఇది స్థానిక అద్దె మార్కెట్‌ను అనుసరించి వేర్వేరు నగరాల్లో వేర్వేరుగా ఉంటుంది. అద్దెదారులు ఇంటి అద్దెను చెల్లించకపోయినా యుటిలిటీ బిల్లులు, ఇతర బిల్లులు క్లియర్‌ చేయకపోయినా, ఆస్తికి నష్టం కలిగించినా ఈ సెక్యూరిటీ డిపాజిట్‌ నుంచి మినహాయించుకుని, ఇల్లు ఖాళీ చేసినప్పుడు మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు.

ప్రాథమిక సౌకర్యాలు: అద్దె కోసం ఇల్లు చూస్తున్నప్పుడు నీటి సరఫరా, విద్యుత్‌ వంటి ప్రాథమిక సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ ఇంటి యజమాని ఏర్పాటు చేస్తారు. ఒకవేళ యజమానులు వీటి సరఫరాకు ఆటంకం కలిగిస్తే, అద్దెకు తీసుకున్న వారు పోలీసు వారికి ఫిర్యాదు చేయవచ్చు. ఒకవేళ మీరు అపార్ట్‌మెంట్‌ హౌసింగ్‌ సొసైటిలో నివసిస్తుంటే నివాసితుల సంక్షేమ సంఘాన్ని సంప్రదించవచ్చు. ఏది ఏమైనా అద్దెకు తీసుకునే ముందు ప్రాథమిక వసతులను చూసుకోవాలి. దగ్గరలో మార్కెట్‌, రవాణా, ప్రాథమిక ఆసుపత్రి, మెడికల్‌ షాపు వంటి సౌకర్యాలు ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం మంచిది.

యజమాని యాక్సెస్‌: అద్దె ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత అంగీకరించిన సమయం వరకు ఫ్లాట్‌ అద్దెదారుకు చెందుతుంది. ఇంటిలో ఏమైనా మరమ్మతులు చేయాల్సి వచ్చినా అద్దెకు ఉన్నవారి అనుమతితోనే చేయించాలి. ఇంటి యజమాని, అద్దెకు ఉన్న వ్యక్తి మధ్య మంచి సంబంధాలు ఉంటే సమన్వయంతో పనులు పూర్తి చేసుకోవచ్చు. నిర్మాణం, సంబంధిత మరమ్మతుల ఖర్చులను యజమానులే భరించాల్సి ఉంటుంది.

భద్రత: ఇల్లు అద్దెకు తీసుకున్నప్పుడు ఆ ఇంటి పరిసర ఏరియాలో ఏ మేరకు సెక్యూరిటీ ఉందో చూసుకోవాలి. సాధారణంగా అపార్టుమెంటుల్లో వాచ్‌మెన్‌తో పాటు సీసీ టీవీ నిఘా కూడా ఉంటుంది. ఈ సౌకర్యాలు ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలి.

అద్దె ఒప్పందం..

ఇల్లు అద్దెకు తీసుకునే ముందు అద్దె ఒప్పంద పత్రం రాసుకోవాలి. ఇందులో అద్దెదారు.. వ్యవధి, రద్దు, అద్దె మొత్తం, నిర్వహణ ఖర్చులు, డిపాజిట్‌ మొత్తం, యజమాని తనిఖీలు వంటివన్నీ పొందుపరచాలి. స్టాంప్‌ పేపరుపై సక్రమంగా నమోదు చేయించాలి. వివాదం విషయంలో ఇది అద్దెదారు, యజమానుల ప్రయోజనాలను కాపాడుతుంది. 

ఇల్లు అమ్మేస్తే..

యజమాని ఇంటిని విక్రయించాలని నిర్ణయించుకుంటే.. ఆ విషయం మీకు తెలియజేయాలి. మీరు కొత్త యజమానికి కూడా అద్దెదారుగా కొనసాగితే, కొత్త ఒప్పందాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం లేదు. అదే అగ్రిమెంటును కొనసాగించవచ్చు. ఒకవేళ కొత్త యాజమాని ఇల్లు ఖాళీ చేయించాలనుకుంటే, అద్దెదారుకు ముందుగానే నోటీసు ఇవ్వాలి.

అద్దెకు తీసుకున్న వారికి ఉండే హక్కులు..

అద్దె నియంత్రణ చట్టం యజమానులతో పాటు అద్దెదారులకు రక్షణ కల్పిస్తుంది.

  • ఈ చట్టం ప్రకారం సరైన కారణం లేకుండా యజమాని, అద్దెకు ఉన్న వ్యక్తిని ఖాళీ చేయించలేరు. ఈ నియమ నిబంధనలు రాష్ట్రం నుంచి రాష్ట్రానికి కొంత భిన్నంగా ఉంటాయి.
  • ఇంటి అద్దె, ఆస్తి విలువపై ఆధారపడి ఉంటుంది. ఆస్తి విలువతో పోలిస్తే, అద్దె మొత్తం చాలా ఎక్కువ అని అద్దెదారు భావిస్తే అతడు లేదా ఆమె పరిహారం కోసం కోర్టును ఆశ్రయించవచ్చు. 
  • నీటి సరఫరా, విద్యుత్‌ మొదలైన అవసరమైన సేవలను పొందడం అద్దెదారు ప్రాథమిక హక్కు. అద్దె చెల్లించడంలో ఆలస్యం లేదా విఫలం అయినప్పటికీ ఈ సేవలను నిలిపి వేసే హక్కు యజమానికి ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు