Credit Card: ఈ టిప్స్‌తో క్రెడిట్‌కార్డ్ రివార్డు పాయింట్లను పెంచుకోవచ్చు!
Credit Card: క్రెడిట్ కార్డుని సరిగా ఉపయోగించుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. రివార్డు పాయింట్లు ఎంత మొత్తంలో పోగు చేసుకోగలిగితే డబ్బును అంత ఎక్కువ మొత్తంలో ఆదా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: క్రెడిట్‌కార్డు లావాదేవీల్లో వచ్చే అయిదేళ్లలో 21% వార్షిక వృద్ధి నమోదవుతుందని ఓ ప్రముఖ నివేదిక ఇటీవల అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం కార్డుల ఆదాయంలో క్రెడిట్‌కార్డుల (Credit Card) వాటాయే 76 శాతమని వెల్లడించింది. ఈ గణాంకాలు పెరుగుతున్న క్రెడిట్ కార్డుల వినియోగాన్ని సూచిస్తున్నాయి. చెల్లింపుల్లో ఉన్న సౌకర్యం, రివార్డు పాయింట్లు సహా ఇతర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చాలా మంది క్రెడిట్ కార్డులను (Credit Card) తీసుకుంటుంటారు. ఈ నేపథ్యంలో రివార్డు పాయింట్లను ఎంత ఎక్కువ మొత్తంలో పెంచుకోగలిగితే.. ప్రయోజనాలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. మరి అందుకు ఉన్న మార్గాలేంటో చూద్దాం..
నెలవారీ ఖర్చులకూ..
క్రెడిట్ కార్డు (Credit Card) ప్రత్యేక సందర్భాల్లో వాడుకోవడానికేనని చాలా మంది భావిస్తుంటారు. సమయానికి డబ్బులు లేనప్పుడో లేదంటే ప్రత్యేకమైన ఆఫర్లు ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగిస్తుంటారు. కానీ, అలా కాకుండా నెలవారీ ఖర్చులకు కూడా క్రెడిట్ కార్డునే వాడితే పెద్ద మొత్తంలో రివార్డు పాయింట్లను పొందేందుకు అవకాశం ఉంటుంది.
మొబైల్ వ్యాలెట్‌తో క్రెడిట్ కార్డు అనుసంధానం..
చాలా మంది మొబైల్ వ్యాలెట్‌ను నెట్‌బ్యాంకింగ్‌తో లోడ్ చేస్తుంటారు. కానీ, క్రెడిట్ కార్డు (Credit Card) ద్వారా వ్యాలెట్‌లోకి డబ్బు పంపించుకుంటే రెండు ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి క్రెడిట్ కార్డుపై రివార్డు పాయింట్లు లభిస్తాయి. అలాగే వ్యాలెట్‌తో చేసే యూపీఐ లావాదేవీలకు క్యాష్‌బ్యాక్ వంటి ప్రత్యేక ఆఫర్లు కూడా ఉంటాయి. అయితే, అన్ని సందర్భాల్లో ఇది వర్కౌట్ కాకపోవచ్చు. కొన్ని వ్యాలెట్లు క్రెడిట్ కార్డు ద్వారా లోడింగ్‌ను అనుమతించవు.
యుటిలిటీ బిల్స్..
ఫోన్, బ్రాడ్‌బ్యాండ్, ఎలక్ట్రిసిటీ, సొసైటీ మెయింటెనెన్స్, ఓటీటీ వంటి నెలవారీ బిల్లు చెల్లింపులకు చాలా మంది ఆటో డెబిట్ ఆప్షన్ పెట్టుకుంటారు. ఇలాంటి బిల్లులను కూడా క్రెడిట్ కార్డుతో (Credit Card) చెల్లించే సదుపాయం ఉంటుంది. ఇది కూడా రివార్డు పాయింట్లు పెంచుకునేందుకు ఒక మంచి మార్గం. అయితే, క్రెడిట్ కార్డు చెల్లింపుల వల్ల ప్రత్యేకంగా ఛార్జీలేమైనా వేస్తున్నారేమో చూసుకుంటే మేలు.
బీమా ప్రీమియం..
మనం ఏటా చెల్లించే బిల్లుల్లో బీమా ప్రీమియంల వాటా పెద్దగానే ఉంటుంది. ఇంట్లో ఉన్నవాళ్లందరూ ఏదో రకమైన బీమా పాలసీ తీసుకుంటుంటారు. వాటన్నింటికీ పెద్ద మొత్తంలో ప్రీమియంలు చెల్లిస్తాం. వీటిని కూడా క్రెడిట్ కార్డు (Credit Card) ద్వారానే చేస్తే ఏటా 1000- 5000 వరకు రివార్డు పాయింట్లు పొందేందుకు అవకాశం ఉంటుంది.
ఎన్‌పీఎస్ ఇన్వెస్ట్‌మెంట్..
ఊహాజనిత పెట్టుబడి సాధనాల్లో మదుపు చేసేందుకు క్రెడిట్ కార్డును (Credit Card) ఉపయోగించడం కుదరదు. కానీ, ఎన్‌పీఎస్‌కు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంది. ఎన్‌పీఎస్ రెండు టైర్లలో క్రెడిట్ కార్డును ఉపయోగించి పెట్టుబడి పెట్టొచ్చు.
ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువ పాయింట్లు..
పుట్టిన రోజు, పండగల వంటి ప్రత్యేక సందర్భాల్లో క్రెడిట్ కార్డు (Credit Card) జారీ సంస్థలు రివార్డు మల్టిప్లయర్ డీల్స్‌ను తీసుకొస్తుంటాయి. వీటిని ఉపయోగించుకుంటే సాధారణ సమయంలో కంటే అధిక మొత్తంలో రివార్డు పాయింట్లు లభిస్తాయి.
ప్రీమియం కార్డులూ పరిశీలించొచ్చు..
చాలా మంది జాయినింగ్ ఫీజు, వార్షిక రుసుము లేని కార్డులను తీసుకోవడానికి మొగ్గు చూపుతుంటారు. కానీ, ప్రీమియం కార్డును తీసుకోవడం వల్ల కొన్ని అధిక ప్రయోజనాలు ఉంటాయి. అయితే, అవి మీకు ఎంత వరకు సరిపోతాయనేది ముందే చూసుకోవాలి. వార్షిక రుసుము ఎక్కువ ఉన్నప్పటికీ.. కార్డు ద్వారా వచ్చే ప్రయోజనాలతో పోలిస్తే అది ఎక్కువ మొత్తమేమీ కాకపోవచ్చు. అయితే, కార్డు ద్వారా వచ్చే లబ్ధిని సక్రమంగా ఉపయోగించుకుంటేనే.. వాటిని తీసుకోవడంలో అర్థం ఉంటుంది.
సమీక్షించుకోవాలి..
పెట్టుబడులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్నట్లే.. క్రెడిట్ కార్డు (Credit Card) ప్రయోజనాలనూ రివ్యూ చేసుకోవాలి. తద్వారా మారుతున్న మీ అవసరాలకు అనుగుణంగా కార్డు ప్రయోజనాలు ఉన్నాయో..లేదో.. చూసుకోవాలి. క్రెడిట్ కార్డు జారీ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లతో కార్డులను తీసుకొస్తుంటాయి. వాటికి అప్‌గ్రేడ్ అయితే, మరింత ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Zoleka Mandela: నెల్సన్ మండేలా మనవరాలు కన్నుమూత
-
Leander Paes: టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు అరుదైన గుర్తింపు
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/09/23)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Guntur Kaaram: రాజమౌళి చిత్రాల స్థాయిలో ‘గుంటూరు కారం’.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా: నిర్మాత నాగవంశీ
-
Babar Azam: టాప్-4 చిన్న విషయం.. ప్రపంచకప్ గెలవడమే మా లక్ష్యం : బాబర్ అజామ్