Strongest Currency: అత్యంత బలమైన కరెన్సీలివే.. మన రూపాయి ర్యాంక్‌ ఎక్కడంటే..?

Strongest Currency: వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రపంచంలోనే అత్యంత బలమైన కరెన్సీల జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేసింది.

Updated : 17 Jan 2024 20:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీల జాబితాను (Strongest Currency List) ఫోర్బ్స్‌ విడుదల చేసింది. వాటి ప్రాముఖ్యతకు దోహదం చేసిన కారణాలనూ వివరించింది. కువైటీ దినార్‌ ఈ జాబితాలో తొలి స్థానంలో ఉంది. ఈ ఒక్క దినార్‌ విలువ భారత కరెన్సీలో రూ.270.23కు (3.25 డాలర్లు) సమానం. రూ.220.4 (2.65 డాలర్లు)తో బహ్రెయినీ దినార్‌ రెండో స్థానంలో ఉంది. ఈ జాబితాలో భారత కరెన్సీ రూపాయి (ఒక డాలర్‌=రూ.82.9) 15వ స్థానంలో ఉంది. 2024 జనవరి 10 నాటికి ఉన్న విలువల ఆధారంగా ఈ జాబితాను సిద్ధం చేశారు.

తొలి 10 కరెన్సీలివే..

  • కువైటీ దినార్‌ (రూ.270.23;  3.25 డాలర్లు)
  • బహ్రెయినీ దినార్‌ (రూ.220.4;  2.65 డాలర్లు)
  • ఒమన్‌ రియాల్‌ (రూ.215.84;  2.60 డాలర్లు)
  • జోర్డాన్‌ దినార్‌ (రూ.117.10; 1.41 డాలర్లు)
  • జిబ్రాల్టర్‌ పౌండ్‌ (రూ.105.52; 1.27 డాలర్లు)
  • బ్రిటిష్‌ పౌండ్‌ (రూ.105.54; 1.27 డాలర్లు)
  • కేమన్‌ దీవుల డాలర్‌ (రూ.99.76; 1.20 డాలర్లు)
  • స్విస్‌ ఫ్రాంక్‌ (రూ.97.54; 1.17 డాలర్లు)
  • యూరో (రూ.90.80; 1.09 డాలర్లు)
  • డాలర్ (రూ.82.9)

ఈ జాబితాలో అమెరికా డాలర్‌ పదో స్థానంలో ఉండడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యానికి విస్తృతంగా వినియోగిస్తున్న కరెన్సీ అమెరికా డాలర్‌ అని ఫోర్బ్స్‌ తెలిపింది. ప్రాథమిక కరెన్సీ రిజర్వ్‌గానూ దీనివైపే మొగ్గుచూపుతున్నట్లు పేర్కొంది. 1960లో ప్రవేశపెట్టినప్పటి నుంచి కువైటీ దినార్‌ ప్రపంచంలోనే అత్యంత బలమైన కరెన్సీగా కొనసాగుతోంది. చమురు నిక్షేపాలు, పన్ను-రహిత వ్యవస్థతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగడమే దీనికి కారణం. స్విస్‌ ఫ్రాంక్‌ ప్రపంచంలో అత్యంత స్థిరమైన కరెన్సీ అని ఫోర్బ్స్‌ తెలిపింది.

ఒక యూనిట్‌తో కొనుగోలు చేయగల వస్తువులు, సేవల సంఖ్య; మారకం ద్వారా వచ్చే విదేశీ కరెన్సీ మొత్తాన్ని మూల్యాంకనం చేయడం ద్వారా కరెన్సీ విలువను నిర్ణయించినట్లు ఫోర్బ్స్‌ వివరించింది. ఒక కరెన్సీ ప్రాముఖ్యతను నిర్ణయించడానికి సరఫరా-గిరాకీ, ద్రవ్యోల్బణం, దేశీయ ఆర్థిక వృద్ధి, కేంద్ర బ్యాంకుల విధానాలు, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలన్నీ క్షుణ్నంగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని