UK recession: మాంద్యంలోకి యూకే.. ఎన్నికల ముందు సునాక్‌కు షాక్‌

UK fell into recession: బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంది. ఎన్నికల ముందు రిషి సునాక్‌కు ఈ పరిణామం ఇబ్బందికరంగా మారనుంది.

Published : 15 Feb 2024 16:04 IST

UK recession | లండన్‌: బ్రిటన్‌ (UK) ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంది. 2023 చివరి త్రైమాసికంలో ఆర్థిక మాంద్యంలోకి వెళ్లింది. చివరి మూడు నెలల్లో యూకే జీడీపీ 0.3 శాతం క్షీణించినట్లు అక్కడి జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది. సేవలు, పారిశ్రామికోత్పత్తి, నిర్మాణరంగంలో స్తబ్ధత కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. వాస్తవానికి జీడీపీ క్షీణత 0.1 శాతం ఉండొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేయగా.. అంతకుమించి క్షీణించడం గమనార్హం. ఎన్నికల ఏడాది బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌కు ఇది ఇబ్బంది పెట్టే అంశమనే చెప్పాలి.

సాధారణంగా వరుసగా రెండు త్రైమాసికాల్లో జీడీపీలో మందగమనం నమోదైతే దాన్ని మాంద్యంగా వ్యవహరిస్తారు. బ్రిటన్‌ జీడీపీ అంతకుముందు త్రైమాసికంలోనూ 0.1 శాతం క్షీణించింది. దీంతో చివరి త్రైమాసికంలో మాంద్యంలోకి జారుకున్నట్లయ్యింది. 2020 తొలి అర్ధభాగంలో వృద్ధి నెమ్మదించడంతో బ్రిటన్‌ ఒకసారి మాంద్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత మళ్లీ  ఇదే తొలిసారి.

పేటీఎం ఎగ్జిక్యూటివ్‌లను ప్రశ్నించిన ఈడీ!

బ్రిటన్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కన్జర్వేటివ్‌ పార్టీకి ఈ పరిణామం గట్టి షాక్‌ అనే చెప్పాలి. ఈ ఏడాదిలోనే ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని రిషి సునాక్‌ తేదీలను నిర్ణయించాల్సి ఉంది. బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతామన్న హామీతో గద్దెనెక్కిన రిషి సునాక్‌కు  ఇది ఓ విధంగా ఇబ్బంది కలిగించే విషయం కానుంది. ఇప్పటికే వెల్లడవుతున్న వివిధ ఓపీనియన్‌ పోల్స్‌లో లేబర్‌ పార్టీ కంటే ఆ పార్టీ వెనకంజలో ఉంది.

మరోవైపు ద్రవ్యోల్బణం కట్టడికి బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ దూకుడుగా వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చింది. బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం నాలుగు దశాబ్దాల గరిష్ఠమైన 11 శాతానికి చేరడంతో.. 2022 నుంచి గతేడాది ఆగస్టు వరకు వివిధ సందర్భాల్లో కీలక వడ్డీ రేట్లను సున్నా నుంచి 5.25 శాతానికి చేర్చింది. ప్రస్తుతం యూకేలో ద్రవ్యోల్బణం 4 శాతంగా ఉంది. ఇది బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ నిర్దేశించుకున్న 2 శాతం లక్ష్యానికి చేరువైతే.. వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. దీంతో వృద్ధికి ఊతం లభిస్తుంది. అదే సమయంలో వడ్డీ రేట్లు తగ్గిస్తే.. ఆ మేర వినిమయం పెరిగి మళ్లీ ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ఆచితూచి వ్యవహరిస్తోంది.

జపాన్‌ సైతం మాంద్యంలోకి..

ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన జపాన్‌ సైతం మాంద్యంలోకి జారుకుంది. అక్టోబర్‌- డిసెంబర్‌ త్రైమాసికంలో జపాన్‌ వాస్తవిక జీడీపీ వృద్ధిలో వార్షిక ప్రాతిపదికన 0.4 శాతం క్షీణత నమోదైంది. త్రైమాసికం వారీగా చూస్తే 0.1 శాతం కుంగింది. అంతకుముందు త్రైమాసికంలోనూ 3.3 శాతం మేర జీడీపీ క్షీణించింది. దీంతో జపాన్‌ సైతం మాంద్యంలోకి వెళ్లినట్లయి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మూడో స్థానంలో ఉన్న జపాన్‌.. నాలుగో స్థానానికి చేరింది. జర్మనీ మూడో స్థానానికి చేరుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని