Movie ticket: సినిమా టికెట్‌తో పాటే స్నాక్స్‌ కొంటున్నారా? జేబుకు చిల్లు పడినట్లే!

GST on food items: సినిమా హాళ్లకు వెళ్లేవారికి అలర్ట్‌. ఇకపై టికెట్‌తో పాటే ఆహార పదార్థాలను కొనుగోలు చేయొద్దు. కారణం ఇదే..

Published : 14 Jul 2023 01:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమా హాల్‌కు (Cinema hall) వెళ్లి కౌంటర్‌ దగ్గర టికెట్‌ తీసుకోవడం చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడంతా ఆన్‌లైనే. కుటుంబ సమేతంగా సినిమాకు వెళ్లాలంటే ఆన్‌లైన్‌లో టికెట్లు (Online ticket booking) బుక్‌ చేసుకుంటున్నారు చాలా మంది. పనిలో పనిగా థియేటర్‌లోకి కావాల్సిన కూల్‌ డ్రింక్స్‌, పాప్‌కార్న్‌, ఇతర స్నాక్స్‌ను టికెట్‌తో పాటే కొనుగోలు చేసేస్తున్నారు. అయితే, ఇకపై అలా చేయకండి. ఒకవేళ టికెట్‌తో పాటే స్నాక్స్‌ కొనుగోలు చేస్తే మాత్రం మీ జేబుకు చిల్లు పడినట్లే. ఇటీవల జీఎస్టీ కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయమే ఇందుక్కారణం.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ (GST Council) 50వ సమావేశంలో సినిమా హాళ్లలో పానీయాలు, ఆహార పదార్థాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు 18 శాతంగా ఉన్న పన్నును (GST) 5 శాతానికి తగ్గించారు. ఈ నిర్ణయాన్ని మల్టీప్లెక్స్‌ ఆపరేటర్లు స్వాగతించారు. థియేటర్ల వ్యాపారం పుంజుకునేందుకు ఈ పరిణామం దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే, థియేటర్‌లో విక్రయించే ఆహార పదార్థాలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది.

ఒకవేళ టికెట్‌తో పాటూ ఆహార పదార్థాలు కొనుగోలు చేస్తే 18 శాతం జీఎస్టీ (సినిమా టికెట్‌ ధర రూ.100లోపు ఉంటే 12%, రూ.100 పైన ఉంటే 18%) వర్తిస్తుంది. కాంపోజిట్‌ సప్లయ్‌గా భావించి 18 శాతం పన్ను విధిస్తారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇకపై సినిమా హాళ్లకు వెళ్లేటప్పడు ఫుడ్‌ను ప్రీ బుక్‌ చేయొద్దని, ప్రవేశానికి టికెట్‌ మాత్రమే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని