Cyber crime: స్విగ్గీ అకౌంట్‌తో ₹97వేలు దోచేశారు..

Cyber crime: ఆన్‌లైన్‌ డెలివరీలు యాప్‌లు వినియోగిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని కేటుగాళ్లు కొత్త తరహా మోసానికి తెరతీశారు. అలా ఓ మహిళ స్విగ్గీ అకౌంట్‌ నుంచి ఏకంగా రూ.97 వేలు దోచుకున్నారు.

Published : 21 Feb 2024 02:16 IST

Cyber crime | ఇంటర్నెట్‌డెస్క్‌: పెద్ద ఎత్తున ఆఫర్లు, లక్కీ డ్రాలో బహుమతులు అంటూ అమాయక ప్రజలను నమ్మించి మోసం చేసే సైబర్‌ నేరగాళ్లు (Cyber crime).. ఇప్పుడు మరో అవతారం ఎత్తారు. ఆన్‌లైన్‌ డెలివరీ యాప్‌లు వినియోగిస్తున్న వారినే లక్ష్యంగా చేసుకొని కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ఖాతా హ్యాక్‌ అయిందంటూ నమ్మించి అకౌంట్‌లోని డబ్బుల్ని ఎగరేసుకుపోతున్నారు. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు.

ఐవీఆర్‌ (Interactive Voice Response) అనే సాంకేతిక సాయంతో సైబర్‌ నేరగాళ్లు ఓ మహిళకు (26) కాల్‌ చేశారు. స్విగ్గీ అధికారులమని, ఖాతా హ్యాక్‌ అయిందని మాయమాటలు చెప్పారు. అకౌంట్‌ను యాక్సెస్‌ చేయడానికి అపరిచితులు ప్రయత్నిస్తున్నారని నమ్మించారు. ఖాతాను రక్షించడానికి మరికొంత సమాచారం తెలపాల్సి ఉంటుందన్నారు. నిజంగానే తన అకౌంట్‌ ప్రమాదంలో పడిందేమోనని నమ్మిన మహిళ వెంటనే తన యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ వంటి వ్యక్తిగత వివరాలు తెలిపింది. అంతే తన ఖాతా నుంచి రూ.97వేలు మాయమయ్యాయి.

స్విగ్గీ అకౌంట్‌కు లింక్‌ చేసిన బ్యాంక్‌ ఖాతా నుంచి డబ్బులు పోయాయని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురుగ్రామ్‌కు చెందిన అనికేత్ కల్రా (25), హిమాన్షు కుమార్ (23) దోషులుగా గుర్తించి అరెస్టు చేశారు. వీరిలో కల్రా అనే వ్యక్తి ఇంతకుముందు స్విగ్గీ, జొమాటోలో డెలివరీ బాయ్‌గా పని చేశాడని, ఆ సమయంలో కిరాణా వస్తువుల్ని తక్కువ ధరలకు కొని లాభం కోసం తిరిగి విక్రయించేవాడని తెలిసింది. ఇలా ఆన్‌లైన్‌ ఆర్డర్లు చేసేవారి సమాచారం సేకరించి హిమాన్షుతో కలిసి డబ్బుల్ని దోచుకుంటున్నారనే విషయం బయటపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని