logo

అప్పు చేసి.. వేచి చూడు

మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం దొనబండలో ఉపాధిహామీ పథకంలో మంజూరైన ఈ సీసీ రోడ్డును రూ.5 లక్షలు వెచ్చించి ఇటీవలే పూర్తిచేశారు. ఇలాంటివి మూడు రహదారులను రూ.15 లక్షలతో

Updated : 28 May 2022 05:41 IST

ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో సర్పంచులకు అవస్థలు

మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం దొనబండలో ఉపాధిహామీ పథకంలో మంజూరైన ఈ సీసీ రోడ్డును రూ.5 లక్షలు వెచ్చించి ఇటీవలే పూర్తిచేశారు. ఇలాంటివి మూడు రహదారులను రూ.15 లక్షలతో పనులు పూర్తిచేశారు. ప్రభుత్వం ఇంతవరకు డబ్బులు చెల్లించకపోవడంతో అవస్థలు పడాల్సి వస్తుందని సర్పంచి తెలిపారు. ఇలా మరో ప్రజాప్రతినిధి నిర్మించిన రహదారికి గత మూడేళ్లుగా డబ్బులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పనులు చేస్తే వడ్డీలు చెల్లించడం కష్టంగా మారిందన్నారు.

మంచిర్యాల గ్రామీణం, న్యూస్‌టుడే

పనులు చేసి ప్రజల్లో పేరుతెచ్చుకోవాలనే లక్ష్యంతో ఉమ్మడి జిల్లాలోని అనేక గ్రామాల సర్పంచులు అప్పులు తెచ్చి మరీ పనులు పూర్తిచేశారు. నెలలు గడుస్తున్నా చేసిన పనుల బిల్లుల బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. పనుల కోసం ఉపాధిహామీ, ఎస్‌ఎఫ్‌సీ, ఎమ్మెల్యే నిధులు ఇలా అనేక రకాలుగా చెల్లిస్తామని చెప్పడంతో పనులు చేశారు. గత మార్చి నుంచి ఇంతవరకు సర్పంచులు రాసిన చెక్కులు చెల్లడం లేదు. నిధులపై ఫ్రీజింగ్‌ పెట్టడంతో చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతున్నామని వాపోతున్నారు. పక్కాగా మంజూరయ్యే పనులను గుత్తేదారులకు కేటాయించిన అధికారులు, డబ్బులు బకాయిపడే అవకాశం ఉండే పనులను మాత్రం సర్పంచులతో చేయించి మమ్మల్ని అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

నిధుల కోసం నిరీక్షణ..

ఉమ్మడి జిల్లాలోని గ్రామాల్లో అనేక రకాల అభివృద్ధి పనులను సర్పంచులు చేశారు. వీటికి సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో వారికి నిరీక్షణ తప్పడం లేదు. గత మూడు నెలల కాలంలో కోట్లాది రూపాయల బకాయిలు చెల్లించాలని వారు ఆరోపిస్తున్నారు. ప్రతి నెల 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరవుతుండగా ఆ నిధులు పంచాయతీ అవసరాలైన పారిశుద్ధ్యం, సిబ్బంది జీతభత్యాలు, ఇతర చిన్నచిన్న పనులకే సరిపోతున్నాయని వాపోతున్నారు. రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా నిధులు మంజూరు కావడం లేదు. ఉపాధిహామీ పథకం ద్వారా చేసిన సీసీ రహదారులు, ఇతర పనులకు నిధులు చెల్లించడం లేదు. ఎమ్మెల్యే నిధులతో చేసిన పనులకు పలు పంచాయతీల్లో బకాయిలు ఇవ్వలేదంటున్నారు. పంచాయతీల ఖాతాలోని జనరల్‌ నిధులను తీసుకోకుండా ఫ్రీజింగ్‌ పెట్టి సర్పంచులపై ఆర్థికభారం మోపుతున్నారని మండిపడుతున్నారు. చిన్న చిన్న పంచాయతీల్లో ట్రాక్టర్ల డీజిల్‌, బ్యాంకులోన్లు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. దీనికితోడు ప్రభుత్వం వీధిదీపాలను ప్రైవేటు సంస్థకు అప్పగించాలనే లక్ష్యంతో సర్పంచులతో బలవంతంగా తీర్మాణాలు చేయిస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీరాజ్‌ చట్టంలో లేనప్పటికీ తీర్మాణాలు చేయడమేమిటని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. ‘మన ఊరు - మన బడి’ పనులను గుత్తేదారులకు అప్పగించి ఇతర పనులను సర్పంచులకు ఇవ్వడంపై మండిపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే పెండింగు బిల్లులను చెల్లించాలని లేనిపక్షంలో ఆ ప్రభావం వచ్చే నెలలో ప్రారంభించే ‘పల్లెప్రగతి’పై చూపిస్తామని సర్పంచులు హెచ్చరిస్తున్నారు.

కొన్ని పంచాయతీల చెల్లింపులే ఆగాయి

- నారాయణరావు, జిల్లా పంచాయతీ అధికారి, మంచిర్యాల

కొన్ని పంచాయతీల్లో సాధారణ నిధులకు సంబంధించిన చెక్కులు ఎస్టీవో కార్యాలయంలో ఆగినట్లు సమాచారం ఉంది. ట్రాక్టర్లకు సంబంధించిన చెక్కులు ప్రాసెస్‌లో ఉన్నాయి. ఏ క్షణమైనా చెల్లించే అవకాశం ఉంది. సీసీ రహదారులు, ఇతర నిధుల బిల్లుల బకాయిలు ఆయా శాఖలకే తెలియాలి. పలువురు సర్పంచులైతే నిధులు ఆగినట్లు పేర్కొన్నమాట వాస్తవమే. చెక్కులు రాసిన కొద్ది రోజులకే మంజూరవుతాయి. ఇటీవల కొంతమేరకు జాప్యమేర్పడింది.

ఉమ్మడి జిల్లాలోని పంచాయతీల వివరాలివే...

ఆదిలాబాద్‌ 468

మంచిర్యాల 311

కుమురంభీం 335

నిర్మల్‌ 396

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని