logo

మీనం.. విడుదలకు సన్నద్ధం

మత్స్యకారుల ఉపాధి కల్పన కోసం జలవనరుల్లో ఉచిత చేప పిల్లల విడుదలకు జిల్లా శాఖ సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే టెండర్‌ ప్రక్రియ పూర్తి కాగా మరో వారం రోజుల్లో తటాకాలు, జలాశయాల్లో వీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి భారీ వర్షాలకు జల వనరుల్లో వరద చేరి నిండుకుండల్లా మారాయి.

Published : 13 Aug 2022 05:37 IST

1.37 కోట్ల చేప పిల్లలు వేసేలా చర్యలు
ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే

చేప పిల్లలను విడుదల చేస్తున్న అధికారులు, మత్స్యకారులు (పాత చిత్రం)

మత్స్యకారుల ఉపాధి కల్పన కోసం జలవనరుల్లో ఉచిత చేప పిల్లల విడుదలకు జిల్లా శాఖ సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే టెండర్‌ ప్రక్రియ పూర్తి కాగా మరో వారం రోజుల్లో తటాకాలు, జలాశయాల్లో వీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి భారీ వర్షాలకు జల వనరుల్లో వరద చేరి నిండుకుండల్లా మారాయి. వానలు కాస్త తగ్గుముఖం పట్టగానే విడుదల ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో మత్స్య సహకార సంఘాలు 43 ఉన్నాయి. కొత్తగా మరో పది సంఘాల ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చాయి. వీటన్నింటిలో 2500 మంది వరకు సభ్యులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 260 చెరువులు, మరో 14 జలాశయాలు, పెద్ద చెరువుల్లో 1.37 కోట్ల చేప పిల్లలను విడుదల చేసేలా మత్స్యశాఖ లక్ష్యాన్ని నిర్దేశించారు. గతంలో మత్స్యశాఖ పరిధిలో 45 చెరువులు ఉండగా.. మిగతావి ఆయా పంచాయతీల పరిధిలోనే ఉండేవి. ఈసారి అన్ని చెరువులు మత్స్యశాఖ పరిధిలోకి వచ్చాయి. ప్రభుత్వ పరంగానే జల వనరుల్లో చేప పిల్లలను ఉచితంగా విడుదల చేస్తారు. వాటిని చెరువుల పరిధిలోని సంబంధిత మత్స్యకార సంఘాలే పట్టుకోవచ్చు. సంఘాలు లేని చోట ఆయా చెరువులను వేలం ద్వారా అప్పగిస్తారు. పాట పాడిన వారే చేపలను పట్టుకోవచ్చు.

మత్స్యకారులకు ఉపాధి.. పంచాయతీలకు ఆదాయం
చెరువులు, జలాశయాల్లో ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లను విడుదల చేయడంతో మత్స్య కార్మికులకు ఉపాధితో పాటు సంబంధిత పంచాయతీలకు ఆదాయం సమకూరుతోంది. వంద ఎకరాలలోపు ఆయకట్టు ఉన్న చెరువుల వేలంలో వచ్చిన ఆదాయాన్ని పంచాయతీలకే కేటాయిస్తారు. వంద ఎకరాల ఆయకట్టుపై ఉన్న చెరువులకు వేసే వేలం పాటలో వచ్చిన ఆదాయంలో 30 శాతం సంబంధిత పంచాయతీలకు, 70 శాతం మత్స్యశాఖ(ప్రభుత్వానికి)కు కేటాయిస్తారు. జిల్లాలో వంద ఎకరాల ఆయకట్టులోపు ఉన్న చెరవులు 150, ఆపై ఉన్నవి 123 వరకు ఉన్నాయి. వీటిలో సంఘాలున్న చెరువులు 161 వరకు ఉన్నాయి. ఇంకా 112 చెరువులకు సంబంధించి సంఘాలు లేవు. వాటికి వేలం నిర్వహించి చేపలు పట్టేందుకు అప్పగిస్తారు. వాటిలో ఇప్పటి వరకు 13 చెరువులకు వేలం వేయగా.. రూ.3.82 లక్షల ఆదాయం వచ్చినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. గతేడాది మత్స్య శాఖ ఆధ్వర్యంలోని 45 చెరువులకు వేలం వేయగా రూ.4.12 లక్షల ఆదాయం సమకూరింది.
చేపల చెరువులకు దరఖాస్తుల స్వీకరణ..
చేపల పెంపకంపై ఆసక్తి ఉండి చెరువులు నిర్మించుకునేవారు, చేపల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసే వారి నుంచి జిల్లా మత్స్యశాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కనీసం 2.5 ఎకరాలకు తగ్గకుండా ఉన్న సొంత భూమిలో చేపల చెరువులు నిర్మిస్తేనే ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. చెరువు తవ్వడానికి రూ.ఏడు లక్షలు, చేప పిల్లల కొనుగోలు, వాటికి ఫీడింగ్‌, ఇతరాత్ర వాటికి రూ.4 లక్షలు అంటే మొత్తం రూ.11 లక్షల వరకు ఖర్చు అవుతోంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, మహిళలకు 60శాతం, ఇతరులకు 40 శాతం ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 40 మంది చెరువుల తవ్వకం కోసం దరఖాస్తులు చేసుకున్నారు.
* జిల్లాలో చేప పిల్లల విడుదలకు అనుకూలమైన చెరువులు: 260
* విడుదల చేసే పిల్లలు: 65.80 లక్షలు
* ప్రాజెక్టులు, పెద్ద చెరువులు: 14
* వీటిలో విడుదల చేసే పిల్లలు: 71,29,500
* విడుదల చేసే చేప పిల్లల రకాలు: కట్ల, రవ్వు, బంగారుతీగ, మ్రిగాల


త్వరలో ప్రక్రియ ప్రారంభం
సాంబశివరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి

జిల్లాలో 274 చెరువులు, ప్రాజెక్టుల్లో 1.37 కోట్ల చేప పిల్లలు విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఏకధాటిగా కురుస్తున్న వానల వల్ల వేచి చూస్తున్నాం. మరో వారం రోజుల్లో విడుదల ప్రక్రియ ప్రారంభిస్తాం. కిందటి సారి ఆరు వేల టన్నుల ఉత్పత్తి వచ్చింది. మత్స్య కారులకు సుమారు రూ.4.80 కోట్ల ఆదాయం వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని