logo

స్వైన్‌ఫ్లూ వచ్చేసింది.. జర జాగ్రత్త

జిల్లా వాసులు రెండున్నరేళ్లుగా కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. దీని కారణంగా ఆర్థికంగా తీవ్ర నష్టాలకు గురయ్యారు. ఇప్పటికీ  కొవిడ్‌ కేసులు ప్రతి రోజు నమోదవుతూనే ఉన్నాయి. దీనికి తోడు ఇటీవల కాలానుగుణ వ్యాధులు వెంటాడుతుండటంతో మరింతగా కుంగిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఆదిలాబాద్‌ జిల్లాలో స్వైన్‌ఫ్లూ కేసు నమోదు కావడం కలకలంగా మారింది.

Published : 15 Aug 2022 05:11 IST

ఉమ్మడి జిల్లాలో దీర్ఘకాలం అనంతరం మొదటి కేసు నమోదు
ఆదిలాబాద్‌ వైద్య విభాగం, న్యూస్‌టుడే


వివిధ వ్యాధుల బారిన పడి రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులు

జిల్లా వాసులు రెండున్నరేళ్లుగా కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. దీని కారణంగా ఆర్థికంగా తీవ్ర నష్టాలకు గురయ్యారు. ఇప్పటికీ  కొవిడ్‌ కేసులు ప్రతి రోజు నమోదవుతూనే ఉన్నాయి. దీనికి తోడు ఇటీవల కాలానుగుణ వ్యాధులు వెంటాడుతుండటంతో మరింతగా కుంగిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఆదిలాబాద్‌ జిల్లాలో స్వైన్‌ఫ్లూ కేసు నమోదు కావడం కలకలంగా మారింది. 1919లో ఈ వ్యాధి ప్రపంచాన్ని గడగడలాడించింది. జిల్లాలో రెండున్నరేళ్లుగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోగా.. తాజాగా ఆదిలాబాద్‌ పట్టణంలో ఓ మహిళకు ఈ వ్యాధి నిర్ధారణ కావటం వైద్య వర్గాలను విస్మయానికి గురి చేస్తుండగా, ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో కాలానుగుణ వ్యాధులు ప్రారంభమయ్యాయి. ఏ ఇంట్లో చూసినా జలుబు, విరేచనాలు లేదా జ్వరాలతో బాధపడుతున్న వారు ఒక్కరైనా ఉంటున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 7,438 మంది జ్వరాల బారిన పడ్డారు. 49 డెంగీ కేసులు నమోదయ్యాయి. మలేరియా కేసులు గతేడాది రెండు నమోదు కాగా ఈ ఏడాది మాత్రం ఇప్పటి వరకు నమోదు కాలేదు. కాని కొత్తగా స్వైన్‌ఫ్లూ కేసు నిర్ధారణ కావడంతో అంతటా ఆందోళనకు గురవుతున్నారు.

బయట పడిందిలా..
ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన మహిళ ఒకరు తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులతో అయిదు రోజుల కిందట రిమ్స్‌లో చేరారు. కరోనా లక్షణాలుండటంతో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్సలు అందజేశారు. ఇలాంటి లక్షణాలే ఉన్న మరో నలుగురి నమూనాలను హైదరాబాద్‌కు పంపించారు. స్వైన్‌ఫ్లూ బాధితురాలికి స్థానికంగా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల్లో కొవిడ్‌ నెగెటివ్‌ ఫలితాలు వెలువడ్డాయి. శనివారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఫలితాలతో ఆమెకు స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు నివేదికలు వచ్చాయి. మిగతా నలుగురికి నెగెటివ్‌ ఫలితాలు వచ్చాయి. కాగా స్వైన్‌ఫ్లూ బాధితురాలు ప్రస్తుతం పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. దీంతో ప్రజారోగ్య సిబ్బంది బాధితురాలి ఇంటిల్లిపాది నమూనాలను సేకరించి నిర్ధారణ పరీక్షలకు పంపించారు.

ఇవీ లక్షణాలు..
హెచ్‌-1 ఎన్‌-1 స్ట్రెయిన్‌ వైరస్‌ వల్ల ఇది వ్యాపిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు, గర్భిణులకు తొందరగా సోకుతుంది. కొవిడ్‌ వైరస్‌ మాదిరిగానే గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి బాధితులకు దగ్గరగా ఉన్నా సోకే అవకాశాలుంటాయి.
* తీవ్ర జ్వరం
* జలుబు, ముక్కు దిబ్బడ
* ఒంటి నొప్పులు, కీళ్లనొప్పులు
* నీరసంగా మారటం
* తీవ్రంగా దగ్గు ఉండటం
* తీవ్ర తలనొప్పి

జాగ్రత్తలు ఇవీ..
* జనసమ్మర్థ ప్రాంతాల్లో తిరగకుండా ఉండటం
* విధిగా మాస్కులు ధరించటం
* పరిసర ప్రాంతాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించటం
* ఏమాత్రం అనుమానం ఉన్నా సమీప వైద్య కేంద్రాన్ని సందర్శించాలి


వార్డు ఏర్పాటు

రెండు రోజుల కిందట ఆదిలాబాద్‌ పట్టణంలోని ఓ మహిళకు స్వైన్‌ఫ్లూ నిర్ధారణ కావటంతో రిమ్స్‌ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన స్వైన్‌ఫ్లూ వార్డు ఇది. ఇందులో 13 పడకలను ఏర్పాటు చేసి ఈ వ్యాధి లక్షణాలున్న వారికి చికిత్సలు అందించటానికి ఏర్పాట్లు చేశారు. అవసరమైన వైద్యులు, సిబ్బందిని సైతం కేటాయించారు.


అన్ని ఏర్పాట్లు చేశాం

- రాఠోడ్‌ జైసింగ్‌, రిమ్స్‌ సంచాలకుడు

జిల్లాలో స్వైన్‌ఫ్లూ కేసు నమోదు కావటంతో అప్రమత్తమయ్యాం. అనుమానితులు, బాధితులకు చికిత్సలు అందించటానికి వార్డును ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పించాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.


ముందు జాగ్రత్తలు పాటించాలి

- రాఠోడ్‌ నరేందర్‌, డీఎంహెచ్‌ఓ

సుదీర్ఘ కాలానంతరం స్వైన్‌ఫ్లూ మొదటి కేసు నమోదైంది. ఈ వ్యాధికి కరోనా లాంటి లక్షణాలే ఉంటాయి. జిల్లావాసులు కరోనా సమయంలో పాటించిన ముందు జాగ్రత్తలు పాటిస్తే రక్షణ పొందవచ్చు. జనసమ్మర్థ ప్రాంతాల్లో వెళ్లకుండా ఉండటంతో పాటు మాస్క్‌ధారణ తప్పనిసరి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని