logo

ఉపాధి సొమ్ములు రాబట్టేందుకు ఆర్‌ఆర్‌ యాక్టు ప్రయోగం

ఉపాధి హామీలో వెలుగుచూసిన అక్రమాల నేపథ్యంలో డబ్బుల రికవరీ కోసం ప్రత్యేక దృష్టి పెట్టామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్‌ తెలిపారు.

Updated : 04 Feb 2023 06:41 IST

స్త్రీనిధిలో అక్రమాలపై ప్రత్యేక కమిటీ

కిషన్‌

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పట్టణం, ఇచ్చోడ: ఉపాధి హామీలో వెలుగుచూసిన అక్రమాల నేపథ్యంలో డబ్బుల రికవరీ కోసం ప్రత్యేక దృష్టి పెట్టామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్‌ తెలిపారు. ఇప్పటికే పది మంది సాంకేతిక సహాయకులపై వేటువేశామన్నారు. డబ్బులు స్వాహా చేసిన సిబ్బంది సమయంలోగా చెల్లించకుంటే వారిపై రెవెన్యూ రికవరీ యాక్టు మేరకు ఆస్తులు జప్తు చేయించి డబ్బులు వసూలు చేస్తామని స్పష్టం చేశారు. గ్రామీణాభివృద్ధి పరిధిలోని మిగతా అంశాలపై ‘న్యూస్‌టుడే’ ఆయనతో ముఖాముఖి నిర్వహించింది.  

న్యూస్‌టుడే: జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని మండలాల్లో సామాజిక తనిఖీలు పూర్తి చేశారు? ఎంత వరకు రికవరీ చేశారు?

డీఆర్‌డీఓ: ఇప్పటి వరకు మావల, బోథ్‌, ఆదిలాబాద్‌, తలమడుగు, తాంసి, భీంపూర్‌, గుడిహత్నూర్‌ మండలాల్లో సామాజిక తనిఖీలు పూర్తయ్యాయి. రూ.3.7 లక్షలు రివకరీ చేశాం. అక్రమాలకు పాల్పడిన సిబ్బందిని ఒక్కొక్కరిని పిలిచి విచారణ చేస్తున్నాం.  

న్యూస్‌టుడే: స్త్రీనిధి రుణాల వసూళ్లలో రూ.2 కోట్లకు లెక్కలు లేనట్లు తేలింది. బాధ్యులపై చర్యలెందుకు లేవు?

డీఆర్‌డీఓ: ఇది 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది. ఇటీవలే దీనిపై విచారణ కోసం పరిశ్రమల అధికారి నేతృత్వంలో కలెక్టర్‌ ఒక కమిటీని నియమించారు. బాధ్యులను గుర్తించగానే చర్యలు తీసుకుంటాం.

న్యూ: రైతు అద్దె కేంద్రాల కోసం అదనపు పాలనాధికారి ఆధ్వర్యంలోని జిల్లా కొనుగోలు కమిటీని కాదని కొన్ని మండలాల్లో సిబ్బంది ఇతర డీలర్ల వద్ద ట్రాక్టర్లు, వ్యవసాయ పని సామగ్రి కొనుగోలు చేశారు. దీనిపై మీరేమంటారు?

డీఆర్‌డీఓ: రైతులకు తక్కువ ధరకు వ్యవసాయ పని సామగ్రి అద్దెకు ఇవ్వాలని కేంద్రం మండలానికి రూ.10లక్షల నుంచి రూ.20 లక్షల నిధులు విడుదల చేసింది. కొనుగోలు కమిటీ సూచించిన డీలర్లు, ఏజెన్సీల వద్దనే వాటిని కొనుగోలు చేయాల్సి ఉండగా మూడు మండలాల్లో వేరే చోట కొనుగోలు చేశారు. అద్దె కుదరకపోవడంతో పరికరాలు వెనక్కి ఇప్పించేశాం. మిగతా మండలాల వారిని సైతం నిబంధనలు పాటించాలని సూచించాం.

న్యూ: ఉపాధి కూలీలకు డబ్బులు సమయంలోగా ఎందుకు చెల్లించడం లేదు?

డీఆర్‌డీఓ: ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు. దాదాపు రూ.8 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. నిధులు రాగానే కూలీల ఖాతాల్లో జమచేస్తాం.

న్యూ: స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇప్పించడంలో ఆలస్యానికి కారణాలేంటి?

డీఆర్‌డీఓ: జిల్లాలో 8,755 సంఘాలకు రూ.254 కోట్లు రుణాలు ఇప్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఇప్పటి వరకు 4,048 సంఘాలకు రూ.189 కోట్ల రుణాలు ఇప్పించాం. కొన్నిచోట్ల బ్యాంకర్లు సహకరించడం లేదు. మరికొన్ని చోట్ల సంఘాలు తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో వారికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు నిరాకరిస్తున్నారు. ఈ కారణాలతోనే కొంత ఆలస్యమవుతోంది.

న్యూ: సీఎం గిరి వికాసం కింద గిరిజనుల భూముల్లో బోర్లు వేసి కరెంటు ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది? ఎందుకు?

డీఆర్‌డీఓ: జిల్లాలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా 9,667 గ్రూపులను తయారు చేశాం. వాటిలో ఇప్పటి వరకు 516 గ్రూపులకు సంబంధించి బోర్లు వేయించాం. ఒక్కో బోరును ఇద్దరి నుంచి నలుగురు రైతులు ఉపయోగిస్తారు. 52 చోట్ల కరెంటు మోటార్లు బిగించాం. కొన్నిచోట్ల విద్యుత్తు అధికారులు సహకరించకపోవడం, మరికొన్నిచోట్ల అటవీ అధికారుల ఇబ్బందులతో ఆటంకాలు ఎదురవుతున్నాయి. బిల్లులు ఇవ్వడంలేదని కొందరు బోర్లు వేయడంలేదు. నిధులు రాగానే అన్నిచోట్ల బోర్లు వేయించి కరెంటు సౌకర్యం కల్పిస్తాం. ఇప్పటి వరకు రాష్ట్రంలోనే జిల్లా ముందుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని