logo

మంచి చేశారు.. మదిలో నిలిచారు

ప్రస్తుతం శాసనసభ ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. వందల సంఖ్యలో మోటారు సైకిళ్లు, భారీ ర్యాలీలు.. ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు. ఎంతో మంది నేతలు వచ్చారు.. వెళ్లారు.. కొంత మంది మాత్రమే ప్రజల గుండెల్లో ఇంకా నిలిచి ఉన్నారు.

Updated : 02 Nov 2023 05:42 IST

న్యూస్‌టుడే, రాంనగర్‌, దండేపల్లి

సుద్దవాగుపై నిర్మించిన గడ్డెన్న ప్రాజెక్టు

ప్రస్తుతం శాసనసభ ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. వందల సంఖ్యలో మోటారు సైకిళ్లు, భారీ ర్యాలీలు.. ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు. ఎంతో మంది నేతలు వచ్చారు.. వెళ్లారు.. కొంత మంది మాత్రమే ప్రజల గుండెల్లో ఇంకా నిలిచి ఉన్నారు. ప్రజలతోపాటు అప్పటి ప్రభుత్వాలు వారు చేసిన సేవలకు గుర్తుగా ప్రాజెక్టులు, కాలనీలకు.. అప్పటి నేతల పేర్లు పెట్టడంతో చిరస్థాయిగా జనంలో నిలిచిపోయారు. ఎమ్మెల్యేగా గెలిచి.. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంతో జనం నోళ్లల్లో ఇప్పటికీ ఉండిపోయారు. శాసనసభల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అప్పటి నేతల గుర్తులు, వారి సేవలపై కథనం.

ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఎంతో మంది నేతలు పోటీ చేశారు. కొంత మంది గెలిచి శాసనసభలో అడుగుపెట్టారు. మరి కొంత మంది మూడు నుంచి ఆరు సార్లు గెలిచి రికార్డు సృష్టించారు. ప్రజల అభిమానాన్ని పొందడం, అభివృద్ధికి కృషి చేయడంతో పోటీ చేసిన ప్రతిసారి గెలుస్తున్నారు. వీరిలో కొంత మంది ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. వారి పేర్లు చిరస్మరణీయంగా ఉన్నాయి.

పీపీరావు ప్రాజెక్టు


ఎంత గొప్పగా జీవించావో నీ చేతలు చెప్పాలి. ఎంత గొప్పగా మరణించావో ఇతరులు చెప్పాలి

గాంధీ


నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు. జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు

అంబేడ్కర్‌


సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురావు. మంచితనం మాత్రం అభిమానాన్ని, దీవెనలను తీసుకువస్తుంది

వివేకానంద


నేతల పేర్లతో ప్రాజెక్టులు

సిర్పూరు నియోజకవర్గంలో రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన పాల్వాయి పురుషోత్తంరావు 1999లో జరిగిన ఎన్నికల సమయంలో నక్సల్స్‌ చేతిలో హత్యకు గురయ్యారు. ఆయన హయాంలో పనులు మొదలు పెట్టిన ఎర్రవాగు ప్రాజెక్టుకు అప్పటి ప్రభుత్వం పీపీరావు ప్రాజెక్టుగా నామకరణం చేసింది.

ప్రజల అభిమానాన్ని చూరగొన్న మాజీ మంత్రి గడ్డెన్న పేరు అప్పటి నుంచి ఇప్పటి తరం వరకు తెలుసు. మంచి పేరు ఉండటంతో ముథోల్‌ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే గడ్డెన్న ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా అయిదు సార్లు కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా సుద్దవాగు ప్రాజెక్టుకు గడ్డెన్న ప్రాజెక్టుగా పేరు మార్చారు.

కడెంకు చెందిన నారాయణ్‌రెడ్డి జిల్లా ఎంపీగా పని చేశారు. 1998లో హత్యకు గురికావడంతో అప్పటి ప్రభుత్వం ఆయన గుర్తుగా కడెం ప్రాజెక్టుకు నారాయణ్‌రెడ్డి ప్రాజెక్టుగా పేరు మార్చారు.


సరస్వతి కాల్వ నిర్మాత..

రాజకీయరంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుని ముక్కుసూటి మనిషిగా, సరస్వతి కాల్వ నిర్మాతగా ఆయన ఉమ్మడి జిల్లా ప్రజలకు ఎల్లప్పుడూ గుర్తుంటారు. దండేపల్లి మండలం కొర్విచెల్మ గ్రామంలో జన్మించిన జీవీ సుధాకర్‌రావు 1962, 1968లో ఎమ్మెల్సీగా పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి 1977లో మూడోసారి ఎమ్మెల్సీగా ఎన్నికై మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో భారీ నీటిపారుదలశాఖ మంత్రిగా పని చేశారు. ఈ సమయంలో కడెం జలాశయం ఎండిపోయి ఆయకట్టుకు నీరందని పరిస్థితి నెలకొంది. దీంతో ఆయన శ్రీరాంసాగర్‌ జలాశయం నుంచి కడెం జలాశయంలోకి నీరు వచ్చేలా సరస్వతి కాల్వ నిర్మించడంతో కడెం ఆయకట్టుతోపాటు నిర్మల్‌ జిల్లాలోని సరస్వతి కాల్వ ఆయకట్టు సస్యశ్యామలంగా మారింది. కరీంనగర్‌ జిల్లాలోని లోయర్‌ మానేరు డ్యాం నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారు. వ్యవసాయ, సాగు నీటి అభివృద్ధికి ఆయన చేసిన సేవలకు 2006లో వైఎస్‌ ప్రభుత్వం కరీంనగర్‌లోని లోయర్‌ మానేరు డ్యాంకు ‘ప్రొఫెసర్‌ జీవీ సుధాకర్‌రావు డ్యాం’గా నామకరణం చేసి ఆయన విగ్రహాన్ని అక్కడ నెలకొల్పింది.


వెలుగులు నింపిన ‘జేవీ’

వెనకబడిన ఆదిలాబాద్‌ జిల్లాకు విద్యుత్తు సౌకర్యం కల్పించిన ఘనత జేవీ నర్సింగరావుదే.. ఆయన స్వగ్రామం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ధర్మరావుపేట గ్రామం. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో హైదరాబాద్‌లోని బేగంబజార్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో నీటిపారుదల, రోడ్లు, భవనాలు, విద్యుత్‌శక్తి మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. ఆ తర్వాత 1963 నుంచి 1966 వరకు రాష్ట్ర విద్యుత్‌శక్తి బోర్డు మొట్టమొదటి అధ్యక్షుడిగా పని చేశారు. అదే సమయంలో కొత్తగూడెం సమీపంలోని పాల్వంచ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్మాణంతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చాలా చోట్ల విద్యుత్తు సౌకర్యం కల్పించేందుకు కృషి చేశారు. 1967లో జరిగిన ఎన్నికల్లో లక్షెట్టిపేట(ప్రస్తుత మంచిర్యాల) నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా పదవులు నిర్వహించారు. ఆ తర్వాత 1972లో మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. హైదరాబాద్‌లో తెలుగు భాషకు ఆదరణ లేని రోజుల్లో ఆంధ్రోద్యమంలో పాల్గొని తెలుగు భాషాభివృద్ధికి కృషి చేశారు. ఈ ఉద్యమాల ఫలితంగా తెలుగు మాధ్యమంలో ప్రభుత్వ పాఠశాలలు ఏర్పడ్డాయి.


గిరిజనుల హృదయాల్లో..

బోథ్‌ నియోజకవర్గం నుంచి 1985, 1989లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన గోడం రామారావు.. గిరిజనుల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఇచ్చోడ పోలీస్‌స్టేషన్‌ పక్కన అతని విగ్రహం ఏర్పాటు చేశారు.


వెలిసిన కాలనీలు..

ఎమ్మెల్యేగా చేసిన సేవలతోపాటు వారి హయాంలో ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయడంతో పాటు వాటిని పూర్తి చేసి ఇవ్వడంతో.. జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో వారికి గుర్తుగా వారి పేర్లతో పలు కాలనీలు వెలిశాయి. జిల్లా మొత్తంలో అనేక నియోజకవర్గాల్లో రాజీవ్‌, ఇందిర కాలనీలతో పాటు ఎన్టీఆర్‌ కాలనీలు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల స్థానిక నేతలపై అభిమానంతో కాలనీలకు వారి పేర్లు పెట్టుకున్నారు.

ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి మంచి మనిషిగా పేరు పొందిన కస్తాల రాంకిష్టు.. 1967లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన పేరుతో ఆదిలాబాద్‌ పట్టణంలో కాలనీ ఏర్పాటు చేశారు. 1983లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన చిలుకూరి వామన్‌రెడ్డి పేరుతో వామన్‌నగర్‌, చిలుకూరి లక్ష్మీనగర్‌ కాలనీలు ఏర్పాటయ్యాయి. నాలుగు సార్లు గెలుపొందిన రాంచంద్రారెడ్డి పేరుతో కాలనీలు ఉన్నాయి. బోథ్‌ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నగేశ్‌ పేరుతో సిరికొండ మండలంలో నగేశ్‌ నగర్‌ ఏర్పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని