logo

Kodali Nani: ఏం.. ‘సేతు’రు నాని..?

అది దశాబ్దాల నాటి కల. సంవత్సరాల నుంచి ప్రతిపాదనలు.. గత ప్రభుత్వంలో మంజూరు.. అయినా డిజైన్‌ మార్చాలని పట్టు.. ఎట్టకేలకు కేంద్రం మంజూరు చేసి నిధులు విడుదల చేసినా.. ఇప్పటికీ పనులు ప్రారంభించని వైనం. అదే సమస్య. అక్కడ రైల్వే గేటు పడిందంటే.. వాహనదారులకు హడల్‌.. గంటల తరబడి నిలబడాల్సిందే.

Updated : 18 Aug 2023 09:54 IST

ఆర్వోబీ నిర్మాణం జరిగేనా..?
గుడివాడ పుర ప్రజల తీరని కల
ఎమ్మెల్యే అనుచరుడికే దక్కిన కాంట్రాక్టు

అది దశాబ్దాల నాటి కల. సంవత్సరాల నుంచి ప్రతిపాదనలు.. గత ప్రభుత్వంలో మంజూరు.. అయినా డిజైన్‌ మార్చాలని పట్టు.. ఎట్టకేలకు కేంద్రం మంజూరు చేసి నిధులు విడుదల చేసినా.. ఇప్పటికీ పనులు ప్రారంభించని వైనం. అదే సమస్య. అక్కడ రైల్వే గేటు పడిందంటే.. వాహనదారులకు హడల్‌.. గంటల తరబడి నిలబడాల్సిందే. గేటు తెరిచిన పావుగంటకే ట్రాఫిక్‌ వెళ్లక ముందే మళ్లీ గేటు... మరో అరగంట నిరీక్షణ.. ఇదీ గుడివాడ పట్టణంలో వేల మంది ఎదుర్కొంటున్న ప్రజల పరిస్థితి.

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - గుడివాడ గ్రామీణం : గుడివాడ పట్టణం అంటే రాష్ట్రంలోనే ఓ గుర్తింపు. ఎన్టీఆర్‌ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. ఎంతో మంది ప్రముఖులు విద్యాభ్యాసం చేసిన పట్టణం. అలాంటి పట్టణానికి నాలుగోసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంకటేశ్వరరావు(నాని) ఈ సమస్యను పరిష్కరించలేకపోతున్నారు. ఎట్టకేలకు కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించినా.. నిర్మాణం ప్రారంభించడంలేదు. ఎంపీ చొరవతో ఆకృతులు మార్చి కొత్తగా పరిపాలన అనుమతులు వచ్చినా.. శంకుస్థాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినా.. పనులు ప్రారంభించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఈ కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ స్వయంగా ఎమ్మెల్యే సన్నిహితులు, ఆయన సొంత గ్రామానికి చెందిన వారిదే కావడం విశేషం.

కొన్నేళ్లుగా ఇదే దుస్థితి...

గుడివాడ పట్టణానికి కృష్ణా జిల్లాలోనే గుర్తింపు ఉంది. 1927లోనే ఈ పట్టణం పురపాలక సంఘంగా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పట్టణ జనాభా 1.60 లక్షల వరకు చేరింది. గుడివాడ పట్టణాన్ని కలుపుతూ రెండు రైలు మార్గాలు ఉన్నాయి. విజయవాడ నుంచి ఒకటి బందరు వెళుతుంది. మరో రైలు మార్గం నరసాపురం మీదుగా వెళుతుంది. ఈ రెండు మార్గాలు గుడివాడ పట్టణం మధ్య నుంచి వెళుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఇక్కడ రైల్వే గేటు పడుతుంది. ఒకటి భీమవరం రైల్వేగేటు. ఇది గుడివాడ - భీమవరం రైల్వే మార్గం మీద ఎల్‌సీ నంబరు 52 వద్ద ఉంది. గుడ్లవల్లేరు మార్గంలో ఉంది. రెండోదీ దీనికి సమీపంలోనే ఉంది. పామర్రు వెళ్లే మార్గంలో బందరు రైల్వే మార్గం. దీని ఎల్‌ నంబరు మూడు. ఇక్కడ ఆర్వోబీ కట్టాలని దశాబ్దాల నుంచి ప్రతిపాదన ఉంది. చిన్న చిన్న పట్టణాల్లో సైతం ఆర్వోబీలు నిర్మించారు. ఈరెండు ఆర్వోబీలు జాతీయ రహదారిపై ఉన్నాయి. వీటి నిర్మాణానికి జాతీయ రహదారుల సంస్థ ముందుకు వచ్చింది.

తెదేపా హయాంలో రెండు ఆర్వోబీలు

రైల్వే శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. గతంలో ఇవి రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఉన్న రహదారులు. ఆసంస్థ ఇరువైపులా నిర్మిస్తే.. రైల్వే శాఖ ఆర్వోబీని నిర్మిస్తుంది. దీనికి గతంలోనే తెదేపా హయాంలో రెండు ఆర్వోబీలు ప్రతిపాదించారు. సర్వే చేసి డీపీఆర్‌ సిద్ధం చేశారు. జాతీయ రహదారి నంబరు 165పై 231.7 కిలోమీటరు వద్ద ఒకటి, 230.6 కిలోమీటరు వద్ద రెండోది నిర్మించాలని నిర్ణయించారు. దీనికి అంచనా వ్యయం రూ.239.55 కోట్లుగా ప్రతిపాదించి మంజూరు చేశారు. కానీ టెండర్లు పిలవకుండా ఆపేశారు. రెండు ఆర్వోబీలు నిర్మాణం వల్ల ఇబ్బందులు ఉంటాయని అవిధంగా కాకుండా ఒకే ఆర్వోబీ ‘వై’ ఆకారంలో నిర్మించాలని ప్రతిపాదించారు. దీని గురించి నేతలు పట్టించుకోలేదు. కేంద్రంలోనూ ఇది పెండింగ్‌ పడింది. 2004 నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందుతున్న కొడాలి నానికి ప్రజలు ప్రతి ఎన్నికల్లో విన్నవించుకుంటునే ఉన్నారు. ప్రతిసారి హామీ ఇస్తూనే  న్నారు. కానీ నిర్మాణం గాలికి వదిలేశారు.

పెరిగిన అంచనాలు..

ఆ ఆర్వోబీపై నేతలు ఒక నిర్ణయానికి రావడంలో జాప్యం జరిగింది. దీంతో తాజాగా అంచనాలు సవరించారు. ‘వై’ ఆకృతిలో నిర్మాణానికి అంచనాలు పెరిగాయి. రూ.317.22 కోట్లుగా తేల్చారు. దాదాపు 5.540 కిలోమీటర్ల వరకు పైవంతెన ఉంటుంది. జాతీయ రహదారిపై 228 కి.మీ నుంచి 233.540 కి.మీ వరకు నిర్మించేలా జాతీయ రహదారుల సంస్థ ప్రతిపాదించింది. దీనికి 2022లోనే టెండర్లను పిలిచింది. నిర్మాణ వ్యయంతో పాటు భూసేకరణకు రూ.45 కోట్లు కావాలని అంచనా వేశారు. భూసేకరణ నోటిఫికేషన్‌ ఇచ్చి... కొంత సేకరించారు. 2.40 ఎకరాల భూసేకరణ అవసరమని గుర్తించారు. మొత్తం 130 మంది నిర్వాసితులు ఉన్నారు. కొన్ని భవనాలను కూల్చివేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు వంద మందికి రూ.35 కోట్లు వరకు చెల్లించారు. కొంతమంది తమ భవనాలను వారే స్వయంగా కూల్చేసుకున్నారు. మరో 30 మంది నిర్వాసితులకు పరిహారం అందాల్సి ఉంది. ఈ సొమ్ము కూడా జాతీయ రహదారుల సంస్థ రెవెన్యూ శాఖకు చెల్లించింది.

ఆడంబరంగా శిలాఫలకం..

దీనికి ఆడంబరంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పట్టుబట్టడంతో కాంట్రాక్టు సంస్థ ఆధ్వర్యంలో శిలాఫలకం ఏర్పాటు చేశారు. ఆర్వోబీ నిధుల మంజూరు విషయంలో ఎంపీ అనుశీలన చేశారు. టెండర్లు జరిగేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. 2022 డిసెంబరులోనే శిలాఫలకం ఏర్పాటు చేశారు. ఏడాదిన్నరలో వంతెన పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కొడాలి నాని ప్రకటించారు. ఎనిమిది నెలలు గడిచినా పనులు మొదలు కాలేదు. భీమవరం-విజయవాడ మార్గంలో మొత్తం 60 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. దాదాపు 20 సరకు రవాణా రైళ్లు వెళుతున్నాయి. ఒక్క రైలు కోసం కనీసం 10-15 నిమిషాలు గేటు పడుతుంది. అక్కడ ట్రాఫిక్‌ క్లియర్‌ కావడానికి కనీసం అరగంట పడుతుంది. అరగంటలో మరోసారి గేటు మూసేస్తున్నారు. మరో మార్గం బందరు-విజయవాడలో 20 రైళ్ల వరకు (సరకు రవాణాతో కలిపి) తిరుగుతున్నాయి. అక్కడ ఇబ్బంది ఏర్పడుతుంది. రెండు గేట్లు ఒకేసారి పడితే.. ట్రాఫిక్‌ కష్టాలు అన్నీఇన్నీ కావు. సాయంత్రం, ఉదయం వేళల్లో మరీ ఇబ్బందిగా మారుతోంది. నిధులు మంజూరైనా నిర్మాణం ప్రారంభించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి గుడివాడ పట్టణ ప్రధాన సమస్య ఆర్వోబీని పరిష్కరించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇదేనా గుడివాడ అభివృద్ధి అని ప్రశ్నిస్తున్నారు.


గుడివాడ రైల్వే క్రాసింగ్‌ వద్ద నిలిచిన ట్రాఫిక్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని