logo

Phone Call Scam: ఫోన్‌ ఎత్తారో.. ఖాతా ఖాళీ..!

సైబర్‌ నేరం... ఏ రూపంలో ఎలా జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. అపరిచిత వ్యక్తులు ఫోన్లు చేసి, ఎరవేసి ముంచేస్తున్నారు. గతంలో ఓటీపీ వంటి వివరాలు చెబితేనే మోసాలు జరిగేవి.

Updated : 29 Oct 2023 11:56 IST

నిండా ముంచేస్తున్న సైబర్‌ నేరగాళ్లు

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే: సైబర్‌ నేరం... ఏ రూపంలో ఎలా జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. అపరిచిత వ్యక్తులు ఫోన్లు చేసి, ఎరవేసి ముంచేస్తున్నారు. గతంలో ఓటీపీ వంటి వివరాలు చెబితేనే మోసాలు జరిగేవి. ఇప్పుడు ఎలాంటి వివరాలు చెప్పకపోయినా.. ఖాతా ఖాళీ అవుతోంది. సైబర్‌ నేరాలు జరుగుతున్న తీరును పరిశీలిస్తే.. బ్యాంకులో డబ్బులు దాచుకోవాలంటేనే జనం వణికిపోతున్నారు.

  • అక్టోబరు మొదటి వారంలో... అయోధ్యనగర్‌కు చెందిన నారాయణమూర్తి తన అపార్ట్‌మెంట్‌ అద్దెకు ఇస్తానంటూ ఒ.ఎల్‌.ఎక్స్‌.లో ప్రకటన ఇచ్చారు. ఓ అపరిచిత వ్యక్తి ఫోన్‌ చేశాడు. తాను సైనిక ఉద్యోగినని, అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకుంటానని చెప్పాడు. అడ్వాన్స్‌ చెల్లిస్తానని, బ్యాంకు ఖాతా వివరాలు చెప్పాలని కోరగా.. నారాయణమూర్తి నిరాకరించారు. మళ్లీ ఫోన్‌ చేసి, బ్యాంకు వివరాలు ఇస్తే తమ అకౌంట్‌ సెక్షన్‌కు పంపి అద్దె చెల్లిస్తానని చెప్పగా నారాయణమూర్తి నిరాకరించారు. ఆ తర్వాత నారాయణమూర్తి ఖాతా నుంచి విడతల వారీగా ఆయనకు తెలియకుండానే రూ.4,34,483లు విత్‌డ్రా అయిపోయాయి.
  • ఈ ఏడాది జులై 24న సూర్యారావుపేటలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు. తన పేరు నాగేశ్వర్‌రెడ్డి అని, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానంటూ పరిచయం చేసుకున్నాడు. ఆసుపత్రులు, రెసిడెన్షియల్‌ ప్లాట్స్‌ నిర్మాణం నిమిత్తం భూమి కేటాయిస్తామని నమ్మించాడు. దీనికి సంబంధించిన ఫైలును సదరు కార్పొరేట్‌ ఆసుపత్రి ఎండీకి పంపించాడు. దీన్ని నమ్మిన ఆసుపత్రి యాజమాన్యం.. అపరిచిత వ్యక్తి చెప్పిన ఐడీలకు విడతల వారీగా రూ.3,01,200లు చెల్లించారు. చివరికి సైబర్‌ నేరగాళ్లు టోకరా వేశారని తెలిసి పోలీసులను ఆశ్రయించారు.
  • ఈ ఏడాది జూన్‌ 24న పటమట పోస్టల్‌కాలనీకి చెందిన శివరామకృష్ణ అనే వృద్ధుడికి మాక్స్‌ లైఫ్‌ కస్టమర్‌ కేర్‌ నుంచి అంటూ ఒక అపరిచిత వ్యక్తి ఫోన్‌ చేశాడు. 2018లో పశ్చిమ్‌బంగా, సిలిగురిలో శివరామకృష్ణ పనిచేసేటపుడు మాక్స్‌ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ తీసుకున్నారు. అప్పట్లో తీసుకున్న బీమా విషయం గురించి అపరిచిత వ్యక్తి మాట్లాడుతూ.. సిలిగురి శాఖలో కొంత మంది ఉద్యోగులు అవినీతికి పాల్పడ్డారని, దీనిపై కోర్టులో కేసు ఉందన్నారు. మీరు తీసుకున్న బీమా పాలసీ వివరాలు చెబితే.. పాలసీకి చెందిన రూ.24.15 లక్షలు తిరిగి చెల్లిస్తామని చెప్పాడు. అతడి మాటలను శివరామకృష్ణ నమ్మారు. అతడు చెప్పినట్లుగా పాలసీ రెన్యువల్‌, పన్నులు, పింఛను ప్లాన్‌ ఇతరత్రా నిమిత్తం డబ్బులు చెల్లించానటంతో.. రూ.7,68,075లు చెల్లించారు. మొత్తం 8 చరవాణి నంబర్ల నుంచి సైబర్‌ నేరగాళ్లు ఫోన్లు చేసి శివరామకృష్ణను మోసం చేశారు.

... ఈ మూడు కేసులను పరిశీలిస్తే.. అన్నీ వేర్వేరు రకాలుగా మోసం చేసినవే. సైబర్‌ నేరగాళ్లు చాలా నమ్మకంగా మాట్లాడుతూ అవతలి వ్యక్తులను నమ్మించేస్తున్నారు. చదువుకున్న వారు సైతం వారి బుట్టలో పడిపోతున్నారు. వారు అడిగిన డబ్బులు పంపించి, మోసపోతున్నారు. పోలీసులను ఆశ్రయించే లోగానే సదరు నగదు.. వేర్వేరు ఖాతాలకు వెళ్లిపోతున్నాయి. సైబర్‌ విభాగానికి ఫిర్యాదు చేసినా.. సదరు ఖాతాల్లో నగదు కనిపించటం లేదు. అక్కడి నుంచి వేర్వేరు ఖాతాల్లోకి వెళ్లి, ఆ తర్వాత విత్‌డ్రా అయిపోతుండటంతో పోలీసులు సైతం ఏం చేయలేకపోతున్నారు.

నమ్మకపోవడం మంచిది...

ప్రధానంగా సైబర్‌ నేరగాళ్లు ఆన్‌లైన్‌లో వచ్చే ప్రకటనలు చూసి మోసాలకు తెరలేపుతుంటారు. తాము ప్రకటన ఇచ్చినా అవతలి వ్యక్తి మాటలు అనుమానాస్పదంగా ఉంటే.. వెంటనే కట్‌ చేయటం మంచిది. ప్రాసెసింగ్‌ ఛార్జీల నిమిత్తం డబ్బులు చెల్లించమంటే.. అసలు నమ్మొద్దు. అపరిచిత వ్యక్తులు నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చి ఆర్థిక పరమైన లావాదేవీలు గురించి మాట్లాడితే.. వెంటనే కట్‌ చేయటం మంచిది. లాటరీ అంటూ లింక్‌లు పంపినా, రూ.49లకే కలర్‌ టీవీ అంటూ ప్రకటన వచ్చినా.. అలాంటివి నమ్మవద్దంటున్నారు సైబర్‌ నిపుణులు. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తం ఉంటే మేలని సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని