logo

Vijayawada: 5 రూపాయలు పంపమని రూ.లక్ష కొట్టేశాడు!

ఆన్‌లైన్‌లో మనం తెలిసీ తెలియక చేసే తప్పులే చివరకు తిప్పలు తెస్తున్నాయి. మన కష్టార్జితాన్ని మోసగాళ్లు దోచుకునేందుకు ఇవి అవకాశం ఇస్తున్నాయి.

Updated : 12 Nov 2023 10:45 IST

ఈనాడు, అమరావతి: ఆన్‌లైన్‌లో మనం తెలిసీ తెలియక చేసే తప్పులే చివరకు తిప్పలు తెస్తున్నాయి. మన కష్టార్జితాన్ని మోసగాళ్లు దోచుకునేందుకు ఇవి అవకాశం ఇస్తున్నాయి. బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేందుకు రోజు రోజుకూ కొత్త మార్గాలు అన్వేషిస్తున్న కేటుగాళ్ల వలకు చిక్కకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మన సమాచారాన్ని పంచుకుంటే తీరని నష్టం జరుగుతుందని ఇటీవల నగరంలో నమోదవుతున్న కేసులే ఇందుకు తార్కాణం. మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయి.

త్వరగా ఇంటికి వస్తుందన్న ఆత్రుతతో..

విజయవాడ రామవరప్పాడుకు చెందిన ఓ మహిళకు పదేళ్ల నుంచి పాస్‌పోర్టు ఉంది. చిరునామా మార్చి రెన్యువల్‌ చేసుకునేందుకు గత నెలలో విజయవాడలోని పాస్‌పోర్టు కేంద్రంలో దరఖాస్తు చేశారు. సిద్ధమైన తర్వాత పోస్టులో ఇంటికి పంపిస్తామని అధికారులు చెప్పారు. తర్వాత కొన్ని రోజులకు పోస్టల్‌ శాఖ నుంచి ఆమెకు ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. రిజిస్టర్డ్‌ పోస్టులో కవర్‌ డిస్‌పాచ్‌ అయిందని అందులో ఉంది. మూడు రోజులు చూసినా కవర్‌ రాలేదు. దీంతో ఆమె ఆన్‌లైన్‌లోకి వెళ్లి పోస్టల్‌ శాఖను సంప్రదించేందుకు నంబరు కోసం వెతికారు. అందులో కనిపించిన ఓ సైట్‌లో తన సమస్యను నమోదు చేశారు. ఈ నెల 3న ఓ నంబరు నుంచి కాల్‌ వచ్చింది. మీ చిరునామా సరిగా లేదని, మార్చాల్సి ఉందన్నాడు. అందుకే రిజిస్టర్డ్‌ పోస్టు ఆలస్యమవుతోందని నమ్మించాడు.

అవగాహన లేక.. తిప్పలు

 ఏదైనా శాఖ, అంశానికి సంబంధించిన సమాచారం ఫిర్యాదుల కోసం అధీకృత వెబ్‌సైట్‌, చరవాణి నంబరు తెలుసుకుని మాత్రమే ముందుకు వెళ్లడం శ్రేయస్కరం. లేకుంటే ఆన్‌లైన్‌లో కుప్పలు తెప్పలుగా ఉన్న నకిలీ సైట్లలోకి వెళ్లి వివరాలు, సమస్యను నమోదు చేస్తే అవి మోసగాళ్ల చేతికి చేరుతున్నాయి. వాటి ఆధారంగా తేలికగా మోసాలకు పాల్పడుతున్నారు.

స్క్రీన్‌ షేరింగ్‌ లింక్‌తో..

సమస్య పరిష్కారం కావాలంటే పోస్టల్‌ శాఖకు రూ.5 యూపీఐ ద్వారా చెల్లించాలని ఫోన్‌ చేసిన వ్యక్తి సూచించాడు. దీని కోసం ఓ లింక్‌ పంపిస్తున్నట్లు చెప్పి దానిని 15 సెకన్లలో ఓ నంబరుకు పంపించమని చెప్పాడు. ఆ వ్యక్తి పంపించిన లింక్‌ను చెప్పిన సమయంలోగా పంపించేందుకు 14 సార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు 15వ సారి పంపించగలిగింది. తర్వాత యూపీఐ ద్వారా రూ.5 చెల్లించింది. మరుసటి రోజే ఆమెకు పోస్టులో పాస్‌పోర్టు వచ్చింది. రూ.5 చెల్లించడం వల్లే వచ్చిందని ఆమె భావించారు.
సోమవారం ఎస్‌బీఐ నుంచి ఆ మహిళకు కాల్‌ వచ్చింది. మీ బ్యాంకు ఖాతా నుంచి రూ.లక్ష బదిలీ అయ్యాయి. మీరే చేశారా? అని ప్రశ్నించారు. తాను చేయలేదని ఆమె సమాధానం ఇచ్చింది. తీరా బ్యాంకు స్టేట్‌మెంట్‌ను పరిశీలిస్తే.. తన ఖాతా నుంచి రూ.లక్ష డెబిట్‌ అయినట్లు చూసి నిర్ఘాంతపోయింది. వెంటనే సైబర్‌ క్రైమ్‌ సహాయవాణి నంబరుకు ఫోన్‌ చేసి ఖాతాను బ్లాక్‌ చేసి పోలీసులను ఆశ్రయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని