logo

Vijayawada: తెదేపా కార్యకర్తలపై వల్లభనేని వంశీ వర్గీయుల దౌర్జన్యం

నిత్యం గరంగరం, ఉద్రిక్తతంగా ఉండే గన్నవరం రాజకీయం.. ఈసారి విజయవాడ.. అందులోనూ కోర్టు ప్రాంగణం వేదికైంది.

Updated : 06 Mar 2024 08:22 IST

తెదేపా నాయకుడి అన్న కుమారుడు, డ్రైవర్‌లపై దాడి 
విజయవాడలో కోర్టు, పోలీస్‌ స్టేషన్ల వద్ద ఉద్రిక్తత

సూర్యారావుపేట పోలీసు స్టేషన్‌ వద్ద బందోబస్తు

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - సూర్యారావుపేట : నిత్యం గరంగరం, ఉద్రిక్తతంగా ఉండే గన్నవరం రాజకీయం.. ఈసారి విజయవాడ.. అందులోనూ కోర్టు ప్రాంగణం వేదికైంది. వైకాపా నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు, ఆయన సమక్షంలోనే తెదేపా నేతలపై దౌర్జన్యం చేశారు. ఇది చినికి చినికి గాలివానగా మారి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. 2019 నాటి కేసు విచారణ నిమిత్తం విజయవాడలోని ప్రజాప్రతినిధుల న్యాయస్థానానికి హాజరైన గన్నవరం తాజా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దీనికి కారణం కాగా, ఆయన అనుచరులు తెదేపాకు చెందిన ఇద్దరు యువకులపై దౌర్జన్యం చేయడంతో వివాదం మొదలైంది. యువకులను వంశీ గన్‌మెన్‌ సూర్యారావుపేట పోలీసులకు అప్పగించడంతో తెదేపా శ్రేణులు అక్కడకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఆర్‌పీఎఫ్‌ బలగాలను హుటాహుటిన స్టేషన్‌కు తరలించారు.

2019లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా జరిగిన గొడవలో వల్లభనేని వంశీ, ఆయన అనుచరుడు ప్రసాదంపాడు ఉప సర్పంచి గూడవల్లి నరసింహారావు (నర్సయ్య)లపై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత.. ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీ వైకాపాలో చేరగా, నర్సయ్య మాత్రం తెదేపాలోనే ఉన్నారు. అప్పటి నుంచి వీరి మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ఎనికేపాడులో నర్సయ్యకు ఉన్న స్థలాన్ని గ్రామీణ తెదేపా కార్యాలయానికి అద్దెకు ఇచ్చారు. ఇటీవల ప్రసాదంపాడులోని ఆయన ఇంటిపై కొంత మంది దాడి చేసి, కారు అద్దాలు పగలకొట్టారు. దీనికి కొద్ది రోజుల ముందు గన్నవరంలోని ఒక వివాహానికి హాజరు కాగా.. అక్కడ గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో 2019 నాటి కేసు మంగళవారం విజయవాడలోని ప్రజాప్రతినిధుల న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. దీనికి వంశీ, నర్సయ్యలు హాజరయ్యారు.

వివరాలు తెలుసుకుంటున్న యార్లగడ్డ వెంకట్రావు

ప్రజాప్రతినిధుల కోర్టు ఆవరణలోనే ఘర్షణ

నర్సయ్య కోర్టు హాలులో ఉండగా.. అతని డ్రైవర్‌ సుబ్బారెడ్డి మంచి నీటి సీసా తీసుకుని వచ్చారు. తిరిగి కోర్టు నుంచి వెళ్తుండగా.. తనను ఫొటోలు తీశాడని వంశీ అనుమానించి తన అనుచరులను అప్రమత్తం చేశారు. వారు సుబ్బారెడ్డిని నిలవరించి చరవాణిని లాక్కున్నారు. ఈలోగా వంశీ గన్‌మెన్‌ సూర్యారావుపేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి డ్రైవర్‌ సుబ్బారెడ్డితో పాటు నర్సయ్య అన్న కుమారుడు గూడవల్లి రవీంద్రను అదుపులోకి తీసుకుని సూర్యారావుపేట స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న నర్సయ్య.. వెంటనే జరిగిన విషయాన్ని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు న్యాయాధికారి గాయత్రీ దేవి దృష్టికి తీసుకొచ్చారు. తనకు ప్రాణ భయం ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. రాతపూర్వకంగా ఇవ్వాలని మేజిస్ట్రేట్‌ సూచించడంతో ఇచ్చారు. తనను వంశీ పిలిచి చెంపదెబ్బ కొట్టారని సుబ్బారెడ్డి చెబుతున్నారు. నెలరోజుల్లో అందరినీ ఏరివేస్తామని, ఇప్పటికే ఆలస్యమైందని.. ఇక సహించేది లేదని వంశీ, ఆయన అనుచరులు బెదిరంపులకు పాల్పడ్డారని తెదేపా నేతలు ఆరోపించారు.

స్టేషన్‌కు భారీగా తరలివచ్చిన శ్రేణులు

నర్సయ్య అన్న కుమారుడు, డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం తెలుసుకున్న తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సూర్యారావుపేట స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే సీఆర్‌పీఎఫ్‌ బలగాలను పిలిపించారు. గన్నవరం నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు, తన అనుచరులతో అక్కడకు చేరుకున్నారు. వీరిని నియంత్రించేందుకు రాజ్‌భవన్‌ వద్ద పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టారు. ఈ లోగా నర్సయ్య పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని.. ఘటనపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫొటో తీశారని చెప్పటంతో డ్రైవర్‌ చరవాణిని తనిఖీ చేశారు. అందులో ఏ విధమైన ఫొటోలు లేకపోవటంతో వంశీ అనుచరులు మాట మార్చేశారు. వంశీని డ్రైవర్‌ నిర్లక్ష్యంగా ఎగాదిగా చూశారన్నారు. తాను అలా చూడలేదని సుబ్బారెడ్డి అంటున్నారు. తమ వారిని అకారణంగా కొట్టారంటూ ఆందోళన చేపట్టారు. డీసీపీ కంచె శ్రీనివాసరావు, ఇతర అధికారులు వచ్చి తెదేపా నాయకులతో చర్చించారు. ఆ తర్వాత డ్రైవర్‌ సుబ్బారెడ్డిని, రవీంద్రను వదిలి పెట్టడంతో వివాదం సద్దుమణిగింది.

మాట్లాడుతున్న గూడవల్లి నర్సయ్య. పక్కన తెదేపా కార్యకర్త, కారు డ్రైవరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని