logo

గన్న‘వరాల్లేవు’.. శాపాలే.. నియోజకవర్గం వైపు తొంగిచూడని సీఎం జగన్‌

సీఎం హోదాలో ఉన్న జగన్‌ గడచిన అయిదేళ్లుగా గన్నవరం నియోజకవర్గం నుంచి తరచూ రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. అది ప్రేమతోనో, అభివృద్ధి కోసమో కాదు..

Updated : 14 Apr 2024 09:14 IST

అయిదేళ్లలో అభివృద్ధి తిరోగమనం
అయినా ఓట్లడిగేందుకు రాక
హనుమాన్‌జంక్షన్‌, గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే

సీఎం హోదాలో ఉన్న జగన్‌ గడచిన అయిదేళ్లుగా గన్నవరం నియోజకవర్గం నుంచి తరచూ రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. అది ప్రేమతోనో, అభివృద్ధి కోసమో కాదు.. కేవలం విమానం ఎక్కి రాష్ట్రమంతటా పర్యటించడానికి మాత్రమే వచ్చి వెళుతుంటారు. 58 నెలలు సీఎంగా ఉన్న ఆయన ఇంతవరకు ఒక్కసారి కూడా అధికారికంగా నియోజకవర్గంలో పర్యటించింది లేకపోగా.. చెప్పుకోతగ్గ రీతిలో మచ్చుకు ఒక్కటంటే ఒక్కటి కూడా అభివృద్ధి పని చేసిందే లేదు. కానీ నియోజకవర్గంలో బస్సు యాత్ర చేయడానికి వస్తున్న జగన్‌, ప్రజలకు ఏం చెబుతారు, ఏమని ఓటడుగుతారనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి.


గన్నవరం.. నాడు-నేడు

అసంపూర్తిగా నిలిచిన ఐటీ పార్కు రెండో టవర్‌

ఐటీ తిరోగమనం

2014 నుంచి 2019 మధ్య కాలంలో కేసరపల్లిలో ఉన్న ఐటీ పార్కులో దాదాపు 20కి పైగా సంస్థలు కొలువుదీరాయి. వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించాయి. కానీ 2019 నుంచి ఇప్పటి వరకు కొత్త సంస్థ ఒక్కటి రాకపోగా, ఉన్న సంస్థలన్నీ ఒక్కొక్కటిగా వెళ్లిపోయాయి. దీంతో స్థానిక యువతకు ఉద్యోగాలు, ప్రజలకు ఉపాధి అవకాశాలకు గండిపడిపోయింది. శనివారం రాత్రి జగన్‌ బస కూడా కేసరపల్లి ఐటీ పార్కులో ఎలాంటి పురోగతి లేక మధ్యలోనే ఆగిపోయిన రెండో టవర్‌ పక్కనే కావడం గమనార్హం.

రహ‘దారుణాలు’..

తెదేపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనే అత్యధికంగా రహదారులు అభివృద్ధి చేసిన ఘనత దక్కింది. 84 గ్రామ పంచాయతీలకు 70 పంచాయతీల్లో అంతర్గత రహదారులను సిమెంట్‌ రోడ్లుగా మార్చారు. ప్రధాన మార్గాలు, అనుసంధాన రహదారులను సైతం పునర్నిర్మించారు. కొన్ని రోడ్లను రవాణా అవసరాలకు వీలుగా విస్తరించారు కూడా. కానీ జగన్‌ హయాంలో సిమెంట్‌ రోడ్ల ఊసే లేకపోగా, ప్రధాన, అంతర్గత రహదారులకు నిధులు కేటాయించి కూడా పనులు పూర్తి చేయించలేకపోయారు.

పరిశ్రమలు డీలా

2014-19 మధ్య కాలంలో నియోజకవర్గం పారిశ్రామిక కేంద్రంగా ఆవిర్భవించింది. వీరపనేనిగూడెం, మల్లవల్లిలో అనేక సంస్థలు తమ యూనిట్ల స్థాపనకు ముందుకొచ్చాయి. మల్లవల్లిలో ఏకంగా 1,360 ఎకరాల్లో అతిపెద్ద పారిశ్రామికవాడకు రూపకల్పన చేశారు. అశోక్‌ లేల్యాండ్‌, పార్లే ఆగ్రో వంటి దిగ్గజ సంస్థలు యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. కానీ వైకాపా అధికారంలోకి రాగానే వీటితో సహా అనేక సంస్థలు వెనక్కి వెళ్లిపోయాయి.

ఇళ్ల స్థలాలేవీ?

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకున్న జగన్‌, నియోజకవర్గంలో దాదాపు ఇంకా 20 వేల మందికి స్థలాలు ఇవ్వకుండా గాలిలో పెట్టేశారు. ఎన్నికల కోడ్‌ వచ్చే వరకు అదిగో పట్టా, ఇదిగో స్థలం అంటూ లబ్ధిదార్లతో దోబుచూలాడి, చివరకు మొండిచెయ్యి చూపారు. ఇచ్చిన లేఔట్లలో కూడా చాలా వాటికి రోడ్డు సౌకర్యమే కల్పించకుండా ‘మమ’ అన్పించారు.

అన్నింట్లోనూ వెనకంజే

గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, ఆరోగ్య క్లినిక్‌ భవనాల నిర్మాణం, రెండో విడత నాడు-నేడు పనులు, జగనన్న లేఔట్లలో మౌలిక వసతుల కల్పన, జలజీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికి కుళాయి సౌకర్యం కల్పించే పనులు, ఉంగుటూరు వద్ద బుడమేరుపై వంతెన, రామవరప్పాడులో ఏలూరు కాల్వపై వంతెన నిర్మాణాలు, సీఎం సహాయనిధి మంజూరు, మల్లవల్లి పారిశ్రామికవాడ, గన్నవరం విమానాశ్రయం నిర్వాసితులకు పరిహారం, పునరావాసం వంటి కీలక పనులు ఎక్కడికక్కడే ఉండిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని