logo

సార్వత్రిక ఎన్నికల ప్రకటన నేడే

జిల్లాలోని ఒక పార్లమెంట్‌, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్‌ గురువారం విడుదల కానుంది.

Published : 18 Apr 2024 06:31 IST

నామపత్రాల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం కలెక్టరేట్‌: జిల్లాలోని ఒక పార్లమెంట్‌, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్‌ గురువారం విడుదల కానుంది. ఆర్వోలు ఉదయం 11 గంటల నుంచి నామపత్రాల స్వీకరణ ప్రారంభించనున్నారు. ఎంపీ అభ్యర్థులు కలెక్టర్‌ ఛాంబర్లో, ఎమ్మెల్యేకి ఆర్వో కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. దానికనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. ఈ నెల 25 వరకు ఈ ప్రక్రియ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుంది. మధ్యలో 21వ తేదీ(ఆదివారం) సెలవు దినం కావడంతో ఆరోజు మాత్రం స్వీకరించరు. ఈ ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఊరేగింపుగా రావడాన్ని, నామపత్రాలు సమర్పించడాన్ని పూర్తిగా వీడియో రికార్డింగ్‌ చేస్తారు. కార్యాలయాల వద్ద హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు.

ఆంక్షలు.. ధరావతు

అభ్యర్థితో పాటు మరో నలుగురిని మాత్రమే ఆర్వో కార్యాలయం వరకు అనుమతిస్తారు. ప్రతిపాదకుడు తప్పకుండా హాజరు కావాలి. మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. మిగతావారిని వంద మీటర్ల దూరంలో నిలిపివేస్తారు. పార్లమెంట్‌ నియోజకవర్గ స్థానానికి పోటీచేసే అభ్యర్థి రూ.25 వేలు, అసెంబ్లీ నియోజవర్గ స్థానానికి పోటీచేసే అభ్యర్థి రూ.10 వేలు ధరావతు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలు 50 శాతం చెల్లిస్తే సరిపోతుంది.

  • నామినేషన్‌ దాఖలుకు 13 రకాల డాక్యుమెంట్లను తీసుకురావాలి.
  • పార్లమెంట్‌కు పోటీచేసే వారు ఫారం-2ఏ, అసెంబ్లీకి ఫారం-2బి దరఖాస్తు చేయాలి.
  • గరిష్ఠంగా నాలుగు సెట్లు దాఖలు చేయొచ్చు.
  •  నామినేషన్‌ నేరుగా గానీ, ప్రపోజర్‌ ద్వారాగానీ సమర్పించొచ్చు.
  • నామపత్రాలతో పాటు కొత్తగా తెరిచిన బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలి.
  • రెండుకంటే ఎక్కువ నియోజకవర్గాల నుంచి దాఖలు చేయడం కుదరదు.
  • సువిధ యాప్‌ ద్వారా దాఖలు చేసే అవకాశం ఉన్నప్పటికీ వాటి కాపీలను భౌతికంగా ఆర్వోలకు అందజేయాలి.
  • ఫారం-26 స్టాంప్‌ పేపరు విలువ రూ.10 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. భౌతిక స్టాంప్‌ పేపరు అందుబాటులో లేకుంటే ఈ-స్టాంప్‌ కూడా ఉపయోగించొచ్చు.
  • నామినేషన్‌ వేసిన దగ్గర నుంచి ఖర్చు అతని ఖాతాలో లెక్కిస్తారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని