logo

ఉపాధి మేళాలు.. అధునాతన కోర్సులు

కోఠి మహిళా కళాశాల.. హైదరాబాద్‌ చరిత్రలో అంతర్భాగం. అలాంటి ప్రత్యేకత ఉన్న కళాశాలలో సైన్స్‌ విద్యార్థినిగా చదివిన ప్రొ.ఎం.విజ్జులత నేడు విశ్వవిద్యాలయ స్థాయి పొందిన అదే కళాశాలకు ఇన్‌ఛార్జి వైస్‌ ఛాన్సలర్‌గా నియమితులయ్యారు.

Published : 07 Mar 2023 02:59 IST

ఇవే నా ప్రాధామ్యాలు
‘ఈనాడు’తో తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వీసీ ప్రొ.ఎం.విజ్జులత

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, సుల్తాన్‌బజార్‌: కోఠి మహిళా కళాశాల.. హైదరాబాద్‌ చరిత్రలో అంతర్భాగం. అలాంటి ప్రత్యేకత ఉన్న కళాశాలలో సైన్స్‌ విద్యార్థినిగా చదివిన ప్రొ.ఎం.విజ్జులత నేడు విశ్వవిద్యాలయ స్థాయి పొందిన అదే కళాశాలకు ఇన్‌ఛార్జి వైస్‌ ఛాన్సలర్‌గా నియమితులయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి రెండురోజుల ముందు ఇన్‌ఛార్జి వీసీగా బాధ్యతలు చేపట్టారు. విద్యార్థిగా కోఠి మహిళా కళాశాలలో చదువుకున్న తాను మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ విధులు నిర్వహించడం చాలా సంతోషంగా అనిపిస్తే.. తొలి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వీసీగా బాధ్యతలు చేపట్టడం ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపారు. విద్యార్థి దశలో లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం.. పట్టుదల.. అంకితభావంతో చదువుకోవడం వల్లే ఈ స్థానానికి చేరుకున్నానని వివరించారు. ఈ సందర్భంగా ఆమె వీసీగా తన లక్ష్యాలను ‘ఈనాడు’ ప్రతినిధులకు వివరించారు.

ఉద్యోగిగా వెళ్లేలా..

తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం 5వేల మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఉన్నత విద్య అభ్యసించేందుకు వస్తున్న వీరికి ఉపాధి అవకాశాలను కూడా అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. సంప్రదాయ కోర్సులతోపాటు ఆర్ట్స్‌, సైన్స్‌, కామర్స్‌ విభాగాల్లో చదువు పూర్తైన వెంటనే వారికి ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ రూపొందించాం. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో క్యాంపస్‌ ఇంటర్వ్యూల తరహాలో మహిళా విశ్వవిద్యాలయంలోనూ ఉపాధి మేళాలు నిర్వహించనున్నాం. డిగ్రీ, పీజీ పూర్తికాగానే వారు ఉద్యోగులుగా బయటకు వెళ్లాలి, అంకుర సంస్థలు ప్రారంభించాలి లేదా.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారాలి.

పరిశోధనలపై దృష్టి..

విద్యారంగంలో పెనుమార్పులు వస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విస్తృతంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇంజినీరింగ్‌ విద్యార్థులే పరిశోధనల్లో అగ్రగాములన్న భావనను మార్చాలని నిర్ణయించాం. బీఎస్సీలో భౌతిక, రసాయన, జీవశాస్త్రాలతోపాటు కృత్రిమ మేధ, డేటా సైన్స్‌, న్యూట్రిషన్‌ కోర్సులపై దృష్టి కేంద్రీకరించనున్నాం. కొత్త విద్యా సంవత్సరంలో ఈ కోర్సులకు డిమాండ్‌ ఉంటుందని భావిస్తున్నాం. కృత్రిమమేధ, డేటాసైన్స్‌ల గురించి విద్యార్థులకు మరింత అవగాహన కల్పించేందుకు నిపుణులతో సదస్సులు నిర్వహించనున్నాం.

మౌలిక సదుపాయాల  కల్పన..

మహిళా విశ్వవిద్యాలయంలో అత్యున్నత బోధన ప్రమాణాలుండే విధంగా చర్యలు చేపట్టనున్నాం. తొలుత మౌలిక వసతుల సదుపాయాలపై దృష్టి కేంద్రీకరించాం. మహిళా విశ్వవిద్యాలయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. పదిరోజుల్లో విశ్వవిద్యాలయంలో చేపట్టాల్సిన నిర్మాణాల డిజైన్లు, ప్రణాళికలు తీసుకురావాలంటూ ఉన్నతాధికారులు సూచించారు. రూ.వందకోట్లతో తొమ్మిది అంతస్తుల వసతిగృహం, భౌతిక, రసాయనశాస్త్రాల బ్లాక్‌ల నిర్మాణం చేపట్టనున్నాం. అర్హులైన డిగ్రీ, పీజీ విద్యార్థినులందరికీ హస్టల్‌ వసతి కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని