logo

e-Challan: మీకూ వచ్చిందా.. ‘ఈ-చలానా’

చలానా విధించినట్లు ఫోన్‌కు సందేశం వస్తుంది. రూ.వేలల్లో కట్టాలని, లేకపోతే జైలుకెళ్తారంటూ హెచ్చరికలు వస్తుంటాయి. చలానాలపై 50 శాతం తగ్గింపు అంటారు. ఇది పోలీసు, రవాణా శాఖల సాంకేతిక తప్పిదం కాదు..

Updated : 16 Oct 2023 07:33 IST

నకిలీవి గుర్తించి, జాగ్రత్త పడండి

నేరగాళ్లు పంపిన నకిలీ సందేశం

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నడూ ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించకున్నా.. ఎక్కడా గీత దాటకున్నా పోలీసులు చలానా విధించినట్లు ఫోన్‌కు సందేశం వస్తుంది. రూ.వేలల్లో కట్టాలని, లేకపోతే జైలుకెళ్తారంటూ హెచ్చరికలు వస్తుంటాయి. చలానాలపై 50 శాతం తగ్గింపు అంటారు. ఇది పోలీసు, రవాణా శాఖల సాంకేతిక తప్పిదం కాదు.. సైబర్‌ నేరగాళ్ల మాయ. ప్రజల డబ్బు కాజేసేందుకు ఎప్పటికప్పుడు మారువేషాలు వేస్తున్న సైబర్‌ నేరగాళ్లు ఇప్పుడు ట్రాఫిక్‌ పోలీసుల అవతారమెత్తారు. ట్రాఫిక్‌ చలానాలు(e-Challan) చెల్లించాలంటూ బూటకపు సందేశాలతో మోతెక్కిస్తున్నారు. ఇవి నిజమేనని కొందరు తమకు వచ్చిన సందేశాల్లోని లింకులు క్లిక్‌ చేసి రూ.లక్షల్లో డబ్బు పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల్లో ఈ తరహా మోసాలు జరుగుతున్నట్లు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఆ లింకులపై క్లిక్‌ చేస్తే అంతే.. నగరంలో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు వాహన యజమాని నంబర్లకు చలానా వివరాలు సందేశాలుగా వస్తాయి. సైబర్‌ నేరగాళ్లు దీన్నే సొమ్ము చేసుకుంటున్నారు. ఈ-చలానా పేరుతో నకిలీ సందేశాలు పంపిస్తున్నారు. సగం మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని, డబ్బు కట్టేందుకు లింకు క్లిక్‌ చేయాలని సూచిస్తారు. వీటిపై క్లిక్‌ చేస్తే ఫోన్లలోని డేటా అంతా నేరస్థుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. కొన్నిసార్లు ఫోన్‌ హ్యాక్‌ అవ్వడం లేదా ఎనీ డెస్క్‌ తదితర యాప్‌లు డౌన్‌లోడ్‌ అవుతాయి. తర్వాత నేరగాళ్లు బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకుని డబ్బంతా కొట్టేస్తారు. ఇంకొన్ని సార్లు ఫోన్లలోని ఫొటోలు, వ్యక్తిగత వివరాలు సేకరించి బెదిరించి డబ్బు కొట్టేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

వాహనదారుల డేటా ఎలా..? సైబర్‌ నేరగాళ్లకు వాహనాల డేటా.. యజమానుల ఫోన్‌ నంబర్లతో సహా ఎలా వెళ్తున్నాయన్నది పెద్ద ప్రశ్న. కొన్ని ప్రైవేటు సంస్థల్లో భద్రతా వ్యవస్థలు సక్రమంగా లేకపోవడం, ఉద్యోగుల తప్పిదాలతో డేటా బయటకు పొక్కుతోంది. ట్రాఫిక్‌, రవాణా శాఖలకిచ్చిన వాహనదారుల డేటా ఎలా వెళ్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో ఎక్కువ మందికి సొంత వాహనాలు ఉన్నందున.. గంపగుత్త సందేశాలు పంపిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించామని సైబర్‌క్రైమ్‌ అధికారులు తెలిపారు

ఫిర్యాదు చేయొచ్చిలా..

నకిలీ ఈ-చలానాల పేరుతో సందేశాలను నమ్మి డబ్బు పోగొట్టుకుంటే వెంటనే 1930 టోల్‌ ఫ్రీ, పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ః ఒకవేళ చలానా ఉన్నట్లు సందేశం వస్తే.. పోలీసు శాఖ ఆధ్వర్యంలోని ‘ఈ-చలానా’ వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకోవాలి. అక్కడ ఉంటే అందులోనే రుసుము కట్టొచ్చు. ః ఈ తరహా అనుమానాస్పద నకిలీ సందేశాలు వస్తే.. వాటిని ప్రత్యేక వాట్సాప్‌ నంబరు 87126 72222 పంపి ఫిర్యాదు చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని