logo

ముఖ్యమంత్రిని అందించిన మేడ్చల్‌

రాష్ట్ర రాజకీయాల్లోకి అగ్రనేతలను అందించిన పురిటిగడ్డ మేడ్చల్‌.. 1952లో నియోజకవర్గం ఏర్పాటైంది. 1957లో ఇతర నియోజకవర్గంలో కలిపినా 1962లో మళ్లీ నియోజక వర్గంగా మారింది.

Updated : 28 Oct 2023 04:19 IST

న్యూస్‌టుడే, ఘట్కేసర్‌: రాష్ట్ర రాజకీయాల్లోకి అగ్రనేతలను అందించిన పురిటిగడ్డ మేడ్చల్‌.. 1952లో నియోజకవర్గం ఏర్పాటైంది. 1957లో ఇతర నియోజకవర్గంలో కలిపినా 1962లో మళ్లీ నియోజక వర్గంగా మారింది. ఇక్కడి నేతలు కేంద్ర, రాష్ట్రస్థాయి రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. 1978లో కాంగ్రెస్‌ నుంచి మర్రిచెన్నారెడ్డి గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్, రాజస్థాన్‌, తమిళనాడు రాష్ట్రాల గవర్నరుగా పనిచేశారు.


5 సార్లు గెలుపు.. 4 సార్లు పూర్తికాలం

న్యూస్‌టుడే, ఖైరతాబాద్‌: దానం నాగేందర్‌ మొత్తం 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా 4 సార్లే పూర్తికాలం కొనసాగారు. ఆసిఫ్‌నగర్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున 1994, 1999 ఎన్నికల్లో గెలుపొందారు. 2004లో తెదేపా నుంచి గెలిచారు. అయితే కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో తెదేపాకు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో ఖైరతాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున గెలిచారు. 2014లో ఓడిపోయారు. 2018లో తెరాసలో చేరి విజయ ఢంకా మోగించారు.


హైటెక్‌సిటీ.. అప్పటి మూసాపేట పంచాయతీ

న్యూస్‌టుడే, మూసాపేట: హైదరాబాద్‌ మహా నగరానికి హైటెక్‌సిటీ తలమానికం. ఈ ప్రాంతం ఒకప్పుడు మూసాపేట పంచాయతీ పరిధిలో ఉండేది. మూసాపేట, జింకలవాడ, అల్లాపూర్‌, బబ్బుగూడ, రామారావునగర్‌, కబీర్‌నగర్‌, మాదాపూర్‌, గుట్టల బేగంపేట, దయార్‌గూడ, సంగీత్‌నగర్‌ రెవెన్యూ గ్రామాల సమాహారంగా 1956లో మూసాపేట పంచాయతీ ఏర్పడింది. 1981లో మాదాపూర్‌ పేరుతో ప్రత్యేక పంచాయతీ ఏర్పాటైంది.


అమ్మ ఆశీర్వాదంతోనే ప్రచారానికి

న్యూస్‌టుడే, గౌతంనగర్‌: తల్లిని మించిన దైవం లేదు. మల్కాజిగిరి నుంచి భారాస అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన మర్రి రాజశేఖర్‌రెడ్డి నిత్యం  తల్లి అరుంధతీ ఆశీర్వాదô తీసుకున్నాకే అడుగు బయటపెడతారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారానికీ అలాగే వెళ్తున్నారు. తల్లి పేరున అరుంధతి ఆసుపత్రి నెలకొల్పి అనేక మందికి ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు. తల్లి ఆశీర్వాదం, ప్రజల మద్దతుతో తప్పక గెలుస్తానంటున్నారు.


ఓటింగ్‌ యంత్రాలు... గంటల్లో ఫలితాలు

న్యూస్‌టుడే, కాచిగూడ: మనదేశంలో ఎన్నికల క్రతువును ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు(ఈవీఎంలు) సులభతరం చేశాయి. దీంతో ఫలితాలు గంటల వ్యవధిలో వెలువడుతున్నాయి. 1989లో బీఈఎల్‌, ఈసీఐఎల్‌ వీటిని అభివృద్ధి చేశాయి. తొలిసారిగా కేరళలోని పరవూరు నియోజకవర్గ ఉపఎన్నికలో, 1998లో దిల్లీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో పరిమితంగా వినియోగించారు. 1999 నుంచి పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని