logo

పాదయాత్రలు.. ప్రదర్శనలు.. పర్యటనలు

లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల తరఫున బరిలో దిగనున్న అభ్యర్థులు ఈ నెల 18లోగా నియోజకవర్గం మొత్తం చుట్టేద్దామని నిర్ణయించుకున్నారు. ఇంకా హైదరాబాద్‌ స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయలేదు.

Published : 10 Apr 2024 02:07 IST

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల తరఫున బరిలో దిగనున్న అభ్యర్థులు ఈ నెల 18లోగా నియోజకవర్గం మొత్తం చుట్టేద్దామని నిర్ణయించుకున్నారు. ఇంకా హైదరాబాద్‌ స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయలేదు. ప్రధాన పార్టీల అభ్యర్థులు వారివారి నియోజకవర్గాల్లో ప్రచారాలు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. హైదరాబాద్‌ లోక్‌సభ మజ్లిస్‌ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ రంజాన్‌ అనంతరం పాదయాత్రను చేపట్టనున్నారు. సికింద్రాబాద్‌ భాజపా అభ్యర్థి కిషన్‌రెడ్డి మంగళవారం ప్రచారరథం ద్వారా నియోజకవర్గంలో పర్యటించారు. మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్‌ బుధవారం నుంచి రోడ్‌షోలు నిర్వహించనుండగా... కాంగ్రెస్‌ అభ్యర్థి సునీతా మహేందర్‌ రెడ్డి ప్రచార రథాలను సిద్ధం చేసుకుని మినీ బహిరంగ సభల ఏర్పాటుకు సమాయత్తమవుతున్నారు. భారాస అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మేడ్చల్‌, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. చేవెళ్ల భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఇప్పటికే వికారాబాద్‌, తాండూర్‌ నియోజకవర్గాల్లో ప్రచారం పూర్తిచేశారు. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్రలు చేపట్టనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్‌ రెడ్డి చేవెళ్ల, వికారాబాద్‌, తాండూర్‌ల నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. చేవెళ్లలో ఈ నెల 13న భారాస నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ద్వారా ప్రచారాన్ని ఉద్ధృతం చేసేందుకు కాసాని జ్ఞానేశ్వర్‌ కార్యాచరణ రూపొందించారు. నామినేషన్ల నాటికి ఒక విడత ప్రచారం పూర్తి చేయాలని అనుకుంటున్నారు. భారాస అభ్యర్థులు పద్మారావు గౌడ్‌, కాసాని జ్ఞానేశ్వర్‌, రాగిడి లక్ష్మారెడ్డిలు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి కార్యకర్తలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. మజ్లిస్‌ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ ఈ నెల 19న, కాంగ్రెస్‌ పార్టీ సికింద్రాబాద్‌ అభ్యర్థి దానం నాగేందర్‌ ఈ నెల 24 నామినేషన్‌ సమర్పించాలని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని