logo

సంరక్షణపై నీలినీడలు

బాల నేరస్థులకు ఆశ్రయం కల్పించే రాష్ట్రంలోని ఏకైక జువైనల్‌ హోమ్‌ నిర్వహణ గాలిలో దీపంలా మారింది. మౌలిక సదుపాయాల కొరత ఒకెత్తయితే.. సరిపడా సిబ్బంది లేక చిన్నారుల్ని సంరక్షించలేకపోవడం పెద్ద వైఫల్యం. తాజాగా గాజులరామారంలోని జువైనల్‌ హోమ్‌ నుంచి 8 మంది బాలురు తప్పించుకొని పారిపోవడం కలకలం రేపింది.

Updated : 18 Apr 2024 04:35 IST

 జువైనల్‌ హోమ్‌ నిర్వహణలో నిర్లక్ష్యం

పారిపోయిన 8 మంది బాలురు

 

కుత్బుల్లాపూర్‌, మలక్‌పేట్‌, న్యూస్‌టుడే: బాల నేరస్థులకు ఆశ్రయం కల్పించే రాష్ట్రంలోని ఏకైక జువైనల్‌ హోమ్‌ నిర్వహణ గాలిలో దీపంలా మారింది. మౌలిక సదుపాయాల కొరత ఒకెత్తయితే.. సరిపడా సిబ్బంది లేక చిన్నారుల్ని సంరక్షించలేకపోవడం పెద్ద వైఫల్యం. తాజాగా గాజులరామారంలోని జువైనల్‌ హోమ్‌ నుంచి 8 మంది బాలురు తప్పించుకొని పారిపోవడం కలకలం రేపింది. గతంలో ఇదే హోమ్‌ నుంచి ముగ్గురు బాలురు సిబ్బంది కళ్లుగప్పి పారిపోయారు.  

 షిప్టుకు ఐదుగురు మాత్రమే

నగరంలో మూడు జువైనల్‌ హోమ్‌లు ఉన్నాయి. నింబోలిఅడ్డాలో బాలికలు.. సైదాబాద్‌లో బాలలవి ఉన్నాయి. వీటిలో నేరారోపణపై వచ్చిన బాలల్ని మాత్రమే సంరక్షిస్తారు. 18 ఏళ్లలోపు చిన్నారులు నేరాలు చేసి.. దోషిగా నిర్ధారణ అయితే గాజులరామారంలోని జువైనల్‌ హోమ్‌కు తరలిస్తారు. పారిపోయిన వారితో కలిపితే ప్రస్తుతమిక్కడ 32 మంది బాల నేరస్థులు ఉన్నారు. వీరందరికీ విద్యాబుద్ధులు నేర్పడంతోపాటు.. పెట్రోలు బంకు నిర్వహణ, చేనేత వస్త్రాల తయారీ, డ్రైవింగ్‌, పాడికి సంబంధించిన అంశాల్లో నైపుణ్యం కల్పిస్తారు. భవిష్యత్తులో నేరాలకు పాల్పడకుండా కౌన్సెలింగ్‌ ఇస్తారు. ఇక్కడ దాదాపు 25 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా.. 10 మందితోనే నెట్టుకొస్తున్నారు. వీరిలోనూ ఆరుగురు పొరుగుసేవల/తాత్కాలిక ఉద్యోగులున్నారు. ఒక్కో షిఫ్టులో కేవలం ఐదుగురు చొప్పున మాత్రమే విధుల్లో ఉంటున్నారు. ప్రత్యేక వైద్యుడు కూడా అందుబాటులో లేడు. ఫలితంగా బాలలపై పర్యవేక్షణ పూర్తిగా తగ్గిపోయింది. జువైనల్‌ హోమ్‌కు కుడి భాగంలోని పాత ప్రహరీపై ముళ్ల కంచె లేదు. బాలురు దూకి పారిపోయేందుకు అవకాశముంది. సిబ్బంది సరిపడా లేకపోవడం, ముళ్ల కంచె లేకపోవడాన్ని అవకాశంగా తీసుకున్న బాలలు ఈ గోడ దూకే పరారయ్యారు.
సమస్యల తిష్ఠ: నింబోలిఅడ్డాలో బాలికల పరిశీలక గృహంలో ఆరుగురున్నారు. చిల్డ్రన్‌ హోంలో 63 మంది బాలికలున్నారు. వీరి పర్యవేక్షణకు 33 మంది సిబ్బంది అవసరముండగా.. ఏడుగురు మాత్రమే ఉన్నారు. మూడు షిఫ్టులకు బదులు రెండు షిఫ్టులు చేయాల్సి వస్తోంది. శాశ్వత ఉద్యోగులు లేక పొరుగుసేవల కింద నియమించారు. బాలికలు అనారోగ్యం బారిన పడితే డాక్టర్‌ అందుబాటులో లేక స్థానిక ఆసుపత్రిలో చూపించాల్సిన పరిస్థితి.

 సైదాబాద్‌లో అబ్జర్వేషన్‌ హోమ్‌లో 100 మంది బాలలు ఉన్నారు. ఇక్కడ కేవలం ఐదుగురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. పూర్తిస్థాయి వైద్యుడు లేడు.

బాలల పరారీపై పూర్తిస్థాయి విచారణ

ఈనాడు, హైదరాబాద్‌: జువైనల్‌ హోమ్‌ నుంచి బాలురు తప్పించుకున్న ఘటనలో ఇద్దరిని సస్పెండ్‌ చేసినట్లు తెలంగాణ సంస్కరణల విభాగం(కరెక్షనల్‌ సర్వీసెస్‌) డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ మీర్జా రజా అలీ బేగ్‌ తెలిపారు. ఇద్దరు సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యిందని వివరించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని