logo

ప్రయాణికులకు పరీక్ష

బస్సులన్నీ మేమంతా సిద్ధం సభకు తరలివెళ్లాయి. ఆర్టీసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి వైకాపా వారు అడిగింతే తడవుగా బస్సులన్నింటినీ మళ్లించారు

Published : 29 Mar 2024 06:20 IST

 జగన్‌ సభకు వందల బస్సులు తరలింపు

గంటల తరబడి తప్పని పడిగాపులు

 సీట్ల కోసం పాట్లు

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే : బస్సులన్నీ మేమంతా సిద్ధం సభకు తరలివెళ్లాయి. ఆర్టీసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి వైకాపా వారు అడిగింతే తడవుగా బస్సులన్నింటినీ మళ్లించారు. ప్రయాణికుల ఇబ్బందులను ఏమాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు జనం నరకయాతన పడ్డారు. బస్టాండ్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. అధికారులను ప్రశ్నిస్తే సమాధానం ఇచ్చేవారే కరవయ్యారు. మరోవైపు జగన్‌ సభకు బస్సులను మళ్లించడంతో ఆర్టీసీ సంస్థ ఆదాయాన్ని కోల్పోయింది.

 ఏడు వందలు మళ్లించారు

నంద్యాల పట్టణం, ఎమ్మిగనూరు పట్టణాల్లో వైకాపా మేమంతా సిద్ధం సభలు నిర్వహిస్తోంది. జనాలను తరలించేందుకు వైకాపా నాయకులు బస్సులన్నింటినీ తీసుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 960 బస్సులు ఉండగా అందులో 700కుపైగా బస్సులను మళ్లించడం గమనార్హం. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లలోనే మగ్గిపోయారు. కర్నూలు నుంచి నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆత్మకూరు, నందికొట్కూరు మార్గాల్లో నడవాల్సిన బస్సులు ఉదయం నుంచి రాత్రి 8 గంటలలోపు 5, 6 ట్రిప్పులు తిరగాల్సి ఉంది. గురువారం చాలా సర్వీసులు రద్దు చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సులు ఎంతసేపటికీ రాకపోవడంతో చివరికి ప్రైవేటు వాహనాల్లో వెళ్లారు.

ఆర్టీసీ ఆదాయానికి గండి

ఒక్కో ఆర్టీసీ బస్సు సరాసరిన దూరాన్ని బట్టి 8 ట్రిప్పులు తిరగాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాలకు ఒక్క ట్రిప్పు తిరిగితే ఖర్చులన్నీపోనూ రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు ఆదాయం వస్తుంది. అదే కర్నూలు నుంచి నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాలకు వెళితే ఒక్క ట్రిప్పు ద్వారా రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు లభిస్తుంది. పల్లె ప్రాంతాలకు జనాభాకు అనుగుణంగా దూరాన్ని బట్టి ప్రతిరోజు నాలుగైదు ట్రిప్పులు తిరగాల్సి ఉంది. నంద్యాల, ఎమ్మిగనూరు, ఆత్మకూరు, మంత్రాలయం, శ్రీశైలం వంటి ప్రాంతాలకు మూడు నుంచి నాలుగు ట్రిప్పులు నడుస్తాయి. కానీ సిద్ధం సభకు బస్సులు మళ్లించగా ఒక్కో బస్సుకు డీజిల్‌ ఇచ్చి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు మాత్రమే ఇస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన ఆర్టీసీ భారీగా నష్టపోయింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని