logo

జగనన్నా..కరవు సీమ కష్టాలు చూడవా

కనిపించలేదా కరవు రైతు వేదన.. వినిపించలేదా పశ్చిమ పల్లెల కన్నీటి రోదన. పొలాలు బీడుబారాయి.. ఊరిలో పనులు కరవయ్యాయి.. ఇళ్లకు తాళాలు పడ్డాయి..

Published : 29 Mar 2024 06:40 IST

కౌతాళం: వర్షాలు లేక, ఎల్లెల్సీ సాగునీరు అందక ఎండిపోయిన మిరప పంట

కనిపించలేదా కరవు రైతు వేదన.. వినిపించలేదా పశ్చిమ పల్లెల కన్నీటి రోదన. పొలాలు బీడుబారాయి.. ఊరిలో పనులు కరవయ్యాయి.. ఇళ్లకు తాళాలు పడ్డాయి.. మూటాముల్లె సర్దుకొని పల్లెలు పట్నాలకు పయమయ్యాయి. ముసలీముతక, చిన్న పిల్లలు ఇంటి వాకిట కవాలయ్యారు. పండగకో పబ్బానికి వచ్చిపోతూ సొంతూరికి చుట్టపుచూపయ్యారు. ‘మీ బిడ్డను ఒక్కసారి దీవించండి, కష్టం మీ దరిచేరనీయను’ అని అన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి గ్రామాల సమస్యలు, జనం కష్టాలు కనిపించడం లేదా? అని పశ్చిమ పల్లెలు ప్రశ్నిస్తున్నాయి.

కౌతాళం: గోతులదొడ్డి గ్రామంలో వలస వెళ్లేందుకు బారులు తీరిన వాహనాలు

పరిహారం జాడ లేదు

పత్తికొండ గ్రామీణం పెద్దహుల్తి గ్రామానికి చెందిన రైతు బసవరాజు ఈ ఏడాది ఖరీఫ్‌లో తొమ్మిది ఎకరాల్లో పత్తి పంట సాగుచేశారు. పెట్టుబడి కింద రూ.లక్షకు పైగానే ఖర్చుపెట్టారు. పైరు వేసినప్పటి నుంచీ వానజాడ లేకపోవటంతో పంట మొత్తం ఎండిపోయింది. ఉన్నా లాభం లేదనుకుని పంట మొత్తం దున్నేశారు. రబీలో శనగ సాగు చేపట్టినా పరిస్థితిలో మార్పులేదు. అటు ఖరీఫ్‌, ఇటు రబీ మొత్తం నష్టాలపాలే. ప్రభుత్వం ఆదుకుంటుందని భావించినా.. ఇటీవల కరవు సహాయక చర్యల్లో భాగంగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి బటన్‌ నొక్కినా.. ఒక్క పైసా ఇంత వరకు జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఖరీఫ్‌కు పంటల సాగు ఎలా చేపట్టాలో దిక్కు తోచటంలేదంటున్నారు రైతు బసవరాఉజు.

 - న్యూస్‌టుడే, పత్తికొండ గ్రామీణం


తీరని దాహం

ఆస్పరి మండలంలో  మొత్తం 33 గ్రామాలు ఉన్నాయి. 21 గ్రామ పంచాయతీలు, 12 మజార గ్రామాలు ఉన్నాయి.  మండల  జనాభా 65,082. మండలంలోని 53 ప్రభుత్వ నీటి పథకాలు ఉన్నాయి. భూగర్భజాలాలు అడుగంటిపోవడంతో కొన్ని  బోర్లులో నీరు అరకొరగా వస్తున్నాయి. మరికొన్ని బోర్లు పూర్తిస్థాయిలో ఎండి పోయాయి. ఆస్పరి మండలానికి తంగరడోణ, తుర్వగల్లు, నగరూరు, చిగళి, బిణిగేర, హలిగేర, చిరుమాన్‌దొడ్డి, శంకరబండ, ఆస్పరి గ్రామానికి నాగనాతనహళ్లీ జలశయం నుంచి నీరు సరఫరా కావాల్సి ఉండగా వారం పదిరోజులకోకసారి వస్తున్నాయి. ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలు, రెండు చక్రాల బండ్లపై నీరు తెచ్చుకుంటున్నారు.
- న్యూస్‌టుడే, ఆస్పరి


దారి తప్పారు

పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలం మారెళ్ల- బొందిమడుగుల గ్రామాల మధ్య వాగుపై రాకపోకల కోసం గతంలో నిర్మించిన వంతెన కూలిపోయి ఏళ్లు గడుస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ వంతెన నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేసి వెంటనే వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని గత ఏడాది జూన్‌ 1న పత్తికొండలో నిర్వహించిన రైతు భరోసా బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇచ్చారు. నేటికీ నెరవేర్చకపోతే ఎలా అని రైతులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  

- న్యూస్‌టుడే, పత్తికొండ, తుగ్గలి


వ్రలస బాటలో బతుకు పోరు

మంత్రాలయం గ్రామీణం, న్యూస్‌టుడే: కొడుకులు, కోడళ్లు వలస వెళ్తే వృద్ధులకు ఒంటరి జీవనం తప్పడంలేదు. పశ్చిమ పల్లెల్లో పనులు లేక మూటాముల్లె సర్దుకుని వలసబాట పట్టారు. ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇళ్లకు వేసిన తాళాలే ఇందుకు నిదర్శనం. మంత్రాలయానికి నాలుగు కి.మీ. దూరంలో ఉన్న కల్లుదేవకుంట గ్రామంలో 300 ఇళ్లు, 1,800 జనాభా, 1,349 మంది ఓటర్లు ఉన్నారు. పొలాల్లో బోర్లు పడకపోవడంతో వలసలు తప్పడం లేదు. నేటికీ తాగునీటికి కూడా నాలుగు కి.మీ. దూరంలోని చిలకలడోణ, ఇబ్రహీంపురం గ్రామాలకు వెళ్లి తెచ్చుకోవలసిన పరిస్థితి. గుంటూరు, హైదరాబాద్‌, బెంగళూరు తదితర ప్రాంతాలకు భార్యా పిల్లలతో కలిసి వలస వెళ్లారు.

రెండెకరాల పొలం ఉన్నా..

ఇంట్లో అందరూ వలస వెళ్లడంతో కల్లుదేవకుంట గ్రామంలో ఇంటి వద్ద ఇలా ఒంటరిగా కూర్చున్న వృద్ధురాలి పేరు గువ్వల నరసమ్మ. ఇద్దరు కుమారులలో చిన్న కుమారుడు గువ్వల శివరాముడును డిగ్రీ వరకు చదివించారు. కోడలు గువ్వల రంగమ్మ ఇద్దరూ గత ఐదు సంవత్సరాలుగా బెంగళూరుకు వలస వెళ్లి అక్కడే సిమెంట్‌ పనులు చేస్తున్నారు. ఏదో పండగలకు, శుభకార్యాలకు మాత్రం గ్రామనికి వచ్చి వారం పది రోజులు ఉండి, తిరిగి సుగ్గి బాట పడుతున్నారు. రెండెకరాల పొలం ఉన్నా.. పంటలు పండక ఊరొదిలి వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నరసమ్మ.

ఊళ్లో పనులు లేకనే..

మంచంపై కూర్చున్న ఈ వృద్ధురాలు జక్కల రాములమ్మకు కల్లుదేవకుంట గ్రామంలో ఎలాంటి పనులు లేక కుటుంబమంతా వలస వెళ్లారని చెబుతున్నారు. పెద్ద హనుమంతు, చిన్న హనుమంతు ఇద్దరు కుమారులు, దస్తగిరమ్మ, లక్ష్మి ఇద్దరు కోడళ్లు మనవళ్లు, మరవరాళ్లు అందరూ ఊళ్లో పనులు వలసబాట పట్టారు. గుంటూరు, బెంగళూరు, హైదరాబాద్‌ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఆమె ఒక్కరే ఇంటి వద్ద ఉంటున్నారని, పండగలకు కుమారులు, కోడళ్లు వచ్చివెళ్తారని వృద్ధురాలు రాములమ్మ తెలిపారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని