logo

పశ్చిమాన జగన్‌ పచ్చి మోసం

 ఉమ్మడి కర్నూలు జిల్లాలో 19 మండలాలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి. ఆయా మండలాల్లో 4,84,619.2 హెక్టార్ల (82.05 శాతం) సాగు భూమి విస్తరించి ఉంది.

Updated : 29 Mar 2024 07:41 IST

పాదయాత్ర హామీలు నీటి మూటలే

ఐదేళ్లు పైసా విదిల్చలేదు

చెదిరిపోయిన కేసీ కాలువ

 ఉమ్మడి కర్నూలు జిల్లాలో 19 మండలాలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి. ఆయా మండలాల్లో 4,84,619.2 హెక్టార్ల (82.05 శాతం) సాగు భూమి విస్తరించి ఉంది. 3.12 లక్షల మంది (79.07 శాతం) మంది రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. హెక్టార్‌లోపు భూమి కలిగిన సన్నకారు రైతులు 1,40,893 మంది ఉన్నారు. ఇక్కడ పత్తి 2,14,233 హెక్టార్లు, వేరుశనగ 41,369, కంది 13,353, మిరప 41,959, ఉల్లి 15,588, ఇతర పంటలు 27,443, రబీ సీజన్‌లో పప్పుశనగ 34,719 హెక్టార్లు, వేరుశనగ 13,393, ఇతర పంటలు 20,775 హెక్టార్లలో సాగవుతున్నాయి. సాగు నీటి వసతి లేకపోవడంతో వర్షాధారంగా ఒక పంటనే సాగు చేస్తుంటారు. ్చ

 ఏడాది ఓపిక పట్టండి.. పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యం ఇస్తాం.. స్థానికంగా ఉపాధి కల్పిస్తాం.. వలస మాటే ఉండదంటూ జగన్‌ జనాలను నమ్మించారు.. ప్రజా సంకల్ప పాదయాత్ర పేరుతో 2017 నవంబరులో పశ్చిమ ప్రాంతంలో పర్యటించారు.. పల్లెల్లో పగల్భాలు పలికారు.. నీరొస్తే సిరులు పండించొచ్చని జనం నమ్మారు.. జగన్‌ అధికారంలోకి వచ్చారు.. ఐదేళ్లు అవుతోంది.. ప్రాజెక్టులకు పైసా ఇవ్వలేదు.. తట్టెడు మట్టి పోయలేదు.. మేమంతా సిద్ధం పేరుతో మరోసారి పశ్చిమ ప్రాంతానికి వస్తున్నారు.. వెక్కిరిస్తున్న జల పునాదులను చూస్తారా జగన్‌ అంటూ జనం ప్రశ్నిస్తున్నారు.

 ‘‘ బనకచెర్ల హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు సమీపంలోని పెన్నానది వరకు 187 కి.మీ. మేర కుందూ నది విస్తరణకు తాము సిద్ధం.. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాధాన్య అంశంగా దీన్ని చేయిస్తాం ’’
- ప్రజా సంకల్ప యాత్రలో 2017 నవంబరు 18న రైతులకు జగన్‌ ఇచ్చిన హామీ.. మాటలే కాదూ ఏకంగా రైతుల వినతి పత్రాలపై సంతకం చేశారు.
జగన్‌ మాటలు నీటి మూటలయ్యాయి.. వంద పల్లెలను వరద పోటు నుంచి రక్షించే పనులు కాలేదు.. వందల ఎకరాలకు సాగు నీరిచ్చే రాజోలి, జొలదరాశి జలాశయాలకు పునాది పడలేదు. మూడేళ్ల కిందట విస్తరణ పనులకు శ్రీకారం చుట్టినా పురోగతి కరవైంది. ప్రభుత్వం పైసా విడుదల చేయకపోవడంతో గుత్తేదారు చేతులెత్తేశారు. వచ్చిన మట్టిని స్థానిక నేతలు అమ్ముకొని రూ.లక్షలు వెనకేసుకొన్నారు. జలాశయాల కోసం భూములు సేకరించారు..క్రయ విక్రయాలు లేకుండా రెడ్‌ మార్కులో పెట్టారు. పరిహారం మాత్రం ఇవ్వలేదు. భూముల్ని అమ్ముకోలేక.. బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకోలేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

అలగనూరును పడగొట్టారు

అలగనూరు సమతుల జలాశయం బాగోగులను జగన్‌ సర్కారు గాలికొదిలేసింది. 2.960 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ జలాశయం ద్వారా వైఎస్సార్‌ జిల్లాలోని కేసీ కాల్వ చివరి ఆయకట్టుకు నీరందించడంతోపాటు మంచినీటి సమస్యలు తీరే అవకాశముండేది. 2020లో అలగనూరు ప్రధాన కరకట్ట కుంగిపోవడంతో నీటి నిల్వకు అవకాశం లేకుండా పోయింది. మూడేళ్ల కిందట రూ.3.70 కోట్లతో పనులు చేపట్టగా వైకాపాకు చెందిన ఓ నేత రూ.70 లక్షల విలువైన పనులు చేసి మధ్యలోనే వదిలేశారు.

కేసీ ఆయకట్టు.. కనికట్టు

‘‘ దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కేసీ ఆయకట్టు ద్వారా రెండు పంటలకు సాగునీరు అందింది. తెదేపా అధినేత చంద్రబాబు పాలనలో కేసీ ఆయకట్టుకు నీరివ్వకపోవడంతో సాగు తగ్గింది.. మేం అధికారంలోకి వస్తే అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి సాగు.. తాగునీరు అందిస్తాం’’ ప్రజా సంకల్ప పాదయాత్రలో చాగలమర్రి మండలం ముత్యాలపాడు బస్టాండులో 2017 నవంబరు 14న జగన్‌ ప్రగల్భాలు పలికారు.
బీ గద్దెనెక్కిన తర్వాత మాట మరిచారు. కాల్వలు శిథిలావస్థకు చేరడంతో కనీసం ఒక్క పంటకు సరిపోయే నీరు అందడం లేదు. ఈ కాల్వపై కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాలో 1.46 లక్షల రైతు కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. రెండు జిల్లాలో 2.65 లక్షల ఎకరాల్లో పంటలకు నీళ్లివ్వాలి. 3,750 క్యూసెక్కుల నీరు ప్రవహించేలా కాల్వను నిర్మించారు. నిర్వహణ లేకపోవడంతో కాల్వంతా శిథిలావస్థకు చేరింది. మరమ్మతుల్లేక 2,200 క్యూసెక్కులు ప్రవహించడమే కష్టంగా మారింది. రెండో పంటకు నీరందకపోవడంతో సుమారు 56 వేల ఎకరాలు బీడుగా మారింది.

తుంగలో కలిసిన మాటలు

‘‘తుంగభద్ర దిగువ కాల్వ (ఎల్లెల్సీ) కింద 24 టీఎంసీల నీటి వాటాను ఎమ్మిగనూరు ప్రాంతానికి ఇచ్చి 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. తెదేపా ప్రభుత్వ హయాంలో ఒక ఎకరానికీ నీళ్లు ఇచ్చిన దాఖలాలు లేవని’’
- 2019 మార్చి 30న ఎమ్మిగనూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్‌ పలికిన మాటలివి.
కాల్వ కింద సుమారు 48,500 కుటుంబాలు పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. ఖరీఫ్‌, రబీ సీజన్‌లో ఏటా 1,51,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. గత అయిదేళ్లలో కేవలం 2,45,300 ఎకరాలకు మాత్రమే నీరివ్వడం గమనార్హం. సుమారు 5.09 లక్షల ఎకరాలకు సాగునీరు అందకపోవడంతో రూ.1,124 కోట్ల నష్టాన్ని అన్నదాతలు చవిచూశారు. ఇందుకు ప్రధాన కారణం కాల్వలు బాగా లేకపోవడమే. నిర్వహణకు జగన్‌ పైసా ఇవ్వలేదు.

నిల్వలేక దిగువకు..

పశ్చిమ ప్రాంతం మీదుగా తుంగభద్ర ప్రవహిస్తోంది. 1,496 టీఎంసీలు శ్రీశైలానికి చేరాయి. 2022-23లో తుంగభద్ర నుంచి అధికంగా 599 టీఎంసీల నీరు ప్రవహించింది... ఈ నీటిని ప్రాజెక్టులకు మళ్లించి ఉంటే లక్షల ఎకరాలు సస్యశ్యామలం అయ్యేది.

ఆర్డీఎస్‌పై నీలినీడలు

రాజోలి మళ్లింపు పథకం (ఆర్డీఎస్‌) ప్రాజెక్టు పూర్తైతే పశ్చిమ ప్రాంతంలో అదనంగా మరో 42 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశముందని భావించిన గత తెదేపా ప్రభుత్వం రూ.1,986 కోట్లతో అనుమతులు ఇచ్చింది. ప్రాజెక్టుకు 5,800 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అంతలోనే ప్రభుత్వం మారడంతో ఈ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటివరకు ఎకరా కూడా సేకరించలేదు. పంపింగ్‌ స్టేషన్లు, ఇతర పనులకు రూ.11 కోట్లు ఖర్చు చేసినా బిల్లులు మంజూరు కాకపోవడంతో గుత్తేదారుడు పనులు ఆపేశారు.

వేదవతి.. అథోగతి

వేదవతి ప్రాజెక్టు ద్వారా 80 వేల ఎకరాల ఆయకట్టుకుకు నీరందించే ఉద్దేశంతో గత తెదేపా ప్రభుత్వం రు.1,925 కోట్లతో అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుకు 4,250 ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఒక్క ఎకరా సేకరించలేదు. మూడు టీఎంసీలకు కుదించి.. ప్రాజెక్టు వ్యయాన్ని రూ.1942 కోట్లకు పెంచారు. పంప్‌హౌస్‌ నిర్మాణం, 6 కి.మీ. వరకు పైపులైన్ల ఏర్పాటుకు సుమారు రూ.102 కోట్లు ఖర్చు చేసినట్లు సంబంధిత అధికారి తెలిపారు.

నగరడోణ.. కాసుల్లేక

ఆలూరు బ్రాంచ్‌ (ఏబీసీ) కాల్వకు అనుసంధానం చేస్తూ నగరడోణ ప్రాజెక్టును నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. 4,200 ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో దీనికి రూపకల్పన చేశారు. ఇందుకు రూ.53 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. పూర్తయితే చిప్పగిరి, ఆలూరు, హాలహర్వి మండలాల్లోని రైతులకు సాగునీరు అందుతుంది. 50 శాతం పనులు పూర్తయ్యాయి. ఒక్క రూపాయి బిల్లు కూడా చెల్లించకపోవడంతో గుత్తేదారు పనులు నిలిపివేశారు.

ఎత్తిపోయని గురురాఘవేంద్ర

తుంగభద్ర దిగువ కాల్వ చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో గురురాఘవేంద్ర ఎత్తిపోతల ప్రాజెక్టును రూ.180 కోట్లతో నిర్మించారు. తుంగభద్ర నది ప్రాంతంలో పంప్‌హౌస్‌లు నిర్మించి అక్కడి నుంచి నీటిని ఎత్తిపోస్తారు. ఇందులో భాగంగా 11 రిజర్వాయర్లలో 5.373 టీంఎసీ నీటిని నిల్వ చేసుకుంటూ 40 వేల ఎకరాల ఆరుతడి, 10 వేల ఎకరాల తరి భూములకు సాగు నీరు అందించాల్సి ఉంది. వైకాపా ప్రభుత్వం వచ్చిన ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు విద్యుత్తు బిల్లులు, మరమ్మతులకు పైసా నిధులు ఇవ్వలేదు. ఫలితంగా మూడు ఎత్తిపోతల పథకాలు పని చేయడం లేదు.

గుండెకాయను పట్టించుకోలేదు

‘‘ తుంగభద్ర నదిపై గుండ్రేవుల జలాశయాన్ని నిర్మిస్తే 2.65 లక్షల ఎకరాలకు సాగునీరు, 659 గ్రామాలకు తాగునీటిని అందించొచ్చు. దీన్ని నిర్మిస్తామని 2014లో హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు పట్టించుకున్న దాఖలాలు లేవు. అధికారంలోకి వస్తే పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతుల కష్టాలు తీర్చుతామని పశ్చిమ ప్రాంతంలో ప్రజా సంకల్ప పాదయాత్ర, 2019 ఎన్నికల ప్రచారంలో జగన్‌ మాటిచ్చారు.
20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల నిర్మించేందుకు గతంలో జలవనరుల శాఖ అధికారులు నాలుగు పర్యాయాలు డీపీఆర్‌ తయారుచేసి ప్రభుత్వానికి పంపినా ఫలితం లేకపోయింది.

గాజులదిన్నెకు నీళ్లొదిలారు

‘‘హంద్రీనీవా నుంచి గాజులదిన్నెకు 3 టీఎంసీల నీటిని తరలిస్తే ఈ ప్రాంతమంతా కళకళలాడుతుందని’’ ప్రజా సంకల్ప పాదయాత్రలో 2017 నవంబరు 28న గోనెగండ్లకు వచ్చిన జగన్‌ చెప్పిన మాటలివి. రూ.57.35 కోట్లతో ఆధునికీకరణ పనులకు 2022లో శంకుస్థాపన చేశారు. 24 నెలల్లో పనులు పూర్తవుతాయన్నారు. ఆధునికీకరణ పనుల పేరుతో రబీకి సాగునీరు ఆపేశారు. జలాశయం 6 క్రస్ట్‌ గేట్ల పనులు అసంపూర్తిగా చేశారు. నూతన గేట్లు అమర్చినా నీరు లీకేజీ అవుతూనే ఉంది.
‘‘ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 77 చెరువులకు హంద్రీనీవా కాల్వ నీటిని తరలించి ఈ ప్రాంతాలను సస్యశ్యామలం చేసాం..’’ గతేడాది సెప్టెంబరు 19న కృష్ణగిరి మండలం ఆలంకొండ పంప్‌హౌస్‌ వద్ద ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి  నీటి విడుదల బటన్‌ నొక్కారు. ఈ సందర్భంగా చెప్పిన మాటలు.. అవన్నీ ‘నీటి’ మూటలయ్యాయి. దాదాపు ఆరు నెలల పాటు హంద్రీనీవా కాల్వలో నీటి ప్రవాహం కొనసాగినా ఒక్క చెరువులోకి కూడా 20 శాతం నీరు చేరలదు. పనులు పూర్తికాకుండానే ఎన్నికల తంతులో భాగంగానే సీఎం నీటి బటన్‌ నొక్కారని రైతులు మండిపడుతున్నారు.

కర్నూలు జలమండలి, వ్యవసాయం, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, మంత్రాలయం గ్రామీణం, పత్తికొండ, ఆలూరు, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని