logo

పట్టణ వాసులపై.. జగన్‌ ‘పైసా’చికత్వం

నంద్యాల పురపాలిక: బైర్మల్‌ వీధిలో నివాసం ఉంటున్న శంకరయ్య ఇంటి విస్తీర్ణం సెంటున్నర లోపల ఉంది. ఆయనకు 2018లో రూ1018 బిల్లు రాగా 2022లో రూ1496 వచ్చింది. దాదాపు రూ.500 పన్ను పెరిగింది.

Updated : 10 Apr 2024 04:34 IST

 ఏటా 15 శాతం ఇంటి పన్ను పెంపు
 నాలుగేళ్లలో రూ.41.2 కోట్లు బాదేశారు 

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : నంద్యాల పురపాలిక: బైర్మల్‌ వీధిలో నివాసం ఉంటున్న శంకరయ్య ఇంటి విస్తీర్ణం సెంటున్నర లోపల ఉంది. ఆయనకు 2018లో రూ1018 బిల్లు రాగా 2022లో రూ1496 వచ్చింది. దాదాపు రూ.500 పన్ను పెరిగింది.

వార్షిక అద్దె విలువ (ఏఆర్‌వీ) ఆధారంగా అయిదేళ్లకోసారి ఆస్తి పన్ను పెంచే విధానం నగరాలు, పట్టణాలలో ఉండేది. జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే ఏఆర్‌వీకి బదులుగా ఆస్తి మూలధన విలువ (సీవీ) ఆధారంగా పన్ను పెంచే కొత్త విధానం తీసుకొచ్చింది. దీనికి మళ్లీ స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖతో లింకు పెట్టింది. ఆస్తుల విలువలను ఆ శాఖ పెంచినప్పుడల్లా ఆస్తి పన్ను కూడా పెంచాలని నిర్ణయించింది.  ఇలా 2021- 22, 2022- 23, 2023- 24, 2024- 25 ఆర్థిక సంవత్సరాల్లో కర్నూలు, నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆస్తి పన్ను 15 శాతం పెరుగుతూ వచ్చింది. ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది మున్సిపాల్టీల పరిధిలో 2020 ఆర్థిక సంవత్సరంలో పన్ను లక్ష్యం రూ.140.23 కోట్లు ఉండగా... 2023 ఆర్థిక సంవత్సరానికి రూ.181.23 కోట్లకు చేరింది.

 ఎక్కడ ఎంత భారం

కర్నూలు నగరం: నగర పాలక సంస్థలో 1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇంటికి ప్రస్తుతం రూ.6 వేల వరకు పన్ను వసూలు చేస్తున్నారు. అదే ఇంటికి నాలుగేళ్ల కిందట రూ.4,400 మాత్రమే తీసుకొనేవారు. ఏటా రూ.400 పెరుగుతూ ప్రస్తుతం రూ.6 వేలకు చేరుకుంది. సి.క్యాంప్‌, నరసింగరావుపేట, బి.క్యాంప్‌, డాక్టర్స్‌కాలనీ తదితర ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల ఇంటికి ప్రస్తుతం రూ.5,500 వరకు పన్ను ఉంది. నాలుగేళ్ల కిందట రూ.4 వేల లోపు ఉండేది.

నంద్యాల: జిల్లా కేంద్రం నంద్యాలలోని పద్మావతినగర్‌, శ్రీనివాసనగర్‌, ఎన్జీవో కాలనీ, బైపాస్‌ రహదారి, బైర్మల్‌వీధి తదితర ప్రాంతాల్లోని వాణిజ్య దుకాణాలకు యజమానులు ప్రస్తుతం రూ.10 వేల ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు. 2021లో ఆయా దుకాణాలకు ఆస్తి పన్ను రూ.8 వేలలోపు ఉండేది. 15 శాతం పెంపుతో రూ.2 వేలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.\

ఆదోని: తానాజీ రోడ్డు, హావన్నపేట, లంగరు పేట ప్రాంతాల్లో 800 చదరపు అడుగులున్న ఇంటికి ప్రస్తుతం పన్ను కింద రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. గతంలో ఇలాంటి ఇళ్లపై తక్కువ పన్నులు వేశామని చెబుతూ నాలుగేళ్లుగా ఏటా రూ.350 పెంచుకుంటూ వస్తున్నారు. వెంకన్నబావి ప్రాంతంలో కూడా సుమారు 400 ఇళ్లపై ఇదే విధంగా పన్నును పెంచుతున్నారు. ఈ మున్సిపాల్టీలో 20 వేలకు పైగా ఇళ్లను కొత్త పన్ను విధానంలోకి తీసుకొచ్చారు.

నాడు

నగరాలు, పట్టణాల్లో గత ప్రభుత్వాలు ఆస్తి పన్నును అయిదేళ్లకోసారి పెంచేవి. పేద, మధ్య తరగతి వర్గాలపై పెద్దగా భారం పడకుండా జాగ్రత్తలు తీసుకునేవి. ఒకవేళ భారం మరీ ఎక్కువగా ఉందని భావిస్తే... అయిదేళ్లకు బదులుగా 10-15 ఏళ్లకోసారి ఆస్తి పన్నులు సవరించేవి.

నేడు

రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక అంతా మారిపోయింది. ప్రజలపై భారం మోపడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్లింది.. పట్టణాల్లో ఐదేళ్లకోసారి ఆస్తిపన్ను పెంచే విధానాన్ని పక్కనపెట్టింది. గత మూడేళ్లుగా ప్రతి సంవత్సరం ఆస్తిపన్ను పెంచుతోంది. ఇది చాలదన్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆస్తుల విలువలను పెంచినప్పుడల్లా పన్ను మొత్తం మళ్లీ పెరుగుతోంది. దీన్ని ఒకేసారి వర్తింపజేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని... పెరిగిన దానికి సమానమయ్యే వరకు ఏటా 15 శాతం చొప్పున విధిస్తోంది. అంటే పన్ను పోటును నిరంతర ప్రక్రియగా మార్చేసింది.  

ఆదాయం ఏమి చేస్తున్నారో

గత నాలుగేళ్లుగా ప్రతి ఆస్తిపైన రాష్ట్ర ప్రభుత్వం 15 శాతం పెంచుకుంటూపోవడంతో రూ.కోట్లలో ఆదాయం సమకూరింది. కర్నూలు నగరంలో ప్రస్తుతం రాబడి రూ.90 కోట్లు ఉంది. నాలుగేళ్ల నుంచి ఈ కార్పొరేషన్‌ ఏటా రూ.12 కోట్ల వరకు ఆదాయం సమకూర్చుకుంటోంది. నంద్యాల మున్సిపాల్టీ ఏటా రూ.2 కోట్ల చొప్పున ఇప్పటి వరకు రూ.8 కోట్లు ఆదాయం ఆర్జించింది. ఆదోని రూ.5 కోట్లు, ఎమ్మిగనూరు రూ.3.50 కోట్లు, డోన్‌, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు మున్సిపాల్టీలు రూ.50 లక్షల చొప్పున ఆదాయం సమకూర్చుకున్నాయి.

కొత్త ఇంటికి మరింత  

  •  ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను విధించే కొత్త విధానంతో కొత్తగా ఇళ్లు నిర్మించుకుంటున్న వారంతా బెంబేలెత్తుతున్నారు. వారికి పాత పన్ను విధానం లేదు కాబట్టి... ఏటా 15 శాతం పెంపుదల వర్తించదు. రిజిస్ట్రేషన్ల శాఖ విలువ ప్రకారం నిర్ణయించిన పూర్తి పన్నును ప్రతి సంవత్సరం చెల్లించాల్సిందే. ఇళ్లు, భవనాల నిర్మాణ ప్రాంతం ఆధారంగా విధిస్తున్న ఆస్తి పన్ను రూ.వేలు, లక్షల్లో ఉండటంతో యజమానులు ఆందోళన చెందుతున్నారు.
  • అదేవిధంగా పాత ఇళ్లపై అదనపు అంతస్తు వేసుకున్నా, ఒక గది నిర్మించుకున్నా కొత్త విధానం ప్రకారమే ఆస్తిపన్నును మదింపు చేస్తున్నారు. అప్పటి నుంచి ఆ మొత్తం భవనానికి రిజిస్ట్రేషన్‌ విలువ ఆధారంగా నిర్ణయించిన పూర్తి పన్నునే వసూలు చేస్తున్నారు.

అద్దెల మోత 

ప్రభుత్వం ఆస్తి పన్ను పెంచడంతో ఇళ్ల యజమానులు అద్దెలను 10 నుంచి 20 శాతం వరకు పెంచేశారు. కర్నూలు నగరంలో రెండు పడక గదుల ఇంటి బాడుగ నాలుగేళ్ల కిందట రూ.4- 5 వేల మధ్య ఉంటే ప్రస్తుతం రూ.6-7 వేల వరకు ఉంది. నంద్యాలలో రెండు పడక గదుల ఇంటి అద్దెను రూ.6 వేలకు పెంచారు. ఆత్మకూరు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు వంటి చిన్న పట్టణాల్లో కూడా డబుల్‌ బెడ్‌రూం ఇంటి అద్దె రూ.4 వేలకుపైగా పెరిగింది. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, సంస్థల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిశ్రమలు తదితర అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న ఈ వర్గానికి ఏటా పెరుగుతున్న ఆస్తి పన్ను భారంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని