logo

పునరావాసం.. పచ్చి మోసం

పదిమంది బాగు కోసం, పారిశ్రామికాభివృద్ధి కోసం భూమిని, భుక్తిని త్యాగం చేసిన నిర్వాసితులకు ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం మొండిచెయ్యి చూపిస్తోంది.

Updated : 24 Apr 2024 05:02 IST

అయిదేళ్లుగా హామీలతోనే కాలయాపన

 పదిమంది బాగు కోసం, పారిశ్రామికాభివృద్ధి కోసం భూమిని, భుక్తిని త్యాగం చేసిన నిర్వాసితులకు ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం మొండిచెయ్యి చూపిస్తోంది. నిలువ నీడ లేకుండా పోయినవారిని నిలువునా ముంచేస్తోంది. ఉన్న ఊరిని పోగొట్టుకొని, ఉపాధిని కోల్పోయి.. నిస్సహాయలుగా మిగిలిన నిర్వాసితుల గోడు గాలికొదిలేసింది. నేనున్నానంటూ సీఎం జగన్‌ చెప్పిన మాటలు వీరి విషయంలో ఉత్తుత్తి వాగ్దానాలుగా మిగిలిపోయాయి.

అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో 26 గ్రామాల పరిధిలోని భూములను సేకరించి ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) ఏర్పాటు చేశారు. నిర్వాసితులకు ఇంటి స్థలాలు, ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారం పూర్తిస్థాయిలో అందలేదు. ఇంకా 700 మందికి, వారి పిల్లలకు పరిహారం, ఇంటి స్థలాలు కేటాయించలేదు. నిర్వాసితుల పునరావాసం కోసం దిబ్బపాలెంలో సెజ్‌ కాలనీ ఏర్పాటు చేశారు. ఈ కాలనీలో వసతుల మెరుగుపై ప్రభుత్వం కనీసం దృష్టి పెట్టలేదు. సరైన మురుగునీటి వ్యవస్థ, తాగునీటి సదుపాయం లేదు. ఆర్భాటంగా రూ. 1.10 కోట్లతో తాగునీటి పథకాన్ని నిర్మించిన ప్రస్తుత ఎలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తిరాజు కనీసం నెలరోజుల వరకైనా గోదావరి జలాలను కాలనీకి సరఫరా చేయలేక చతికిలపడ్డారు.

10 శాతమైనా న్యాయం చేయలేదు  

నక్కపల్లి, న్యూస్‌టుడే: నక్కపల్లి మండలంలో విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ నిమిత్తం తీరప్రాంతాన్ని ఆనుకుని ప్రభుత్వ, జిరాయితీ, డీఫాô భూములు కలిపి సుమారు 4300 ఎకరాలు సేకరించారు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో సుమారు 90 శాతం రైతులకు పరిహారం చెల్లించారు. అంతేకాకుండా స్టార్టప్‌ ఏరియా కోసం 1150 ఎకరాలు సిద్ధం చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తరవాత మిగిలిన సమస్యలు పరిష్కరించి, పరిశ్రమల ఏర్పాటుపై దృష్టిపెడుతుందని భావించినా, ఒరిగిందేమీ లేదు. దీనికి తోడు నిర్వాసితులు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టినా, పెద్దగా ఫలితం లేకపోయింది. ముఖ్యంగా భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి ప్యాకేజీ, పునరావాసం కల్పించాలని బాధితులంతా డిమాండు చేస్తుంటే, కేవలం ఇళ్లు కోల్పోయిన వారికి మాత్రమే పునరావాసం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

మాట తప్పనన్నారు.. నాలుక మడత పెట్టేశారు..
నేనున్నానన్నారు.. నట్టేట్లో ముంచారు..
ఆదుకుంటామన్నారు.. ఆపదలోకి తోసేశారు..
పరిహారమిస్తామన్నారు.. పరిహాసం చేశారు..

తెదేపా హయాంలో అలా.. జగన్‌    పాలనలో డీలా ... గతంలోని చంద్రబాబు ప్రభుత్వం నిర్వాసితులకు ప్యాకేజీ అందించే తేదీని 2004 నుంచి 2010కి మార్చి వారికి మర్చిపోలేని మేలు చేసింది. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కాదన్న వితంతు మహిళలకు సైతం పరిహారం, ఇంటిస్థలం అందించాలని నిర్ణయం తీసుకొని అమలు చేసింది. మేజర్‌ మగపిల్లలు, మేజర్‌ ఆడపిల్లలకు సమానంగా  5 సెంట్లు ఇంటిస్థలం, రూ. 1.75 లక్షల పరిహారం అందించి వందలాది కుటుంబాల్లో  ఆనందాన్ని నింపింది. దిబ్బపాలెం సెజ్‌   కాలనీలో తారురోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందాన తయారైంది.

పరిష్కారం కాని సమస్యలెన్నో... పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉపాధి కల్పిస్తామంటూ చట్టం చేసిన జగన్‌ ప్రభుత్వం అచ్యుతాపురం సెజ్‌లో మాత్రం అమలు చేయలేదు. సెజ్‌ కారణంగా కాలుష్య కోరల్లో చిక్కుకున్న దుప్పితూరు  గ్రామం తరలింపును ఈ ఐదేళ్లుగా ప్రభుత్వం నానుస్తూనే ఉంది. తమ గోడు పట్టించుకోవాలంటూ స్థానికులు దీనిపై మంత్రులు, అఖిలభారత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. సెజ్‌ ఏర్పాటుతో తీవ్ర ప్రభావానికి గురైన పూడిమడక గ్రామస్థులు, మత్స్యకార యువతకు ఉపాధి దక్కలేదు. నిర్వాసితులకు కనీసం బస్సు సౌకర్యం లేకుండా పోయింది.

పరిహారం, ప్యాకేజీ చెల్లించాలంటూ నిర్వాసితుల ఆందోళన (పాత చిత్రం)

కార్యాలయాన్నీ తరలించేశారు... నిర్వాసితుల సమస్యలు పరిష్కారం మాటెలా ఉన్నా ఆర్‌అండ్‌ఆర్‌ ప్రత్యేక ఉప కలెక్టర్‌ కార్యాలయం చుట్టూ తిరగడానికి అన్నదాతల కాళ్లరుగుతున్నాయి. అర్హులైన వారికి ఇంటిస్థలాలు, పట్టాలు అందివ్వడానికి వీలుగా గతంలో ఏపీఐఐసీ వన్‌స్టాప్‌ కార్యాలయంలో ఈ కార్యాలయం నడిచేది. వైకాపా ప్రభుత్వం ఈ కార్యాలయాన్ని విశాఖపట్నం తరలించేసింది. రెండు మండలాల పరిధిలో 9297 ఎకరాల సెజ్‌ స్థలానికి సంబంధించిన వేలాది మంది నిర్వాసితులు జిల్లాలో ఉన్న ఎస్‌డీసీ కార్యాలయానికి వరుస కడుతున్నారు.

-ఈనాడు, అనకాపల్లి,
       న్యూస్‌టుడే,  
    అచ్యుతాపురం
రెండు మండలాల్లో 26 గ్రామాల నిర్వాసితులకు
ఏర్పాటు చేసిన దిబ్బపాలెం సెజ్‌ కాలనీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని