logo

విద్యార్థుల ఆధార్‌ నవీకరణ

ఏ విద్యార్థి.. ఏ పాఠశాలలో చదువుతున్నారో తెలుసుకునేందుకు ఆధార్‌ నమోదు కార్యక్రమాన్ని విద్యాశాఖ అధికారులు చేపట్టారు.

Updated : 07 Dec 2022 06:25 IST

న్యూస్‌టుడే, భూపాలపల్లి

మొగుళ్లపల్లిలో విద్యార్థికి ఆధార్‌ నవీకరణ చేపడుతున్న ఎమ్మార్సీ సిబ్బంది

ఏ విద్యార్థి.. ఏ పాఠశాలలో చదువుతున్నారో తెలుసుకునేందుకు ఆధార్‌ నమోదు కార్యక్రమాన్ని విద్యాశాఖ అధికారులు చేపట్టారు. ఒక్క క్లిక్‌తో విద్యార్థుల పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రభుత్వం చైల్డ్‌ ఇన్ఫో నిర్వహిస్తోంది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన ప్రతి విద్యార్థి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. చాలా మంది ఆధార్‌ వివరాలు సరిగ్గా లేవని.. నవీకరణ చేసుకోవాలని కేంద్రం సూచించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి నిధులు దుబారా కాకుండా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఆధార్‌ నమోదు నవీకరణ చేపడుతున్నారు. జిల్లాలో 11 మండలాలు ఉండగా.. నాలుగేళ్ల క్రితం 9 ఎమ్మార్సీ కార్యాలయాల్లో శాశ్వత ఆధార్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటైన టేకుమట్ల, పలిమెల ఎమ్మార్సీలో శాశ్వత ఆధార్‌ కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం విద్యాశాఖ అదేశాల మేరకు.. నేరుగా పాఠశాలల్లోనే ఈ ప్రక్రియ కొనసాగుతోంది. కొత్త ఆధార్‌ నమోదుతో పాటు పిల్లలందరికీ ఆధార్‌ నవీకరణ చేస్తున్నారు. జాతీయ ఉపకార వేతనాలకు బ్యాంకు ఖాతా అవసరం కావడంతో దాని కోసం ఆధార్‌ వివరాలు అత్యంత ప్రామాణికం కావడంతో ముందుగా అన్ని కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలల్లోనే తొలుత ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల సంఖ్య అధారంగా ప్రభుత్వ బడ్జెటు కేటాయింపులు, ఉపాధ్యాయుల నియామకం, మధ్యాహ్న భోజనం, ఏకరూప దుస్తులు వంటివి అందుతాయి. జిల్లాలో 5,323 మంది చిన్నారులకు ఆధార్‌ కార్డులు లేనట్లు తెలుస్తోంది. వీరందరి వివరాలు చైల్డ్‌ ఇన్ఫోలో నమోదు కాలేదు. ఈ విషయమై డీఈవో రాజేందర్‌ మాట్లాడుతూ. ఆధార్‌ నమోదు ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని. ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా ఆధార్‌ కార్డు ఉండాలని అన్ని పాఠశాలల హెచ్‌ఎంలకు, ఎంఈవోలను ఇప్పటికే ఆదేశించాం. వీలైనంత తొందరలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

మొత్తం పాఠశాలలు: 543
విద్యార్థుల సంఖ్య: 44,695
ఆధార్‌ ఉన్న వారు: 39,372
ఆధార్‌ లేని వారు: 5,323

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు