Hezbollah: వీళ్ల దగ్గర లక్షకు పైగా రాకెట్లున్నాయి.. ఇజ్రాయెల్‌కు ‘హిజ్బుల్లా’ సవాల్‌!

ఇజ్రాయెల్‌కు హమాస్ కన్నా మరో పెద్ద సవాల్ ‘హిజ్బుల్లా’ రూపంలో పొంచివుంది. హిజ్బుల్లా వద్ద ప్రస్తుతం లక్షకు పైగా రాకెట్లు ఉన్నాయని ఇజ్రాయెల్‌ నిఘావర్గాల అంచనా.

Updated : 14 Oct 2023 15:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: హమాస్‌ (Hamas) ఆకస్మిక దాడులతో ఇజ్రాయెల్‌ (Israel) కాసేపు అయోమయానికి గురైనా.. అనంతరం తేరుకొని తన తిరుగుదాడులతో గాజాపై యుద్ధాన్ని ప్రకటించింది. అయితే.. ఇజ్రాయెల్‌కు హమాస్ కన్నా మరో పెద్ద సవాల్ ‘హిజ్బుల్లా (Hezbollah)’ రూపంలో పొంచివుంది. ఇజ్రాయెల్‌కు ఉత్తరాన ఉన్న లెబనాన్‌లో షియా వర్గానికి చెందిన ఈ సంస్థ ఇరాన్‌ (Iran) అండదండలతో బలీయమైన శక్తిగా ఎదిగింది.

హమాస్‌తో పోలిస్తే ఎక్కువే..!

హిజ్బుల్లా వద్ద ప్రస్తుతం లక్షకు పైగా రాకెట్లు ఉన్నాయని ఇజ్రాయెల్‌ నిఘావర్గాల అంచనా. ఆర్థికంగా, ఆయుధపరంగానూ ఈ సంస్థకు ఇరాన్‌ సాయం చేస్తోంది. ఈ సంస్థ లక్ష్యం సైతం ఇజ్రాయెల్‌ను తొలగించి పాలస్తీనా స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేయడమే కావడంతో.. హమాస్ ఉగ్రదాడి అనంతరం కొన్ని రాకెట్లను ఇజ్రాయెల్‌ భూభాగంపై ప్రయోగించింది. దీనికి స్పందనగా ఇజ్రాయెల్ వీరి స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. 1980ల్లో లెబనాన్‌లో ఏర్పడిన ఈ సంస్థ రాజకీయంగానూ, మిలటరీపరంగానూ బలోపేతంగా ఉంది. ఈ సంస్థ దగ్గర ఇప్పటికే లక్షకుపైగా రాకెట్లు ఉన్నట్టు సమాచారం. వీటితోపాటు స్వల్పలక్ష్యాలను ఛేదించే క్షిపణులు సైతం ఉన్నట్టు తెలుస్తోంది. హమాస్‌ మిలిటెంట్లతో పోలిస్తే వీరి సంఖ్య అధికంగా ఉంది. దాదాపు లక్షకుపై క్రియాశీల బలగాలు ఉన్నట్టు పాశ్చాత్య నిఘావర్గాలు పేర్కొన్నాయి.

సౌదీ కీలక నిర్ణయం.. ఇజ్రాయెల్‌తో ఒప్పందానికి బ్రేక్‌!

1985, 2000, 2006ల్లో ఇజ్రాయెల్‌ దళాలు, హిజ్బుల్లా మధ్య ఘర్షణలు జరిగాయి. సిరియా అంతర్యుద్ధంలో రష్యా, ఇరాన్‌ దళాలతో పాటు వీరి ప్రవేశంతో సిరియా పాలకులు ఆ దేశ తిరుగుబాట్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. 2006లో ఇజ్రాయెల్‌, హిజ్బుల్లా మధ్య దాదాపు 34 రోజుల పాటు యుద్ధం జరిగింది. అనంతరం ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదరడంతో ఇజ్రాయెల్‌ దళాలు వెనక్కు మళ్లాయి. అయితే ఈ యుద్ధం తరువాత హిజ్బుల్లా ఆయుధ పాటవం గణనీయంగా పెరగడం గమనార్హం.

యుద్ధం వస్తే పరిణామాలు ఎలా ఉంటాయి?

హమాస్‌, హిజ్బుల్లా తదితర సంస్థలు ఆయా దేశ ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహించవు. అయితే గెరిల్లా యుద్ధంలో ఆరితేరాయి. యుద్ధరంగంలో ఎదురుగా నిలబడిన శత్రువుతో ముఖాముఖి పోరాటం ఫలితాన్ని నిర్ణయిస్తుంది. అయితే గెరిల్లా యుద్ధంలో ఇలా ఉండదు. సాధ్యమైనంత తక్కువ ప్రాణనష్టంతో వైరిపక్షానికి తీవ్రనష్టం కలిగిస్తాయి. ఇజ్రాయెల్‌ దళాలు సుశిక్షితమైనవి అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ గెరిల్లా యుద్ధంలో సందర్భానుసారంగా వ్యూహాలను అమలు చేయాల్సి ఉంటుంది. గతంలో హమాస్‌, హిజ్బుల్లా ఉగ్రసంస్థలపై ఇజ్రాయెల్‌ దాడులు చేసినా పూర్తిగా నిర్మూలించలేకపోయింది. మరి రానున్న కాలంలో హిజ్బుల్లాతో తలపడితే ఎలాంటి వ్యూహాలను ఇజ్రాయెల్‌ సైన్యం ఎలా అమలుచేస్తుందన్న అంశం ఆసక్తికరమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని