ఆ ఎడారి దేశాల్లో ఉప్పునీరే మంచినీరవుతోంది..!

భూమిపై 71శాతం నీరు.. 29శాతం భూభాగం ఉందని అందరికీ తెలిసిందే. భూమిపై ఉన్న నీటిలో 97శాతం సముద్ర జలం కాగా.. మిగతా మూడు శాతం భూగర్భ జలాలే జీవరాశి దాహార్తి తీరుస్తున్నాయి. ...

Updated : 17 Oct 2022 14:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భూమిపై 71శాతం నీరు.. 29శాతం భూభాగం ఉందని అందరికీ తెలిసిందే. భూమిపై ఉన్న నీటిలో 97శాతం సముద్ర జలం కాగా.. మిగతా మూడు శాతం భూగర్భ జలాలే జీవరాశి దాహార్తి తీరుస్తున్నాయి. భూగర్భజలాలు ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుతం మంచినీటి సమస్యలు పెద్దగా లేవు. కానీ, పర్యావరణంలో మార్పులు, నీటి అతి వినియోగం కారణంగా నీటి వనరులు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నీటిని పొదుపు చేయకపోతే రానున్న కాలంలో ప్రపంచమంతా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. దీంతో వివిధ దేశాల్లో సముద్ర జలాలను మంచినీటిగా మార్చే ప్రయోగాలు జరుగుతున్నాయి. కానీ, పెద్దగా విజయవంతం కావట్లేదు. 

అయితే, కొన్ని శతాబ్దాలుగా తగినంత తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ), సౌదీ అరేబియా, ఇజ్రాయిల్‌ వంటి ఎడారి దేశాలు సముద్ర జలాల్ని మంచినీటిగా మార్చి నీటి సమస్యను అధిగమిస్తున్నాయి. క్లౌడ్‌ సీడింగ్‌తో కృత్రిమ వర్షం కురిపిస్తూ నీటి బొట్టు వృథా కాకుండా సేకరించి డ్యామ్‌లో నిల్వ ఉంచుతున్నాయి. సాంకేతికతను వాడుతూ నీటి వనరులను సంరక్షిస్తున్న తీరు ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది.

డిసాలినేషన్‌..

సముద్రజలాల్లో ఉప్పు అధికంగా ఉంటుంది. ఒకవేళ ఈ నీటిని తాగితే శరీరంలోకి ఎక్కువ శాతం ఉప్పు చేరుతుంది. దీని వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరిగి వాటి పనితీరు మందగిస్తుంది. శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించొచ్చు. అందుకే సముద్ర జలాలను ఎవరూ తాగరు. అయితే, సముద్ర తీరాలున్న సౌదీ అరేబియా, యూఏఈ, ఇజ్రాయిల్‌ వంటి కొన్ని దేశాలు డిసాలినేషన్‌ ద్వారా సముద్ర జలాల్ని మంచినీటిగా మారుస్తున్నాయి. ఇందుకోసం అనేక చోట్ల డిసాలినేషన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నాయి. సముద్ర జలాల్లో ఉండే ఉప్పును వేరు చేసి తాగడానికి, గృహ అవసరాలకు తగ్గట్టుగా నీటిని మార్చుతున్నాయి. ప్లాంట్లలో ఏర్పాటు చేసిన ఫిల్టర్లలోకి సముద్ర నీటిని పంపిస్తారు. వాటిలోని పొరలు నీటిలోని ఉప్పును వేరు చేసి మంచినీటిని బయటకు పంపుతాయి. అలా ప్రతి రోజు కొన్ని బిలియన్ల లీటర్ల మంచినీటిని ఉత్పత్తి చేస్తున్నారు. కువైట్‌లో మంచినీటిగా మార్చిన సముద్ర జలాలను వందశాతం వినియోగిస్తున్నారు. అయితే, ఈ డీసాలినేషన్‌ ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నది. నీటిని ఫిల్టర్‌ చేయడానికి భారీగా విద్యుత్‌ వినియోగించాల్సి ఉంటుంది. ఫిల్టర్లనూ తరచూ మార్చాల్సిందే. ఇలా విద్యుత్‌ వినియోగం, ఫిల్టర్ల కొనుగోలుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.

సౌదీ అరేబియాలోని రస్‌ అల్‌ ఖైర్‌, షుయిబా, రబిగ్‌ 3 ఐడబ్ల్యూపీ.. యూఏఈలోని తవీలా, ఫుజైరా.. ఇజ్రాయిల్‌లోని సోరేక్‌లో ఉన్న డిసాలినేషన్‌ ప్లాంట్లు అతి పెద్దవి. ప్రపంచవ్యాప్తంగా 16వేల డిసాలినేషన్‌ ప్లాంట్లు ఉన్నాయి. ప్రపంచ జనాభాలో ఒక శాతం మంది ఈ డీసాలినేషన్‌ ద్వారా వస్తున్న నీటిపై ఆధారపడుతున్నారు. యూఏఈ, సౌదీ, కువైట్‌ దేశాలు ధనిక దేశాలు కాబట్టి ఆటుపోట్లు ఉన్నా.. ప్రక్రియ విఫలమైనా ప్రయత్నాలు చేస్తూ.. మంచినీటిని ఉత్పత్తి చేయగలుతున్నాయి. సింగపూర్‌ ప్రభుత్వం డిసాలినేషన్‌ కోసం భారీగా బడ్జెట్‌ కేటాయిస్తోందట. కానీ, చాలా దేశాలు సరైన ప్రణాళిక అమలు చేయలేక, బడ్జెట్‌ కేటాయించలేక డిసాలినేషన్‌ను సమర్థంగా నిర్వహించలేకపోతున్నాయి. 

క్లౌడ్‌ సీడింగ్‌(మేఘ మథనం)

వాతావరణంలో మార్పులు తీసుకొచ్చి కృత్రిమంగా వర్షాలు కురిపించడాన్నే క్లౌడ్‌ సీడింగ్‌(మేఘమథనం) అంటారు. సిల్వర్‌ అయోడైడ్‌, పోటాషియం అయోడైడ్‌ వంటి లవణాల్ని విమానంలో తీసుకెళ్లి మేఘాలపై జల్లుతారు. దీంతో మబ్బులు కరిగి వర్షం కురుస్తుంది. అయితే, ఈ క్లౌడ్‌ సీడింగ్‌ ఫలితాలపై విభిన్న వాదనలు ఉన్నాయి. ఈ విధానం పెద్దగా ఫలితమివ్వదని, వీటి వల్ల పర్యావరణానికి హాని పొంచి ఉందని కొందరు పరిశోధకులు వాదిస్తున్నారు. అయినా ప్రపంచంలో చాలా దేశాలు వర్షపాతం పెంపునకు క్లౌడ్‌ సీడింగ్‌ పద్ధతిని ఉపయోగిస్తున్నాయి. 

1891లో లూయిస్‌ గతమన్‌ అనే జర్మన్‌-అమెరికన్‌ ఇంజినీర్‌ మబ్బులపైకి కార్బన్‌డైఆక్సైడ్‌ను తుపాకీ ద్వారా షూట్‌ చేసి వర్షం కురిపించే ప్రయత్నం చేశారు. ఈ విధానంపై ఆయన పెటెంట్‌ హక్కులు కూడా పొందారు. 1930దశకంలోనూ మేఘాలపై మంచు ముక్కల్ని విసిరేసి వర్షం పడేట్టు చేశారు. 1946లో తొలిసారి క్లౌడ్‌ సీడింగ్‌ ప్రయోగం జరిగింది. ఆ తర్వాత అనేక దేశాల్లో వివిధ పద్ధతుల్లో క్లౌడ్‌ సీడింగ్‌ చేశారు. భారత్‌లోనూ తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు క్లౌడ్‌ సీడింగ్‌ చేశాయి. 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 12 జిల్లాల్లో మేఘమథనం పేరిట క్లౌడ్‌ సీడింగ్‌కు ప్రయత్నించారు.

డ్యామ్స్‌

ఏడారి దేశాల్లో వర్షపాతం చాలా తక్కువ. అరుదుగా వర్షం కురుస్తుంటుంది. అందుకే క్లౌడ్‌ సీడింగ్‌తో కృత్రిమ వర్షాలు కురిపిస్తారు. ఇలా వర్షం పడిన సమయంలో భూమికి చేరిన ప్రతి వర్షపు బొట్టును ఆయా దేశాలు ఒడిసిపడుతున్నాయి. ఇందుకోసం పెద్ద పెద్ద డ్యామ్‌లు నిర్మిస్తున్నాయి. వర్షపునీరు సముద్రంలో కలవకుండా ఈ డ్యామ్‌ల్లోకి మళ్లించి నిల్వ ఉంచి.. అక్కడి ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ డ్యామ్‌ల నిర్మాణం భారీగా పెరిగింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని