డబ్బులు ఊరికే రావు.. ఇలా ఆదా చేయండి!
మనిషి జీవితం డబ్బుతో ముడిపడి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. కుటుంబ పోషణ, పిల్లల చదువులు, పండగలు ఇలా అన్నింటి నిర్వహణకు డబ్బు కావాల్సిందే. అందుకే భవిష్యత్తు బాగుంటడం కోసం రేయిబవళ్లూ కష్టపడుతుంటారు. అదే విధంగా చాలా మంది ఆదాయం ఉంది
ఇంటర్నెట్ డెస్క్: మనిషి జీవితం డబ్బుతో ముడిపడి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. కుటుంబ పోషణ, పిల్లల చదువులు, పండగలు ఇలా అన్నింటి నిర్వహణకు డబ్బు కావాల్సిందే. అందుకే భవిష్యత్తు బాగుంటడం కోసం రేయింబవళ్లూ కష్టపడుతుంటారు. అదే విధంగా చాలా మంది ఆదాయం ఉంది కదా అని.. ఖర్చులకు వెనకడుగు వేయరు. కరోనాకు ముందు వీకెండ్ షాపింగ్‌లు, పార్టీలు అంటూ చాలా ఖర్చులు చేశారు. కానీ, కరోనా సంక్షోభంలో ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. ఆదాయం తగ్గి.. దాచుకున్న డబ్బులు ఖర్చయిపోయాయి. దీంతో ఇకపై ఆర్థిక క్రమశిక్షణతో.. డబ్బులు పొదుపు చేయాలన్న ఆలోచనతో సామాన్య ప్రజలు ఉంటున్నారు. అయితే, నెలవారీ ఖర్చులు ఎలాగూ తప్పవు.. అయితే, వాటిలో అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే డబ్బులు పొదుపు చేసే అవకాశముంది. ఇందుకోసం మీరు ఏం చేయాలంటే..
ఖర్చులకో జాబితా
ఆర్థిక ప్రణాళిక లేకపోతే.. ఆదాయం, ఖర్చులపై పట్టు ఉండదు. డబ్బు ఎలా ఖర్చవుతుందో తెలియదు. అందుకే నెలవారీ ఖర్చులతో జాబితా రాసుకోండి. పాల బిల్లు దగ్గర నుంచి క్రెడిట్ కార్డు బిల్లు వరకు అన్నింటిని ఒక్కచోట రాసి.. మీ ఆదాయం ఎంత? ఖర్చు ఎంత? బేరీజు వేసుకోండి. ఆదాయం-ఖర్చు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బట్టి ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
మొబైల్ రీఛార్జ్
ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ మొబైల్‌ఫోన్స్ తప్పనిసరిగా ఉంటాయి. విడివిడిగా రీఛార్జ్ చేసినప్పుడు తక్కువ మొత్తంగానే కనిపించినా.. ఇంట్లో వాళ్లందరి మొబైళ్ల రిఛార్జ్‌లు కలిపి చూస్తే ఖర్చు రూ.వెయ్యి నుంచి రూ.రెండు వేలవరకు అవుతోంది. ఏవేవో ఆఫర్స్ చూపి ఎక్కువ డబ్బులతో రీఛార్జ్ చేసుకునేలా నెట్‌వర్క్ సంస్థలు ప్రయత్నిస్తుంటాయి. ఇక్కడే, కాస్త ఆలోచించి సరైన ఆఫర్లు ఎంచుకోవాలి. ఈ మధ్య ప్రతి ఒక్కరి ఇంట్లో, ఆఫీసుల్లో ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కువ డేటా ఉన్న రీఛార్జ్ ఆఫర్లు వేసుకోవడం అనవసరమే కదా..! కాబట్టి తక్కువ ధరతో కాల్స్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉండే ఆఫర్లను ఎంచుకుంటే సరిపోతుంది.
కేబుల్.. ఇంటర్నెట్ బిల్లు
ప్రస్తుతం ఇంటర్నెట్‌తో నడిచే స్మార్ట్ టీవీలు అందుబాటులోకి వచ్చాయి. ఓటీటీలో కంటెంట్ ఆకట్టుకునే విధంగా ఉండటం.. కేబుల్ టీవీలో వచ్చే అనేక ఛానళ్లు ఇందులోనే వస్తుండటంతో ఓటీటీలను చూసేవారి సంఖ్య పెరిగింది. పగలంతా బయటే ఉండి.. సాయంత్రం కాలక్షేపానికి రెండు మూడు గంటలు చూసే టీవీ కోసం నెలనెలా కనీసం రూ.300 కేబుల్ బిల్లు కట్టాల్సి రావడం అనవసరమైన ఖర్చే. అలాగే, ఇంటర్నెట్ విషయంలోనూ ఇంటి అవసరాలకు తగ్గట్టుగా తక్కువ ధర ఉన్న ప్యాకేజీలను ఎంపిక చేసుకోండి.
విద్యుత్ వినియోగం
ఇంట్లో అడుగుపెట్టడంతోనే అవసరం లేకపోయినా లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు ఆన్ చేస్తుంటారు. బయటకు వెళ్లే సమయంలోనూ వాటిని ఆఫ్ చేయకుండా వెళ్లిపోతుంటారు. అనవసరమైన విద్యుత్ వినియోగంతో బిల్లు ఎక్కువైపోతుంది. విద్యుత్ వినియోగంలో పరిమిత యూనిట్లకు మించితే విద్యుత్ ఛార్జీ భారీగా ఉంటుంది. విద్యుత్ బిల్లుల మోత తగ్గి, డబ్బు ఆదా కావాలంటే ఎలక్ట్రానిక్ వస్తువులను అవసరమైనప్పుడు మాత్రమే వాడాలి.
డిస్కౌంట్లు.. క్యాష్‌బ్యాక్
పోటీ ప్రపంచంలో మనుషులే కాదు.. కంపెనీ, దుకాణాలు సైతం కష్టపడుతున్నాయి. కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం భారీగా డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. వీటిని ఎంత తెలివిగా ఉపయోగించుకుంటే.. అంత డబ్బు ఆదా అవుతుంది. ఆఫర్లు ఇస్తున్నారని అనసవరమైన ఖర్చులు చేయకుండా.. మితంగా కావాల్సిన వస్తువులను ఆఫర్ల కింద కొనుగోలు చేయడం ద్వారా వస్తువు సొంతమవుతుంది.. డబ్బులు ఆదా అవుతాయి.
పాత వస్తువులకు నగదు రూపం
అవసరం పడి ఏవేవో వస్తువుల్ని కొనుగోలు చేస్తాం. ఆ తర్వాత పక్కన పెట్టేస్తాం. అలా ఇంట్లో కచ్చితంగా కొన్ని వస్తువులు నిరూపయోగకరంగా మూలకు పడి ఉంటాయి. అలాంటి వాటిని అమ్మేసి నగదుగా మార్చుకోవచ్చు. దుస్తుల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అవసరం తీరిన లేదా మీకు నిరూపయోగం అనిపించిన వాటిని అమ్మేయండి. వాటి అవసరం ఉండి.. కొత్తవి కొనలేని వాళ్లు మీరు అమ్మే వాటిని కొనుగోలు చేస్తారు. ఇప్పటికే సెకెండ్ హ్యాండ్ వస్తువుల క్రయవిక్రయాల కోసం ఓఎల్‌ఎక్స్ వంటి అనేక ఆన్‌లైన్ పోర్టళ్లు అందుబాటులో ఉన్నాయి.
రుణ వడ్డీ తక్కువుండేలా
ఒకవేళ మీరు వ్యక్తిగత, ఇంటి రుణాలు తీసుకుంటే.. వివిధ బ్యాంకుల్లో రుణాల వడ్డీపై ఆరా తీయండి. ఏ బ్యాంకులో రుణ వడ్డీ తక్కువగా ఉంటే అక్కడే రుణం తీసుకోండి.
స్మార్ట్‌గా చేయండి ప్రయాణం
ఆఫీసులకు, ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రజారవాణాకు ప్రాధాన్యం ఇవ్వండి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో వ్యక్తిగత ప్రయాణాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ, పరిస్థితులు చక్కబడ్డాక ప్రజావాహనాల్లో వెళ్లండి. కారులో ఒక్కరు వెళ్లినా, నలుగురు వెళ్లినా పెట్రోల్, డీజీల్ ఖర్చు ఒకేలా ఉంటుంది. కాబట్టి.. స్నేహితులు, ఇరుగుపొరుగువారితో మాట్లాడుకొని ఒక్కో రోజు ఒక్కొకరి వాహనంలో నలుగురు కలిసి వేళ్లేలా ప్రణాళికలు వేసుకుంటే.. అందరికి డబ్బు ఆదా అవుతుంది. ఈ మధ్య కాలంలో ఈ విధమైన ‘కార్ పూలింగ్’ బాగా పాపులరైంది.
అప్పులు తీర్చేస్తే ఎంతో హాయి..
కొంత మంది డబ్బులు ఉన్నా.. రుణం తీర్చుకుండా నెలవారీ ఈఎంఐలు చెల్లిస్తుంటారు. దీని వల్ల రుణగ్రహీతకు నష్టమే ఎక్కువ ఉంటుంది. తక్కువ వడ్డీతో ఒకేసారి రుణం చెల్లించే అవకాశాన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే వడ్డీ భారం తప్పుతుంది. ఆ తర్వాత ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం ఉండదు కాబట్టి.. ఆ డబ్బును ఇతర ఆదాయం కోసం పెట్టుబడి పెట్టే ఆలోచనలు చేయొచ్చు.
సరదాలకు పరిమితి
వారాంతాల్లో కుటుంబమంతా కలిసి రెస్టారెంట్లలో తినడం, సినిమా చూడటం, విహారయాత్రలకు వెళ్లడం వంటివి చేస్తుంటారు. అయితే, వీటికయ్యే ఖర్చుపై కుటుంబ యజమానికి పూర్తి నియంత్రణ ఉండాలి. ఆహార పదార్థాలను ఆర్డర్ చేయడం నుంచి పర్యటక ప్రాంతాల్లో గదుల బుకింగ్ వరకు తక్కువ ధరలో నాణ్యత ఉండేలా చూసుకోవాలి. వీలైతే వారంతాన్ని ఇంట్లోనే కుటుంబసభ్యులతో గడిపేందుకు ప్రయత్నించండి.
షాపింగ్‌కు ఒక్కరే
కుటుంబమంతా షాపింగ్‌కి వెళ్తే ఇక అంతే.. పిల్లలు చిరుతిండ్లు, బొమ్మలు కావాలంటూ మారం చేస్తుంటారు. కుటుంబసభ్యులు వారికి నచ్చిన వస్తువులను కొనమని అడుగుతుంటారు. వాళ్లు అడిగినవన్నీ కొనుగోలు చేస్తే బిల్లు తడిసిమోపడవుతుంది. కాబట్టి, ఒక్కరే ఇంట్లోకి అవసరమైన వస్తువుల్ని మాత్రమే కొనుగోలు చేసి ఖర్చులు తగ్గించుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
AP High Court: అంగళ్లు కేసుల్లో 79 మంది తెదేపా నేతలకు బెయిల్
-
EMS Ltd Listing: 34% లాభంతో ‘ఈఎంఎస్’ షేర్ల లిస్టింగ్.. ఒక్కో లాట్‌పై రూ.4,900 లాభం
-
TSRTC: దసరాకు ఊరెళ్తున్నారా? శుభవార్త ఇదిగో!
-
Visa: కెనడా పౌరులకు వీసా సర్వీసులను నిలిపివేసిన కేంద్రం..!
-
Rahul Gandhi : రైల్వే కూలీగా రాహుల్ గాంధీ..!