భారత్‌లో కరోనా ‘థర్డ్‌ వేవ్‌’ అనివార్యమే..!

భారత్‌లో కరోనా థర్డ్‌ వేవ్‌ అనివార్యమని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

Published : 05 May 2021 18:48 IST

కానీ.. అదెప్పుడో చెప్పలేమన్న కేంద్ర ఆరోగ్యశాఖ

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి సెకండ్‌ వేవ్‌ ధాటికి భారత్‌ వణికిపోతున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో కరోనా థర్డ్‌ వేవ్‌ అనివార్యమని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో మరిన్ని వేవ్‌లు కూడా వస్తాయని పేర్కొంది. వీటిని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండడంతోపాటు కరోనా వైరస్‌ కొత్తరకాలను ఎదుర్కొనే సామర్థ్యమున్న అప్‌డేటెడ్‌ వ్యాక్సిన్‌లు ఎంతో అవసరమని సూచించింది.

‘ప్రస్తుతం వైరస్‌ సంక్రమణ స్థాయిలను బట్టి చూస్తే ఫేజ్‌ 3 (థర్డ్‌ వేవ్) అనివార్యం. అయితే, ఈ థర్డ్‌ వేవ్‌ ఎప్పుడు సంభవిస్తుందనే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేం. మరిన్ని వేవ్‌లను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలి. అంతేకాకుండా వైరస్‌లో ఏర్పడే మార్పులను ముందుగానే అంచనా వేసి.. వాటికి అనుగుణంగా వ్యాక్సిన్‌లను ఎప్పటికప్పడు అప్‌డేట్‌ చేసుకోవడం ఎంతో అవసరం’ అని కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు డాక్టర్‌ విజయ్‌రాఘవన్‌ స్పష్టం చేశారు. కేంద్ర ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. తొలి, రెండో వేవ్‌లో వైరస్‌ ఉద్ధృతిలో మార్పులకు పలు కారణాలను విశ్లేషించారు.

ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ ఇంత ఉద్ధృతంగా పెరగడానికి వైరస్‌లో మార్పులు, రోగనిరోధకత వ్యవస్థను తప్పించుకునే సామర్థ్యమున్న మ్యుటేషన్లు వంటి అంశాలు ప్రభావితం చేసినట్లు ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది. అయితే, రాబోయే రోజుల్లో ఎదురయ్యే మరిన్ని వేవ్‌ల ప్రభావం ఎక్కువ, లేదా తక్కువగా ఉంటుందనే విషయం చెప్పలేమని కేంద్ర ఆరోగ్యశాఖ నిపుణుల బృందం స్పష్టం చేసింది. వైరస్‌ ఎలాంటి మార్పులకు గురైనప్పటికీ.. వాటిని ఎదుర్కోవడానికి మన జీవనవిధానంలో మార్పులు, ఆధునీకరించిన వ్యాక్సిన్‌లతో ఎప్పటికప్పుడు సంసిద్ధంగా ఉండాల్సిందేనని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని