Chat GPT: కృత్రిమ మేధపై దిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

తీర్పు ప్రక్రియలో మానవ మేధస్సును ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ భర్తీ చేయలేదని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.

Published : 27 Aug 2023 20:56 IST

దిల్లీ: న్యాయవ్యవస్థ, తీర్పు ప్రక్రియలో కృత్రిమ మేధ(Artificial intelligence) మానవ మేధస్సును భర్తీ చేయలేదని దిల్లీ హైకోర్టు (Delhi HighCout) వ్యాఖ్యానించింది. కృత్రిమ మేధతో తయారైన ఏఐ అప్లికేషన్‌ చాట్‌జీపీటీ (ChatGPT) సేకరించిన ఆధారాలను అనుసరించి న్యాయస్థానాల్లో చట్టపరమైన తీర్పులకు తావులేదని పేర్కొంది. అయితే, చాట్‌జీపీటీ సేకరించిన ఆధారాలు ప్రాథమిక దర్యాప్తు కోసం ఉపయోగపడతాయని అభిప్రాయపడింది. భాగస్వామ్య సంస్థ తన ట్రేడ్‌ మార్క్‌ను ఉల్లంఘించిందంటూ ప్రముఖ పాదరక్షల ఉత్పత్తి సంస్థ క్రిస్టియన్‌ లౌబౌటిన్‌ వేసిన పరువునష్టం దావాపై చర్చ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం ఈ వాఖ్యలు చేసింది.

భారత్‌లో ‘రెడ్‌ సోల్‌ షూ’కి తమ సంస్థ ట్రేడ్‌మార్క్‌ ఉందని, అయితే తమ వాణిజ్య భాగస్వామి సంస్థ దీనిని పట్టించుకోకుండా కాపీ కొట్టి.. సొంత ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేస్తోందని దీనివల్ల తమ సంస్థ విశ్వసనీయత దెబ్బతింటోందని పేర్కొంటూ క్రిస్టియన్‌ లౌబౌటిన్‌ దిల్లీ హైకోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేసింది. చాట్‌జీపీటీ ద్వారా ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం చాట్‌బోట్ ఇచ్చిన డేటా చట్టపరమైన తీర్పులకు ఆధారం కాబోదని వ్యాఖ్యానించింది. అది సేకరించిన డేటాలో కచ్చితత్వం లోపించే అవకాశం ఉందని, ఊహాజనితమైన సమాచారం కూడా వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. అయితే తాజా కేసులో ఇరు వర్గాల ఉత్పత్తులను పరిశీలించినట్లయితే ఉద్దేశ పూర్వకంగానే ప్రతివాది.. పిటిషర్‌ ఉత్పత్తులను కాపీ కొట్టారని, ఆ బ్రాండ్‌ పేరును వాడుకొని డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడ్డారని స్పష్టంగా అర్థమవుతోందని తెలిపింది.

అయితే, వారిద్దరి వ్యాపార భాగస్వామ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పిటిషనర్‌ బూట్ల డిజైన్లను గానీ, రంగులనుగానీ ఎట్టిపరిస్థితుల్లోనూ కాపీ చేయరాదని ప్రతివాదిని ఆదేశించింది. ఈ మేరకు పిటిషనర్‌తో ఒప్పందం చేసుకోవాలని చెప్పింది. ఒక వేళ ఒప్పందాన్ని అతిక్రమించినట్లయితే రూ.25 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. మరోవైపు తాజా పిటిషన్‌ ఖర్చుల కింద ఫిర్యాదు దారుకు రూ.2 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని