Chandrayaan-3: ‘దుమ్ము’ రేపిన విక్రమ్‌..! 2 టన్నుల మట్టి చెల్లాచెదురు

‘విక్రమ్‌’ ల్యాండర్‌ చంద్రుడిపై దిగే సమయంలో అక్కడ పెద్దఎత్తున చంద్రుడి పైపొరలోని మట్టి పక్కకు జరిగినట్లు తేలింది.

Published : 27 Oct 2023 18:19 IST

బెంగళూరు: చంద్రుడిపై పరిశోధనలకు ఉద్దేశించిన చంద్రయాన్‌-3 (Chandrayaan-3).. ఆగస్టు 23న జాబిల్లిపై విజయవంతంగా అడుగుపెట్టింది. అయితే.. ‘విక్రమ్‌’ ల్యాండింగ్‌ సమయంలో శివశక్తి పాయింట్‌లో పెద్దఎత్తున చంద్రుడి పైపొరలోని పదార్థాలు (దుమ్మూధూళి, ఖనిజ, రాళ్ల శకలాల వంటివి) పక్కకు జరిగినట్లు తేలింది. దాదాపు 2.06 టన్నుల మేర పదార్థాలు ల్యాండింగ్‌ సైట్‌ చుట్టుపక్కలకు స్థానభ్రంశం చెందినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. తత్ఫలితంగా ఆ పదార్థాల (Lunar Material)తో విక్రమ్‌ ల్యాండర్‌ చుట్టూ భారీ వలయాకార పరిధి (Ejecta Halo) ఏర్పడినట్లు ‘ఎక్స్‌’ వేదికగా ఇస్రో (ISRO) వెల్లడించింది.

చంద్రయాన్-2 ఆర్బిటర్‌లోని ‘ఆర్బిటర్ హై-రిజల్యూషన్ కెమెరా (OHRC)’ సాయంతో ల్యాండింగ్‌కు ముందు, తర్వాతి ఫొటోలను విశ్లేషించి.. ఇస్రోకు చెందిన హైదరాబాద్‌లోని జాతీయ రిమోట్‌ సెన్సింగ్‌ కేంద్రం (NRSC) శాస్త్రవేత్తలు ఈ మేరకు అంచనాకు వచ్చారు. ల్యాండింగ్‌ సమయంలో.. ‘విక్రమ్‌’ థ్రస్టర్‌ల ప్రభావం, తదనంతరం పరిణామాల తర్వాత చంద్రుడి పైపొర (ఎపిరెగోలిథ్‌)లోని మట్టి ల్యాండర్‌ చుట్టూ 108.4 చదరపు మీటర్ల పరిధిలో విస్తరించినట్లు కూడా గుర్తించారు. దీనికి సంబంధించి విక్రమ్‌ చుట్టూ క్రమరహిత ప్రకాశవంతమైన మచ్చ గుర్తించినట్లు శాస్త్రవేత్తలు ఓ జర్నల్‌లో వివరించారు.

ఆ కొలిమి తోడుంటే.. విక్రమ్‌ నిద్ర లేచేదే!

ఇదిలా ఉండగా.. చంద్రయాన్‌-3 మిషన్‌లో భాగంగా జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుమోపిన విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌లు రెండు వారాలపాటు పరిశోధనలు సాగించి, ప్రస్తుతం నిద్రాణ స్థితిలో ఉన్నాయి. అవి తిరిగి క్రియాశీలంగా మారే అవకాశాలను కొట్టిపారేయలేమని ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ఇటీవల తెలిపారు. అందుకు ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని