Updated : 24 Feb 2020 20:30 IST

సీఏఏ ఆందోళన హింసాత్మకం

పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి.. డీసీపీకి గాయాలు
శాంతి భద్రతలు పునరుద్ధరించాలని కేంద్రానికి కేజ్రీవాల్‌ విజ్ఞప్తి

దిల్లీ: దిల్లీలోని సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య మరోసారి చోటు చేసుకున్న ఘర్షణ హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో రతన్‌ లాల్‌ అనే దిల్లీ పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ తలకు రాయి తగలడంతో మృతిచెందారు. డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ అమిత్ శర్మకు గాయాలయ్యాయి. తల, చేతి భాగాల్లో గాయాలు కావడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరికొందరు పోలీసులు ఘర్షణలో గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.

ఈశాన్య దిల్లీలోని జఫ్రాబాద్‌, మౌజ్‌పుర్‌, గోలక్‌పురి భజన్‌పురలో సోమవారం సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. స్వల్ప లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో పలు వాహనాలు, దుకాణాలు, ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఓ ఫైరింజన్‌ సైతం ధ్వంసమైందని అధికారులు తెలిపారు. ఆందోళన నేపథ్యంలో దిల్లీలోని జఫ్రాబాద్‌, మౌజ్‌పుర్‌-బాబర్‌ పుర్‌ మెట్రో స్టేషన్లను మెట్రో అధికారులు మూసివేశారు. 24 గంటల పాటు జఫ్రాబాద్‌ మెట్రో స్టేషన్‌ను మూసివేస్తున్నట్లు దిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ) పేర్కొంది. ఆదివారం సైతం ఇదే జఫ్రాబాద్‌ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

శాంతిభద్రతల్ని పునరుద్ధరించండి: కేజ్రీవాల్‌
సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య నెలకొన్న ఘర్షణలతో హింసాత్మకంగా మారిన ఈశాన్య దిల్లీలో శాంతిభద్రతలను పునరుద్ధరించాలని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్రాన్ని కోరారు. ఈశాన్య దిల్లీలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలను నిలువరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌లకు ఆయన విజ్ఞప్తి చేశారు. దిల్లీలో శాంతి, సామరస్యతలను దెబ్బతీసేలా జరుగుతున్న ఈ ఘటనలకు సంబంధించి వస్తున్న వార్తలు తననెంతో బాధిస్తున్నాయంటూ ఆయన ట్వీట్‌ చేశారు. 

దిల్లీ పోలీసులకు ఎల్‌జీ ఆదేశం
దిల్లీలో శాంతిభద్రతలను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించారు. పరిస్థితిని సునిశితంగా సమీక్షిస్తున్నట్టు చెప్పారు. శాంతి, సామరస్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సంయమనంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని బాబర్‌పూర్‌ ఎమ్మెల్యే గోపాల్‌ రాయ్‌ విజ్ఞప్తి చేశారు. కొందరు వ్యక్తులు దిల్లీలో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు మరింత మంది పోలీసులను మోహరించేలా చర్యలు తీసుకుంటామని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ హామీ ఇచ్చారంటూ ట్వీట్‌ చేశారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని