
నిర్భయ లాయర్ ఎవరో తెలుసా?
దోషుల న్యాయవాది ఏపీసింగ్పై నెటిజెన్ల ఆగ్రహం
దిల్లీ: నిర్భయ దోషులకు తిహాడ్ జైల్లో ఉరిశిక్ష అమలు చేసిన వెంటనే సోషల్మీడియాలో నెటిజెన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ పోరాటం తర్వాత నిర్భయ తల్లికి న్యాయం జరిగిందని, ఎట్టకేలకు నిర్భయ ఆత్మ శాంతించిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఆలస్యంగానైనా న్యాయం జరిగిందని పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా నిర్భయ తల్లి ఆశాదేవీ పోరాటాన్ని కొనియాడుతున్నారు. అలాగే ఆమె తరఫున వాదించిన న్యాయవాది సీమా కుష్వాహానీని ప్రశంసలతో ముంచుతున్నారు. ఇదిలా ఉండగా, దోషులను కాపాడేందుకు చివరి నిమిషం వరకూ తీవ్రంగా ప్రయత్నించిన మరో న్యాయవాది ఏపీసింగ్పై నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
2012 డిసెంబర్ 16న దక్షిణ దిల్లీలో కదులుతున్న బస్సులోనే 23 ఏళ్ల వైద్య విద్యార్థినిపై వవన్ గుప్తా, ముకేశ్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్లతో పాటు మరో ఇద్దరు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నిర్భయ స్నేహితుడిని సైతం తీవ్రంగా కొట్టి నడిరోడ్డుపై వారిని తోసేసి పరారయ్యారు. అనంతరం పదిహేను రోజులు మృత్యువుతో పోరాడిన నిర్భయ డిసెంబర్ 29న సింగపూర్ ఆస్పత్రిలో కన్నుమూసింది. అప్పట్లో ఈ ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఎట్టకేలకు దోషులకు శిక్ష పడడంతో దేశవ్యాప్తంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్భయ తరఫున వాదించిన సీమాను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
దోషుల ఉరితీత అనంతరం సీమా ఏమన్నారంటే..
‘దేశ రాజధాని దిల్లీలో ఇలాంటి ఘోరం చోటుచేసుకోవడం దారుణం, నిర్భయను కాపాడుకోలేకపోయినందుకు చాలా బాధగా ఉంది. దోషులకు శిక్ష పడడం చాలా సంతోషంగా ఉంది’ అని అన్నారు. ఈ సందర్భంగా దోషులను రక్షించడానికి యత్నించిన న్యాయవాది ఏపీ సింగ్ గురించి స్పందించాలని కోరగా.. ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాద వృత్తికి అతడు అర్హుడు కాదంటూ వ్యాఖ్యానించారు. కాగా, ఏపీ సింగ్ ఇటీవల పాటియాలా కోర్టు వద్ద మీడియాతో మాట్లాడుతూ దోషులపై సానుభూతి వ్యక్తం చేశారు. వాళ్లేమీ టెర్రరిస్టులు కాదని, మీడియా ఒత్తిడి వల్ల ఇప్పటికే మూడుసార్లు మానసికంగా మృతిచెందారని వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి:
దోషుల పూర్వాపరాలు ఇవే..
నిర్భయ దోషుల చివరి క్షణాలు ఇలా..
నిర్భయ దోషులకు ఉరి
నా కుమార్తెకు న్యాయం జరిగింది: నిర్భయ తల్లి
ఏడ్చా.. బాధపడ్డా.. భయపడ్డా.. పోరాడా..