కొవిడ్‌తో చిన్నారుల్లో ఎంఐఎస్‌-సి

ప్రపంచం నెత్తిన కొవిడ్‌-19 వచ్చిపడ్డాక అది పెద్దలు, చిన్నారుల్లో భిన్నరీతుల్లో ప్రభావం చూపుతుందని గుర్తించడానికి నిపుణులకు

Published : 07 Nov 2021 14:23 IST

అరుదే అయినా జాగ్రత్త అవసరం నిపుణుల హెచ్చరిక 

బ్రిస్బేన్‌: ప్రపంచం నెత్తిన కొవిడ్‌-19 వచ్చిపడ్డాక అది పెద్దలు, చిన్నారుల్లో భిన్నరీతుల్లో ప్రభావం చూపుతుందని గుర్తించడానికి నిపుణులకు ఎక్కువ సమయం పట్టలేదు. ఇన్‌ఫెక్షన్‌ సోకిన చిన్నారుల్లో 40-50 శాతం మందిలో దగ్గు, జ్వరం వచ్చినట్లు గత ఏడాది మార్చిలో వెలువడిన అధ్యయనం తేల్చింది. అయితే పెద్దలతో పోలిస్తే వీరిలో వ్యాధి లక్షణాలు చాలా స్వల్పంగానే ఉంటున్నట్లు గుర్తించారు. చిన్నారుల్లో తీవ్రస్థాయి కొవిడ్‌కు ఆస్కారం చాలా తక్కువని ఆ తర్వాత సేకరించిన డేటా కూడా సూచిస్తోంది. ఈ వ్యాధితో వారు మరణాల ముప్పూ అరుదేనని స్పష్టమైంది. అయితే కొద్ది మంది పిల్లలు తొలుత చాలా నామమాత్రపు లక్షణాలే కలిగి ఉన్నప్పటికీ నాలుగు వారాల తర్వాత ‘ఇన్‌ఫ్లమేటరీ రియాక్షన్‌’కు గురవుతున్నట్లు వైద్యులు గుర్తించారు. గత ఏడాది మేలో 18 మంది చిన్నారుల్లో ‘హైపర్‌ ఇన్‌ఫ్లమేటరీ షాక్‌’ ఉత్పన్నమైందని, వీరిలో ఒకరు మరణించినట్లు తొలిసారిగా గమనించారు. నిజానికి ఈ చిన్నారుల్లో చాలా మందికి కరోనా పరీక్షలో ‘నెగెటివ్‌’ వచ్చింది. వారిలో కొవిడ్‌ సంబంధ యాంటీబాడీలు మాత్రం ఉన్నాయి. దీన్నిబట్టి గతంలో వారు కొవిడ్‌ బారినపడినట్లు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)తో పాటు అమెరికా, బ్రిటన్‌లోని ఆరోగ్య సంస్థలు.. చిన్నారుల్లో కరోనాతో ముడిపడిన మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ (ఎంఐఎస్‌-సి)సమస్యను విశ్లేషించాయి.  

టీకాలతో ముప్పు తప్పుతుందా?

ప్రస్తుతానికి ఎంఐఎస్‌-సికి నిర్దిష్ట చికిత్స ఏదీ లేదు. వివిధ విభాగాల నిపుణులు ఈ వ్యాధిని అదుపు చేయడానికి కొన్ని సూచనలు చేస్తున్నారు. కార్టికోస్టెరాయిడ్లు, రక్త నాళాల ద్వారా ఇమ్యునోగ్లోబులిన్‌లు ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇన్‌ఫ్లమేషన్‌తో ముడిపడిన సైటోకైన్లను వంటివాటిని అడ్డుకునే చికిత్సలనూ ప్రయోగిస్తున్నారు. చాలావరకూ చిన్నారులు ఈ ఇబ్బంది నుంచి కోలుకుంటున్నారు. కొవిడ్‌ టీకాల ద్వారా చిన్నారుల్లో ఈ ముప్పును తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎంఐఎస్‌-సి పట్ల అప్రమత్తంగా ఉండాలని, లక్షణాలు కనిపిస్తే తక్షణం వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

ఈ వ్యాధి లక్షణాలేంటి?

ఎంఐఎస్‌-సిని గుర్తించే వ్యాధి నిర్ధారక పరీక్షలేమీ లేవు. కొవిడ్‌ వచ్చి తగ్గాక లేదా మహమ్మారి బారినపడిన సమయంలో చిన్నారుల్లో జ్వరం, ఇన్‌ఫ్లమేషన్‌కు సంబంధించిన సూచికల స్థాయి ఎక్కువగా ఉండటం, ఈ లక్షణాలు బయటపడటానికి నిర్దిష్టంగా నాలుగు వారాల ముందు కొవిడ్‌కు గురై ఉంటే.. దీన్ని ఎంఐఎస్‌-సిగా అనుమానించాలి. వీరిలో కడుపులో నొప్పి, వాంతులు, డయేరియా, చర్మంపై దద్దుర్లు, కళ్లకు ఇన్‌ఫెక్షన్, పెదాలపై పగుళ్లు, తీవ్రమైన కొన్ని కేసుల్లో అధిక రక్తపోటు, షాక్‌ వంటివి తలెత్తవచ్చు.  

*ఎంఐఎస్‌-సి ప్రధానంగా బడి ఈడు పిల్లల్లో ఉత్పన్నమవుతోంది. ఈ రుగ్మత వల్ల తలెత్తే ఇన్‌ఫ్లమేటరీ స్పందన.. తీవ్ర స్థాయి కొవిడ్‌కు, కవాసాకి వ్యాధికి భిన్నంగా ఉంటుందని పరిశీలనల్లో వెల్లడైంది. ఎంఐఎస్‌-సిలో యాంటీబాడీలు.. స్వీయ శరీరంపైనే పోరాటం చేస్తాయని తేలింది. అవి శరీర అవయవాల విధుల్లో జోక్యం చేసుకొని, ఇన్‌ఫ్లమేషన్‌ కలిగిస్తాయని, కొవిడ్‌ సోకిన నాలుగు వారాల తర్వాత లక్షణాలు బయటపడతాయని గుర్తించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని