Budget 2023: రూ.35,000 కోట్లతో హరిత ఇంధన వృద్ధి

కాలుష్య రహిత ఇంధన రంగానికి మారడానికి, కర్బన ఉద్గారాల్లో తటస్థత సాధించడానికి మూలధన పెట్టుబడిగా కొత్త బడ్జెట్లో రూ.35,000 కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

Updated : 02 Feb 2023 13:39 IST

కర్బన ఉద్గారాల తటస్థతకు పెద్దపీట  
ప్రాధాన్యాంశంగా చేర్చిన కేంద్రం

దిల్లీ: కాలుష్య రహిత ఇంధన రంగానికి మారడానికి, కర్బన ఉద్గారాల్లో తటస్థత సాధించడానికి మూలధన పెట్టుబడిగా కొత్త బడ్జెట్లో రూ.35,000 కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఏడు ప్రాధాన్యాల్లో అయిదో అంశంగా హరిత ఇంధనాన్ని చేర్చింది. పర్యావరణ హితమైన జీవనశైలికి ఊతమిచ్చి, 2070 నాటికి కర్బన తటస్థతను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో హరిత వెలుగుల్ని నింపనున్నట్లు ప్రకటించింది. పెట్రోలియం- సహజ వాయు మంత్రిత్వ శాఖ ఇంధన భద్రత సాధించడానికి కేంద్రం నిధులు వెచ్చించనుంది. వాతావరణ మార్పుల్ని ఎదుర్కొని 2070 నాటికి కర్బన ఉద్గారాలకు కళ్లెం వేయడానికి భారత్‌ తరఫున 2021 నవంబరులో గ్లాస్గో సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ ప్రతిజ్ఞ చేశారు. శిలాజేతర ఇంధనాల ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తును 2030 నాటికి 500 గిగావాట్లకు చేరుస్తామని కూడా ఆయన చెప్పారు. దీనికి అనుగుణంగా రూ.19,700 కోట్లతో ‘జాతీయ హరిత హైడ్రోజన్‌ మిషన్‌’ను ఇటీవల ప్రారంభించిన విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావించారు. శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకోవాల్సిన ఆవశ్యకతను తగ్గించి, తక్కువ కర్బన ఉద్గారాలుండే ఆర్థిక వ్యవస్థ వైపు మళ్లేందుకు ఈ మిషన్‌ ఊతమిస్తుందని చెప్పారు. ‘2030 నాటికి ఏటా 50 లక్షల టన్నుల హరిత హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. బ్యాటరీ ఇంధన నిల్వల వ్యవస్థలపై వ్యయ సర్దుబాటు నిధిని ప్రభుత్వం సమకూర్చి, మద్దతుగా నిలుస్తుంది. స్టోరేజీ ప్రాజెక్టులపై సవివర కార్యాచరణను రూపొందిస్తుంది. లద్దాఖ్‌లో రూ.20,700 కోట్ల ఖర్చుతో 13 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. పర్యావరణ పరిరక్షణ చట్టం కింద గ్రీన్‌క్రెడిట్‌ కార్యక్రమాన్ని ప్రకటిస్తాం. కంపెనీలు, వ్యక్తులు, స్థానిక సంస్థలు బాధ్యతాయుతమైన చర్యలు చేపట్టేలా చూసేందుకు ఇది ఉపయోగపడుతుంది’’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు