Delhi High Court: చాట్‌జీపీటీ ఆధారంగా తీర్పులివ్వలేం: దిల్లీ హైకోర్టు

మనిషి తెలివితేటలకు, న్యాయ నిర్ణయ ప్రక్రియలో మానవ జోక్యానికి- కృత్రిమ మేధస్సు ఓ ప్రత్యామ్నాయం కాదని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

Updated : 28 Aug 2023 08:59 IST

మానవ మేధస్సుకు కృత్రిమ మేధ ప్రత్యామ్నాయం కాదు
ప్రాథమిక అవగాహనకే అలాంటివి వాడుకోవాలని వ్యాఖ్య

దిల్లీ: మనిషి తెలివితేటలకు, న్యాయ నిర్ణయ ప్రక్రియలో మానవ జోక్యానికి- కృత్రిమ మేధస్సు ఓ ప్రత్యామ్నాయం కాదని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఓ తీర్పు వెలువరించడానికి, వాస్తవాలు తేల్చడానికి చాట్‌జీపీటీని ప్రాతిపదికగా తీసుకోలేమని తేల్చిచెప్పింది. ఇలాంటి చాట్‌బోట్‌ల కచ్చితత్వం, వాటిపై ఎంతవరకు ఆధారపడవచ్చనేది ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్నందున ప్రాథమిక పరిశోధన/ అవగాహన కోసం మాత్రం ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. వ్యాపార చిహ్న నిబంధనలను తమ భాగస్వామ్య సంస్థ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ.. విలాసవంతమైన చెప్పులు, బూట్లు తయారుచేసే ‘క్రిస్చన్‌ లూబటన్‌’ దాఖలు చేసిన ఓ కేసులో ఇటీవల జస్టిస్‌ ప్రతిభా ఎం సింగ్‌ తీర్పు వెలువరించారు. తమ నమోదిత వ్యాపార చిహ్నంపై, దాని ప్రతిష్ఠపై చాట్‌జీపీటీ ఏం చెబుతోందో చూడాలని సంస్థ తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ప్రశ్న ఏ తీరులో ఉందనే దానిని బట్టి, దానికి అందిన శిక్షణ ఆధారంగా చాట్‌బోట్‌లు సమాధానాలు ఇస్తుంటాయని, అవి తప్పు అయ్యే అవకాశాలూ లేకపోలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉద్దేశ పూర్వకంగానే ప్రతివాది.. పిటిషనర్‌ ఉత్పత్తులను కాపీ కొట్టారని, ఆ బ్రాండ్‌ పేరును వాడుకొని డబ్బు సంపాదించాలనే ఈ చర్యకు పాల్పడినట్లు స్పష్టంగా అర్థమవుతోందని తెలిపింది. పిటిషనర్‌ బూట్ల డిజైన్లను, రంగులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపీ చేయరాదని ప్రతివాదిని ఆదేశించింది. ఈ మేరకు పిటిషనర్‌తో ఒప్పందం చేసుకోవాలని చెప్పింది. దానిని అతిక్రమిస్తే రూ.25 లక్షలు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ప్రస్తుత పిటిషన్‌ ఖర్చుల కింద ఫిర్యాదిదారుకు రూ.2 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని