Indias space economy: 2040 నాటికి 40 బి.డాలర్లకు భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ

Indias space economy: అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు సంస్థలను ఆహ్వానించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని కీలక మైలురాయిగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ అభివర్ణించారు.

Updated : 26 Nov 2023 14:46 IST

తిరువనంతపురం: భారత అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థ (Indias space economy) 2040 నాటికి 40 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. ఏకేడీ వంటి విదేశీ ఏజెన్సీలు ఈ మొత్తం 100 బిలియన్‌ డాలర్ల వరకు వెళ్లే అవకాశమూ ఉందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. అలాగే శాస్త్రవేత్తలకు మెరుగైన పని వాతావరణమూ ఏర్పడుతుందని తెలిపారు.

‘‘ప్రస్తుతం భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ అంత ఆశాజనకంగా లేదు. కేవలం 8 బిలియన్‌ డాలర్లుగా మాత్రమే ఉంది. కానీ, వేగవంతమైన వృద్ధి నమోదు చేస్తున్నాం. ఐరోపా ఉపగ్రహాల ప్రయోగాల వల్ల 230- 240 మిలియన్‌ యూరోలు, అమెరికా శాటిలైట్ల ప్రయోగం నుంచి 170- 180 మిలియన్‌ డాలర్లు ఆర్జించాం’’ అని ఇస్రో తొలి రాకెట్‌ను ప్రయోగించి 60 వసంతాలు పూర్తయిన వేళ పీటీఐతో మాట్లాడుతూ జితేంద్ర సింగ్‌ అన్నారు.

అమెరికాలో వలే భారత్‌లోనూ ఏర్పాటు చేసిన ‘అనుసంధాన్‌ నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌’ వంటి సంస్థల వల్ల అంతరిక్ష రంగ అభివృద్ధికి బలమైన పునాదులు పడతాయని జితేంద్ర సింగ్‌ ఆకాంక్షించారు. ఇలాంటి చర్యల వల్ల మన అంతరిక్ష రంగంలోకి 70 శాతం వనరులు ప్రభుత్వేతర రంగాల నుంచే వస్తాయని తెలిపారు.

భారత అంతరిక్ష రంగం వనరుల కొరతను ఎదుర్కొన్నది నిజమేనని జితేంద్ర సింగ్‌ తెలిపారు. అయితే, విజ్ఞాన శాస్త్రంలో మనుకున్న అపార అనుభవం ద్వారా దాన్ని అధిగమించామని చెప్పారు. ఈ రంగంలో ఇతర దేశాలనూ అధిగమించే సత్తా మనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రుడిపై తొలుత వేరే దేశాలు కాలుమోపినప్పటికీ.. అక్కడ నీటి జాడలను కనుగొన్నది మాత్రం మనమేనని గుర్తుచేశారు.

అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు సంస్థలను ఆహ్వానించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని కీలక మైలురాయిగా జితేంద్ర సింగ్‌ అభివర్ణించారు. దీని వల్ల ఇటు నిధులతో పాటు అటు విజ్ఞానం పరంగానూ అదనపు వనరులు చేతికందాయని పేర్కొన్నారు. ఫలితంగా దేశంలో అంతరిక్ష రంగానికి పాపులారిటీ లభించిందన్నారు. చంద్రయాన్‌ ప్రాజెక్టులో ప్రతి వ్యక్తి తమకు తాము భాగస్వాములుగా భావించారని తెలిపారు.

భారత అంతరిక్ష రంగంలో గగన్‌యాన్‌ మరో కీలక మైలురాయిగా నిలిచిపోతుందని జితేంద్ర సింగ్‌ అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపే యోచనలో ఇస్రో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఓ దశ ప్రయోగాత్మక పరీక్షలు పూర్తయ్యాయి. 2025 నాటికి భారత్‌ ఓ వ్యోమగామిని రోదసీలోకి పంపి సురక్షితంగా తీసుకొస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అంతకంటే మూడు నెలల ముందు ఓ రోబోను పంపుతామని తెలిపారు. అది పూర్తిగా వ్యోమగామిలాగే వ్యవహరిస్తుందని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని