Chandrayaan-4: ఐదు మాడ్యూల్స్‌.. రెండు వాహక నౌకలు.. చంద్రయాన్‌-4 ప్రాజెక్టు వివరాలివే!

చంద్రయాన్‌-4 ప్రాజెక్టు రెండు దశల్లో ఉంటుందని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ వెల్లడించారు. ఇందుకోసం రెండు వాహక నౌకలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

Published : 06 Mar 2024 18:01 IST

బెంగళూరు: చంద్రయాన్‌-3 (Chandrayaan-3) విజయంతో జాబిల్లిపై తదుపరి ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) సిద్ధమవుతోంది. చంద్రయాన్-4 (Chandrayaan-4)/లునార్‌ పోలార్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ మిషన్‌ (LuPEx) పేరుతో చేపట్టబోయే ఈ ప్రాజెక్ట్‌ రెండు దశల్లో ఉంటుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌ తెలిపారు. దీనికోసం రెండు వాహక నౌకలను సిద్ధం చేయనున్నారు. ఇటీవల జరిగిన నేషనల్‌ స్పేస్‌ సైన్స్ సింపోజియమ్‌లో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ఇందులోభాగంగా చంద్రుడి పైనుంచి రాళ్లు, మట్టి నమూనాలను భూమి మీదకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గతంలో తెలిపారు. తాజాగా దీని గురించిన మరిన్ని వివరాలను వెల్లడించారు. 

చంద్రయాన్‌-4లో ప్రొపల్షన్, డిసెండర్‌, అసెండర్, ట్రాన్స్‌ఫర్‌, రీ-ఎంట్రీ అనే ఐదు మాడ్యూల్స్‌ ఉంటాయి. 

ప్రొపల్షన్‌ మాడ్యూల్‌: చంద్రయాన్‌-3లో మాదిరే భూకక్ష్య నుంచి జాబిల్లి కక్ష్యలోకి వెళ్లే సమయంలో చంద్రయాన్‌-4కు ఇది మార్గనిర్దేశం చేస్తుంది. 

డిసెండర్‌ మాడ్యూల్‌: ల్యాండర్‌ చంద్రుడిపై దిగడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. 

అసెండర్‌ మాడ్యూల్‌: జాబిల్లిపై రాళ్లు, మట్టి నమూనాలను రోవర్‌ సేకరించిన తర్వాత వాటిని ల్యాండర్‌ నుంచి భూ కక్ష్యలోకి తీసుకువస్తుంది. 

ట్రాన్స్‌ఫర్‌ మాడ్యూల్‌: చంద్రుడి కక్ష్య నుంచి అసెండర్‌ మాడ్యూల్‌ను భూమి పైకి పంపుతుంది. 

రీ-ఎంట్రీ మాడ్యూల్‌: ప్రాజెక్టులో ఈ మాడ్యూల్‌ కీలకంగా వ్యవహరిస్తుంది. కాప్య్సూల్‌ ఆకారంలో ఉండే ఇందులోనే నమూనాలు ఉంటాయి. 

క్యాన్సర్‌ను జయించాను: ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌

మొదటి మూడు మాడ్యుల్స్‌ను ఇస్రో భారీ అంతరిక్ష వాహక నౌక ఎల్‌వీఎం-3 ద్వారా పంపనున్నారు. మిగిలిన రెండింటిని పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (PSLV) తీసుకెళుతుందని సోమనాథ్‌ తెలిపారు. అయితే, వీటిలో ముందుగా ఏది ప్రయోగిస్తారనేది వెల్లడించలేదు. 

గతంలో ప్రకటించిన వివరాల ప్రకారం.. చంద్రయాన్‌-4లో 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండర్‌ దిగుతుంది. ఇందులో 350 కేజీల బరువున్న రోవర్‌ను (చంద్రయాన్‌-3లో రోవర్‌ బరువు 30 కేజీలు) పంపనున్నారు. ఇది కిలోమీటరు మేర చంద్రుడిపై తిరుగాడుతుంది. చంద్రయాన్‌-3 మిషన్ జీవితకాలం ఒక లునార్‌ డే (భూమిపై 14 రోజులతో సమానం) కాగా, చంద్రయాన్‌-4.. ఏడు లునార్‌ డే (భూమిపై సుమారు వంద రోజులు)లపాటు పని చేస్తుంది. ఈ సమయంలో రోవర్‌లోని పరికరాలు చంద్రుడిపై రాళ్లు, మట్టి నమూనాలను సేకరిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని